తాగునీరు అందించాలి
అన్ని గ్రామాలకు
నరసరావుపేట: జిల్లాలోని అన్ని గ్రామాలకు తాగునీరు సక్రమంగా సరఫరా చేయాలని నీటిపారుదల శాఖ అధికారులను జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో ఇరిగేషన్, వ్యవసాయ, ఉద్యాన, గ్రామీణ నీటి సరఫరా అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తాగునీటికి తొలి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. జిల్లాలోని ముఖ్యమైన రెండు రిజర్వాయర్లలో సరిపడా నీరు లేనందున సాగుకు ‘వారబందీ ప్రక్రియ’ ద్వారా నీటిని విడుదల చేయాలన్నారు. అన్ని చెరువులలో పూర్తిస్థాయి సామర్థ్యం మేరకు నీటిని నిల్వ చేయాలని పేర్కొన్నారు. పల్నాడు జిల్లాకు నిత్యంఎంత నీరు అవసరం వంటి విషయాలను నీటి పారుదల శాఖ అధికారులను అడిగి కలెక్టర్ తెలుసుకున్నారు. నీటి వృథా అరికట్టడంలో భాగంగా చెరువుల నుంచి నీరు లీకేజీ కాకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతులకు కూడా సాగునీటి సద్వినియోగంపై అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. జిల్లా వ్యవసాయ అధికారి ఇ.మురళి మాట్లాడుతూ... రైతులు వరి బదులుగా లాభదాయక పంటలు సాగు చేసుకోవాలని సూచించారు. ఇరిగేషన్ శాఖ చీఫ్ ఇంజినీర్ శ్యాంప్రసాద్, ఈఈలు మురళీకృష్ణ, శ్రీహరి, ప్రేమ్‌కుమార్, ఉద్యాన శాఖ అధికారి సీహెచ్‌వీ రమణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
రైతుల సమక్షంలోనే రీసర్వే నిర్వహణ
నార్నెపాడు (ముప్పాళ్ళ): రైతుల సమక్షంలోనే రీసర్వే ప్రకియ చేపట్టాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ముప్పాళ్ళ మండలం నార్నెపాడు గ్రామంలో రీసర్వే ప్రక్రియను శుక్రవారం పరిశీలించారు. సర్వే జరిగే పొలం యజమానితో పాటుగా హద్దుదారులైన రైతులను కూడా సిబ్బంది పిలవాలని సూచించారు. ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. సర్వే నెంబర్ల ఆధారంగా భూ విస్తీర్ణంపై ఆరా తీశారు. ఇప్పటి వరకు ఎంత మేర సర్వే పూర్తయిందో తెలుసుకున్నారు. సర్వే పూర్తయిన భూముల వివరాలు సమగ్రంగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సూచించారు. వెబ్‌ల్యాండ్ రికార్డుల ప్రకారం రీసర్వే పూర్తి చేయాలన్నారు. రైతులతోనూ మాట్లాడారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసిన వివరాలను తహసీల్దార్ కార్యాలయంలో పరిశీలించారు. సత్తెనపల్లి ఆర్డీవో రమణకాంత్‌రెడ్డి, తహసీల్దార్ ఎం.భవాని శంకర్, మండల సర్వేయర్ టి.సుధాకర్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
భూ అక్రమాలపై నివేదిక కోరిన జిల్లా కలెక్టర్
సాక్షి, నరసరావుపేట: పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల గ్రామంలోని ఎద్దుల బీడు విక్రయం వ్యవహారంపై జిల్లా కలెక్టర్ కార్యాలయం దృష్టి సారించింది. ఎద్దుల బీడు ఫర్ సేల్ అనే కథనాన్ని సాక్షి పత్రికలో శుక్రవారం ప్రచురించిన విషయం పాఠకులకు తెలిసిందే. ఈ కథనంపై జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు ఆరా తీశారు. అక్రమాలపై నివేదిక పంపాలని గురజాల ఆర్డీవోను ఆదేశించారు. దీంతో దాచేపల్లి తహసీల్దార్ కార్యాలయం అధికారులతో ఆర్డీవో మాట్లాడారు. పూర్తి నివేదిక సిద్ధం చేయాలని ఆదేశించారు. ఆర్‌ఎస్‌ఆర్‌తోపాటుగా ప్రస్తుత రికార్డులను పరిశీలిస్తున్నారు. మాజీ సర్పంచ్ కుటుంబం ఎంత భూమిని ఆన్‌లైన్ చేయించుకుంది? దీంట్లో అక్రమమెంత? వంటి విషయాలు తేల్చే పనిలో అధికారులు ఉన్నారు. రెవెన్యూ సిబ్బంది పాత్రపై కూడా ఆరా తీస్తున్నారు. సర్వేయర్, వీఆర్వోలు ఎద్దుల బీడు వద్దకు వెళ్లి పరిశీలించారు.
నీటిపారుదల శాఖ అధికారులకు కలెక్టర్ పి.అరుణ్ బాబు ఆదేశం
Comments
Please login to add a commentAdd a comment