రైతుల కన్నీటిలో ‘కూటమి’ కొట్టుకుపోవడం ఖాయం
● వైఎస్సార్ సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ధ్వజం ● ఎల్లో మీడియా విష ప్రచారంపై ఆగ్రహం
మాచర్ల: రాష్ట్రంలో మిర్చి రైతులతో పాటు వివిధ పంటలు పండించిన రైతులు గిట్టుబాటు ధర లేక అల్లాడిపోతుంటే వారిని ఓదార్చేందుకు వెళ్లిన మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని అత్యంత దారుణంగా విమర్శిస్తూ టీడీపీ నాయకులు, ఎల్లో మీడియా ప్రచారాన్ని వైఎస్సార్ సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఖండించారు. ఇది దుర్మార్గమైన చర్య అని పేర్కొన్నారు. మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డితో పాటు తమపై కూడా కేసులు పెట్టడం కూటమి ప్రభుత్వం నీచ సంస్కృతికి నిదర్శనమని మండిపడ్డారు. ఆయన గురువారం సాయంత్రం వైఎస్సార్ సీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆయన మాటల్లోనే ‘‘ ప్రజలు, రైతులు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి అండగా ఉండాల్సిందిపోయి రాష్ట్ర మంత్రులు మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన గురించి నిస్సిగ్గుగా మాట్లాడటం హేయమైన చర్య. రైతుల కష్టాలను వక్రీకరించి, తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మీరు చెప్పేదంతా అబద్ధాలు.. నేను చెబుతున్నాను.. రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులకు సవాల్ విసురుతున్నాను. వందలాది మంది పోలీసులను పెట్టుకొని మీ ఆఫీసుల్లో ఏసీ గదుల్లో కూర్చొని మాట్లాడటం కాదు.. ఇవే మాటలు మీకు దగ్గరలో ఉన్న గుంటూరు వెళ్లి మిర్చి యార్డులో రైతుల బాధలు వినండి. మీ సంగతేంటో ఆ రైతులు చెబుతారు. మీరు మాట్లాడకుండా.. మిమ్మల్ని మిరపకాయలు దంచినట్లు దంచేస్తారు. వైఎస్సార్‌సీపీ అధినేత పర్యటనలో ఉద్దేశపూర్వకంగా ఒక్క పోలీసునైనా పెట్టలేదు. జెడ్ ప్లస్ క్యాటగిరి ఉన్నా ఆయనను వెళ్లనీయకుండా ప్రయత్నాలు చేశారు. ఎవరూ ప్రభుత్వాన్ని ప్రశ్నించకూడదా? పోరాటాలు చేయకూడదన్నట్లు వ్యవహరిస్తున్నారు... మీలాంటి బెదిరింపు ఎత్తుగడలు, కుట్రలను పట్టించుకునే నాయకుడు జగన్ కాదని గుర్తుంచుకోండి. మీరు ఎన్ని వక్రీకరణలతో ఎల్లో మీడియాతో చెప్పినా, డ్రామాలంటూ చెప్పినా అది మీ ఆత్మవంచనే. గతంలో రైతులకు ఏ పంటకు ఎంత ధరలున్నాయో తెలుసుకోండి. 2022, 2023లో ధరలెలా ఉన్నాయో చెప్పండి. రైతుల సమస్యలకు పరిష్కారం కృషి చేసిన ఘనత జగన్‌మోహన్‌రెడ్డిదే.. ఆయన రైతులకు రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయటమే కాకుండా వారికి న్యాయం చేశారు. రైతులను ఇప్పుడు చంద్రబాబు పీడిస్తున్నారు. వైఎస్సార్ సీపీలో మిర్చి పంట రూ. 20వేల వరకు ఉంది. ఇప్పుడు రూ. 11వేలకు పడిపోయింది. రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి నెలకొంది. కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, కర్నూలు, అనంతపురం రైతుల పరిస్థితి ఇలాగే ఉంది. రైతులను ఆదుకోకుండా మోసగిస్తూ నిర్లక్ష్యం చేయటమే మీ తీరా? రైతుల సమస్యల గురించి తెలుసుకోవటానికి వెళితే మాజీ సీఎం, మరో ఏడుగురిపై అక్రమ కేసులు నమోదు చేసి ఏమి సాధిస్తారు. మీకు చేతనైతే మిర్చి, కంది, పత్తి రైతును ఆదుకునేలా చేయండి. ఆర్‌బీకే కేంద్రాల ద్వారా రైతులకు న్యాయం చేయండి. వైఎస్సార్ ప్రభుత్వం 2024 ముందు వరకు ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చిందో గుర్తు చేసుకోండి. రైతులపై ఒక్క రూపాయి మోపకుండా 54.55లక్షల మందికి రూ 7.80 కోట్లు నష్టపరిహారం కింద చెల్లించారు. అన్ని పంటలకు కనీస మద్దతు ధర నిచ్చాం. సీఎం చంద్రబాబు ఇప్పటికై నా కళ్లు తెరవండి. రైతు కన్నీళ్లు పెట్టుకుంటే అరిష్టమని మీరు మరచిపోతున్నారు. మీకు రైతులపై ప్రేమ ఉంటే గుంటూరు మిర్చి యార్డుకు వచ్చి వారితో మాట్లాడి అండగా నిలబడండి.. మమ్మల్ని ఇబ్బంది పెట్టినా ఫర్వాలేదు. కానీ రైతుల కోసం మీరు నిలబడకపోతే మాజీ సీఎం జగన్ ఆధ్వర్యంలో మా పోరాటం ముందుకు కొనసాగుతుంది’’అని పీఆర్కే తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment