ముక్కు మూసుకోవాల్సిందే..
నరసరావుపేట రూరల్: కోటప్పకొండ పుణ్యక్షేత్రం చెత్తతో నిండిపోయింది. తిరునాళ్లతో పోగైన వ్యర్థాలను తొలగించడంలో పంచాయతీ రాజ్ శాఖ నిర్లక్ష్యం కారణంగా ఎక్కడ చూసినా గుట్టలుగా వ్యర్థాలు దర్శనమిస్తున్నాయి. ప్రధాన రహదారుల వెంట కుళ్లిన వాటితో దుర్వాసన వస్తోంది. దీంతో స్థానికులతోపాటు భక్తులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ తిరునాళ్ల గత నెల 26వ తేదీన నిర్వహించారు. లక్షలాది మంది పాల్గొన్నారు. ఇది గడిచి నాలుగు రోజులైనా పారిశుద్ధ్య కార్యక్రమాలు మాత్రం చేపట్టలేదు. కొండ దిగువున ప్రధాన రహదారులు వెంట చెత్త పేరుకుపోయింది. తాత్కాలిక దుకాణాలు, చెరకు రసం దుకాణాల వ్యర్థాలు పోగయ్యాయి. ప్రభల నిధి, అధికారుల తాత్కాలిక వసతి గృహాల ప్రాంతం వద్ద ప్లాస్టిక్ కవర్లు, పేపర్ టీకప్పులు కుప్పలుగా దర్శనమిస్తున్నాయి. ప్రధాన సెంటర్‌లోని దుకాణాదారులు వ్యర్థాలను గోతాలలో రోడ్ల వెంట పడేశారు. అధికారులు వాటిని తొలగించకపోవడంతో దుర్వాసన వెదజల్లుతున్నాయి. కొన్ని స్వచ్ఛంద సంస్థలు అన్నవితరణ చేసి ఆకులను వదిలివెళ్లడంతో అవీ పోగయ్యాయి. ముక్కు మూసుకొని భక్తులు రాకపోకలు సాగించాల్సిన దుస్థితి నెలకొంది. పంచాయతీ రాజ్ శాఖ 350 మంది వరకు కూలీలను తిరునాళ్లకు విధుల్లో నియమించింది. సగం మంది కాంట్రాక్ట్ కార్మికులు. మూడు రోజులపాటు వీరు కొండ దిగువున పారిశుద్ధ్య కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తిరునాళ్ల అనంతరం అలసత్వం ప్రదర్శిస్తున్నారు. ఏటా తిరునాళ్ల ముగిసిన మరుసటి రోజు నుంచే పారిశుద్ధ్య పనులు జరిగేవి. వారం రోజులపాటు చెత్తను తొలగించేవారు. ఈ ఏడాది కనీసం ఇటువైపు చూసిన వారే కరవయ్యారు.
కోటప్పకొండలో పేరుకుపోయిన చెత్త తిరునాళ్లతో రోడ్ల వెంట భారీగా పోగు పడిన వ్యర్థాలు నాలుగు రోజులైనా పారిశుద్ధ్య పనులు శూన్యం గుట్టలుగా పేరుకుపోయిన చెత్తతో దుర్వాసన అధికారుల తీరుపై మండిపడుతున్న భక్తులు
కూలీల కొరతే కారణం
తిరునాళ్ల ఏర్పాట్ల కోసం మండలంలోని కాంట్రాక్ట్ కూలీలతోపాటు రోజువారీగా కొంతమందిని నియమించాం. తిరునాళ్ల తరువాత కూలీలు అందుబాటులో లేకపోవడంతో పారిశుద్ధ్య పనులు ప్రారంభించలేదు. కాంట్రాక్ట్ కూలీలకు ఆరోగ్య సమస్యలు కూడా మరో కారణం. సోమవారం నుంచి వ్యర్థాలు తొలగించే పనులు ప్రారంభిస్తాం.
– నాగానంద్, ఈవోపీఆర్‌డీ,
నరసరావుపేట మండలం
ముక్కు మూసుకోవాల్సిందే..
Comments
Please login to add a commentAdd a comment