పింఛన్లు తుంచేస్తున్నారు
నరసరావుపేట: కూటమి ప్రభుత్వం పింఛను లబ్ధిదారుల సంఖ్యను క్రమేపీ తుంచేస్తోంది. జిల్లాలో క్రమంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పొందే వారి సంఖ్య తగ్గిపోతుంది. గత తొమ్మిది నెలల కాలంలో 10,161మంది లబ్ధిదారులు తగ్గారు. తాజాగా పదో నెల ఏప్రిల్‌లో మరో 397మంది తగ్గారు. ఈనెల 2,71,568 మందికి అందజేయాల్సివుంది. ఒకటో తేదీ మంగళవారం నుంచి జిల్లాలో పంపిణీ మొదలు పెట్టగా సాయంత్రం 5.30నిమిషాలకు 2,45,715 (90.48శాతం) మందికి అందజేశారు. జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు దుర్గి మండలంలో స్వయంగా పర్యటించి లబ్ధిదారుల ఇంటికి వెళ్లి అందజేశారు. జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు పంపిణీ చేశారు. గత ప్రభుత్వం ముగిసి నూతన కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టేనాటికి జిల్లా వ్యాప్తంగా 2,82,126మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరికి గతేడాది జూలై మొదటి తేదీన కూటమి ప్రభుత్వం పింఛన్లు అందజేయటం మొదలు పెట్టింది. ఈ పది నెలల్లో 10,558 మంది లబ్ధిదారులు తగ్గటం గమనార్హం.
దుర్గిలో కలెక్టర్ ఆకస్మిక పర్యటన
దుర్గి: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను క్షేత్రస్థాయిలో పరిశీలించటం కోసం పల్నాడు జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు మంగళవారం దుర్గి మండలంలో ఆకస్మికంగా పర్యటించారు. కలెక్టర్ అరుణ్‌బాబు మండల కేంద్రమైన దుర్గిలో మొత్తం 1102 పెన్షన్‌లకు గాను వాటి వివరాలు తెలుసుకొని, స్థానిక ఎస్సీ కాలనీకి వెళ్లి పలువురికి ఆయన చేతుల మీదుగా పెన్షన్‌ను పంపిణీ చేశారు. వివిధ శాఖల అధికారులకు ప్రభుత్వ పథకాల గురించి వివరించి వారికి దిశానిర్దేశం చేశారు. ఎటువంటి అలసత్వం లేకుండా పథకాల అమలుకు తోడ్పాడాలని ఆదేశించారు. అనంతరం ఓబులేశునిపల్లె, గజాపురం గ్రామా ల మధ్యలో పశువుల కోసం నీటి తొట్టెల ఏర్పాటు కార్యక్రమంలో పాల్గొని భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు పశువులకు ఏర్పాటు చేస్తున్న నీటి తొట్టెలను ఉపయోగించుకోవాలన్నారు. వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ధర్మవరంలో ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించి రైతులను అభినందించారు. ఆయనవెంట ఆర్డీఓ మురళీకృష్ణ, తహసీల్దార్ ఐ.ఫణీంద్ర కుమార్, డీఎల్‌డీఓ డి.గబ్రూ నాయక్, పీడీ ఎం.సిద్ధలింగమూర్తి, ఏపీడీ మల్లిఖార్జున, ఎంపీడీఓ శివప్రసాద్ ఉన్నారు.
జిల్లాలో క్రమంగా తగ్గుతున్న పింఛన్లు
పది నెలల్లో 10,558 పింఛన్లు తగ్గుదల
ఈనెల 397 మందికి కోత


