అన్నదాతకు అకాల కష్టం
● కోతకొచ్చిన రబీ వరి పంట ● కళ్లాల్లోనే మిర్చి, కంది ● ధాన్యం కాపాడుకునేందుకు రైతుల తంటాలు ● వర్షం దెబ్బకి ధాన్యాన్ని నష్టానికి అమ్ముకున్న కొందరు రైతులు
పలుచోట్ల వర్షంతో అవస్థలు
కారెంపూడి: జిల్లాలోని పలు ప్రాంతాల్లో బుధవారం సాయంత్రం కురిసిన అకాల వర్షంతో కర్షకులు నానా అవస్థలు పడ్డారు. నోటి దగ్గరకొచ్చిన పంటను కాపాడుకోడానికి రైతులు పడరాని పాట్లు పడ్డారు. కారెంపూడి మండలంలో కళ్లాల్లో ఉన్న మిర్చి, ధాన్యం, కందులు తడిసి పోకుండా వాటిని కుప్పలుగా చేసి పట్టలు కప్పడంలో రైతులు తలమునకలయ్యారు. పట్టలు తీసుకుని పొలాలకు ఉరుకులు పరుగులు పెట్టి పొలాలలో కళ్లాలలో ఉన్న పంట ఉత్పత్తులు తడిసిపోకుండా పట్టలు కప్పి జాగ్రత్తలు తీసుకున్నారు. మబ్బులు పట్టగానే కళ్లాల్లో ఉన్న ధాన్యాన్ని, మిర్చిని చాలా మంది వచ్చిన ధరకు తెగనమ్మేశారు. కొందరు ఇప్పటికే కళ్లాల్లో ఆరిన పంటలను గోతాలకు పట్టి ఇళ్లు చేర్చుకున్నారు.
మాచర్లలో భారీ వర్షం
మాచర్ల: అత్యధిక ఎండతో ఇబ్బంది పడుతున్న మాచర్ల వాసులకు మారిన వాతావరణం కాస్తంత ఉపశమనం కలిగించింది. గురువారం మధ్యాహ్నం వాతావరణంలో ఆకస్మికంగా మార్పు వచ్చి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో ప్రజలు సేద తీరారు. పట్టణంలో లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు పారింది.


