రేపు చిలకలూరిపేటలో ‘పీజీఆర్‌ఎస్’
నరసరావుపేట: వచ్చే సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)ను చిలకలూరిపేట పట్టణంలో నిర్వహించనున్నామని జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పట్టణంలోని ప్రత్తిపాటి గార్డెన్స్‌లో ఉదయం 10గంటలకు పీజీఆర్‌ఎస్ ప్రారంభమవుతుందన్నారు. ప్రజలకు మరింత చేరువ చేసేందుకు నియోజకవర్గాల స్థాయిలో కార్యక్రమం నిర్వహించదలిచామన్నారు. అందులో భాగంగా తొలిసారిగా చిలకలూరిపేట నియోజకవర్గాన్ని ఎంపిక చేశామన్నారు. ఈ అవకాశాన్ని నియోజక ప్రజలు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా అధికారులతో కలిసి చిలకలూరిపేటలో ఫిర్యాదులు స్వీకరించడం జరుగుతుందని, అదే సమయంలో జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో సైతం ఫిర్యాదులు స్వీకరించేందుకు అధికారులు అందుబాటులో ఉంటారన్నారు.
మే 10న జాతీయ
లోక్ అదాలత్
నరసరావుపేటటౌన్: మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మే 10న జాతీయ లోక్ అదాలత్‌ను నిర్వహిస్తున్నట్లు మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, 13వ అదనపు జిల్లా న్యాయమూర్తి ఎన్.సత్యశ్రీ శనివారం తెలిపారు. అదాలత్‌లో అన్ని సివిల్ కేసులు, రాజీ పడదగిన క్రిమినల్ కేసులు, బ్యాంక్, రెవెన్యూ, మోటారు వాహన ప్రమాద, చెక్కు బౌన్స్, భరణం, కుటుంబ తగాదాలు, ముందస్తు వ్యాజ్యపు కేసులు పరిష్కారం అవుతాయన్నారు. ఈ అవకాశాన్ని కక్షిదారులు వినియోగించుకొని తమ సమయం, డబ్బును ఆదా చేసుకోవాలన్నారు.
హంస వాహనంపై
శ్రీలక్ష్మీ నరసింహస్వామి
నగరంపాలెం: గుంటూరులోని ఆర్.అగ్రహారం శ్రీరాజ్యలక్ష్మీ సమేత లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. శనివారం స్వామికి హంస వాహనంపై పురవీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు. భక్తులు పెద్దసంఖ్యలో దర్శించుకున్నారు. భక్తులకు అర్చకులు తీర్థ ప్రసాదాలను అందించారు. కార్యక్రమాలను ఈఓ ఎస్.ఆంజనేయాచార్యులు పర్యవేక్షించారు.
రేపు పోలీసు పాత వాహనాల విడిభాగాల వేలం
నరసరావుపేట: పల్నాడు పోలీసు కార్యాలయంలో పోలీసు వాహనాలకు సంబంధించి వాడి తీసివేసిన సామగ్రిని ఈనెల ఏడవతేదీ సోమవారం ఉదయం 10:30 గంటలకు ఎస్పీ కార్యాలయంలోని మోటారు వాహన కార్యాలయంలో వేలం వేస్తున్నట్లు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆసక్తి ఉన్నవారు వేలంలో పాల్గొనాలని కోరారు.
8 నుంచి చైత్రమాస బ్రహ్మోత్సవాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రి చైత్రమాస బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతోంది. ఈ నెల 8వ తేదీ మంగళవారం నుంచి ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాల నిర్వ హణకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 8వ తేదీ వెండి పల్లకిపై, 9న వెండి రథోత్సవం, 10న రావణ వాహనంపై, 11న నంది వాహనంపై, 12న సింహ వాహనంపై, 13 సాయంత్రం కృష్ణానదిలో నదీ విహారం ఉంటుంది. ఉత్సవాల్లో తొలిరోజు ప్రత్యేక పూజలు చేస్తారు. 11వ తేదీ రాత్రి 7 గంటలకు మల్లేశ్వరస్వామి ఆలయం వద్ద రాయబార ఉత్సవం(ఎదుర్కోలు ఉత్సవం) జరుగుతుంది. ఆ రోజు రాత్రి 10.30 గంటలకు ఆది దంపతుల దివ్య కల్యాణోత్సవం చేస్తారు. 12వ తేదీ సదస్యం, వేదస్వస్తి, వేదాశీస్సుల కార్యక్రమాన్ని మల్లేశ్వర స్వామి ఆలయం వద్ద నిర్వహిస్తారు. 13వ తేదీ ఉదయం 9 గంటలకు పూర్ణాహుతి, ధాన్యకోట్నోత్సవం, వసంతోత్సవం, ధ్వజావరోహణంతో ఉత్సవాలు పరిసమాప్తమవుతాయి. 14వ తేదీ ద్వాదశ ప్రదక్షిణలు, 15, 16 తేదీల్లో పవళింపు సేవలతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.
రేపు చిలకలూరిపేటలో ‘పీజీఆర్‌ఎస్’


