రియల్..ఢమాల్
● కొత్త ప్రభుత్వంలో నూతన వెంచర్ల జోలికి వెళ్లని వ్యాపారులు ● పాత వెంచర్లకు కప్పం కట్టాలంటున్న కూటమి నేతలు ● రిజిస్ట్రేషన్ వేల్యూ పెంపు, చార్జీల మోతతో వెనుకడుగు వేస్తున్న రియల్టర్లు, ప్రజలు ● జిల్లాలో 60 శాతం కూడా సమకూరని రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం ● రూ.664.18 కోట్ల లక్ష్యానికి వచ్చింది రూ.396.98 కోట్లే ● నరసరావుపేట, పిడుగురాళ్లలో సగానికి పైగా పడిపోయిన రిజిస్ట్రేషన్లు
సాక్షి, నరసరావుపేట, నరసరావుపేట టౌన్: జిల్లాలో రియల్ ఎస్టేట్ రంగం కష్టాల్లో కూరుకుపోయింది. కొత్త ప్రభుత్వ ఏర్పాటు తర్వాత ఈ రంగం పూర్తిగా చితికలపడింది. కొనుగోలు, అమ్మ కాలు భారీగా తగ్గిపోయి, మార్కెట్ పూర్తిగా నిలిచిపోయింది. ప్రభుత్వ మార్పు తర్వాత రియల్ ఎస్టేట్‌లో భారీ ఊపు వస్తుందని కూటమి నేతలు చేసిన అభూతకల్పన వీగిపోయింది. వారి మాటలు నమ్మి వ్యాపారాలు బాగుంటాయని భావించిన ఇన్వెస్టర్లు, డెవలపర్లు ఇప్పుడు తీవ్ర నిరాశలో మునిగిపోయారు. కొత్త ప్రాజెక్టులు ఆగిపోయాయి, ఖరీదైన ప్లాట్లు, ఇళ్లు కొనుగోలు చేయాలనే ఆసక్తి కనపడటం లేదు. ఉన్న వెంచర్లలో డెవలప్ చేసిన స్థలాలను సైతం అమ్ముకోలేని దుస్థితి నెలకొంది.
60 శాతం కూడా సమకూరని ఆదాయం...
రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం 2024–25 ఆర్థిక సంవత్సరంలో గణనీయంగా పడిపోయింది. భూముల విలువ, రిజిస్ట్రేషన్ చార్జీలను కూటమి ప్రభుత్వం ఇబ్బడిముబ్బడిగా పెంచడంతో పాటు కూటమి పార్టీల నేతల భూ ఆక్రమణలు, బెదిరింపుల నేపథ్యంలో స్థిరాస్తుల క్రయ విక్రయాలు మందగించాయని అధికారిక లెక్కల ద్వారా తేటతెల్లమవుతోంది. జిల్లాలోని ప్రజాప్రతినిధులు కప్పం కట్టనిదే నూతన వెంచర్లకు అనుమతులు ఇప్పించకపోవడంతో రియల్టర్లు ముందుకు రావడం లేదు. మరోవైపు గతంలో వేసిన వాటికి సైతం బెదిరించి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. ఇది ఇలా ఉండగా రెవెన్యూ కార్యాలయాల్లో కన్వర్షన్లు చేయించుకునేందుకు పెద్ద మొత్తంలో నగదు ముట్టజెప్పాల్సి వస్తోంది. 2024–25 ఆర్థిక సంవత్సరానికి గాను పల్నాడు జిల్లా రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయ లక్ష్యం రూ.664.18 కోట్లు కాగా కేవలం రూ.396.98 కోట్లు మాత్రమే సమకూరింది. లక్ష్యంలో కేవలం 60 శాతం మాత్రమే వచ్చిందటే జిల్లాలో రియల్ ఎస్టేట్ ఏవిధంగా పడిపోయిందో జరిగిందో ఆర్థం చేసుకోవచ్చు. అదే విధంగా ఆదాయ పరంగా మొదటి వరుసలో ఉండే పలు రిజిస్ట్రేషన్ కార్యాలయాలు వెనుకబడ్డాయి. నరసరావుపేట, పిడుగురాళ్ల, చిలకలూరిపేట, వినుకొండ లాంటి చోట్ల దాదాపు సగం లక్ష్యమే సాధించింది. మరోవైపు గత సంవత్సరంతో పోల్చి చూస్తే భూమి విలువ పెరిగిన కారణంగా రిజిస్ట్రేషన్ శాఖకు ఆదాయం వచ్చింది తప్ప క్రయవిక్రయాలు చాలా తగ్గుముఖం పట్టాయి. అభివృద్ధిచెందుతున్న ఈ పట్టణాల్లోనే భూముల కొనుగోలుకు ఆసక్తి చూపకపోవడమే దీనికి ప్రధాన కారణం.
కూటమి ప్రభుత్వంలో కుప్పకూలిన రియల్ ఎస్టేట్
కొత్త వెంచర్ల ఊసేది?
పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట విద్యా, వాణిజ్య, ఆరోగ్య కేంద్రంగా పేరొందింది. అటువంటి నరసరావుపేటలో గత ప్రభుత్వం హయాంలో రియల్ ఎస్టేట్ ఓ వెలుగు వెలిగింది. నిత్యం ఏదో ఒక ప్రాంతంలో నూతన వెంచర్లు ఏర్పాటు, అపార్ట్‌మెంట్ల నిర్మాణం, బ్రోచర్ల ఆవిష్కరణలతో రియల్ ఎస్టేట్ మార్కెట్ సందడిగా ఉండేది. గడిచిన 10 నెలల్లో ఒక్క కొత్త వెంచర్ కూడా రాలేదు. భూములు కొని ప్లాట్‌లు వేద్దామన్న ఇన్వెస్టర్లే లేరు. అంతెందుకూ గతంలో వెంచర్లలలో కట్టిన ఇళ్ల కొనుగోళ్లు కూడా నిలిచిపోయాయి. నరసరావుపేట పట్టణ, శివారు పరిధిలో ఏటా అపార్ట్‌మెంట్లలో వందల సంఖ్యలో ఫ్లాట్ల అమ్మకాలు జరిగేవి. కానీ గడిచిన పది నెలల్లో కనీసం 50 ఫ్లాట్లు కూడా అమ్ముడుపోలేదు. దీంతో పాటు జిల్లాలో ఇతర పట్టణాల్లో కూడా స్థిరాస్తి క్రయవిక్రయాలు మరింత దిగజారినట్టు రియల్‌ఎస్టేట్ ప్రముఖులు చెప్పుకొస్తున్నారు.
రియల్..ఢమాల్


