జై చెన్నకేశవ.. జైజై చెన్న కేశవా!
మాచర్ల: మాచర్ల పట్టణంలో వేంచేసియున్న శ్రీలక్ష్మీ చెన్నకేశవ స్వామి తిరునాళ్లకు సర్వం సిద్ధమైంది. చంద్రవంక నదీ తీరాన శ్రీలక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయం పుణ్యక్షేత్రంగా ప్రఖ్యాతిగాంచింది. ఈనెల 10 నుంచి జరగనున్న చెన్నకేశవుని ఉత్సవాలకు పూర్తి స్థాయి ఏర్పాట్లు చేశారు. కల్యాణం, రథోత్సవం రోజుల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆలయాన్ని ప్రత్యేకంగా ముస్తాబు చేశారు.
చెన్నకేశవ విగ్రహ స్వరూపం
స్వామి వారు శిరస్సున శిఖయును, నాలుగు హస్తములు, శంఖుచక్రాలు ధరించి, తిరుమణితో మీసాలు మెలితిప్పి పల్నాటి వీరగాథ గుర్తు చేసేలా దర్శనమిస్తారు. శ్రీలక్ష్మీ చెన్నకేశవ స్వామి మకరతోరణం మధ్య భాగం ఎంతో అందంగా ఉంటుంది. కీర్తిముఖుడైన స్వామిగా శ్రీలక్ష్మీ చెన్నకేశవుడుగా విరాజిల్లుతున్నాడు.
ఏటా రెండుసార్లు..
శ్రీదేవి భూదేవి సమేత శ్రీలక్ష్మీ చెన్నకేశవ స్వామికి ఏటా రెండు పర్యాయాలు కల్యాణమహోత్సవం జరుగుతుంది. ఒకసారి చైత్ర మాసంలో, రెండోసారి మకర సంక్రాంతి రోజున అంగరంగ వైభవంగా కల్యాణం జరుపుతారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా చైత్ర పున్నమి రోజున శ్రీదేవి భూదేవి సమేత శ్రీలక్ష్మీచెన్నకేశవ స్వామి ఆలయంలో కల్యాణం నేత్రపర్వంగా జరుగుతుంది. వేలాది మంది కల్యాణం జరిగే రోజు రాత్రి తరలివస్తారు.
ఈనెల 10 నుంచి 17వరకు..
శ్రీలక్ష్మీచెన్నకేశవ స్వామి వారిని 60 అడుగుల రథంపై ఊరేగిస్తారు. లక్షలాది మంది భక్తులు తరలివచ్చి జై చెన్నకేశవ అంటూ రథోత్సవం జరపనున్నారు. మాచర్ల పురవీధులు జన సంద్రం కానున్నాయి. కాంచనపల్లి వంశస్థులు పూజా కార్యక్రమాలు నిర్వహించి కలశాన్ని రథంపై ఉంచి ఉత్సవమూర్తులను అలంకరించి ఊరేగిస్తారు. ఇంతటి ఘన చరిత్ర కలిగిన చెన్నుని ఉత్సవాలు ఈ నెల 10 నుంచి ప్రారంభమై 17వ తేదీ వరకు జరుగుతాయి. కల్యాణంతో ఉత్సవాలు ముగుస్తాయి.
చెన్నకేశవ తిరునాళ్లకు సర్వం సిద్ధం రేపటి నుంచి ఉత్సవాలు ప్రారంభం ఏర్పాట్లు పూర్తిచేసిన ఆలయ అధికారులు


