కానిస్టేబుల్ బెదిరింపులతో రౌడీషీటర్ ఆత్మహత్యాయత్నం
సత్తెనపల్లి: కానిస్టేబుల్ బెదిరింపులతో రౌడీషీటర్ ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాలు .. పట్టణంలోని 29వ వార్డుకు చెందిన రౌడీషీటర్ షేక్ ఖాసిం సైదా అలియాస్ అండను పట్టణ పోలీస్‌స్టేషన్‌లో రైటర్‌గా విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ రవీంద్ర బెదిరింపులు గురి చేస్తున్నాడు. దీంతో సోమవారం సత్తెనపల్లి మండలం పాకాలపాడు వద్ద ఎలుకల మందు తిని ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబ సభ్యులు గమనించి చికిత్స నిమిత్తం ఏరియా వైద్యశాలకు తరలించగా, చికిత్స పొందుతున్నాడు. ఈ సందర్భంగా ఖాసిం సైదా మాట్లాడుతూ కౌన్సెలింగ్ పేరుతో కానిస్టేబుల్ రవీంద్ర తనను వేధింపులకు గురి చేస్తున్నాడని, రూ.లక్షలు ఇవ్వాలని ఇబ్బంది పెడుతున్నాడని తెలిపాడు. పట్టణ సీఐకు తనపై అబద్ధాలు చెబుతూ వేధింపులకు గురి చేస్తున్నాడని ఆరోపించాడు. ఖాసిం సైదా, రవీంద్రల మధ్య కేసుకు సంబంధించి డబ్బు విషయంపై జరిగిన సంభాషణ ఆడియో సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం వైరల్‌గా మారింది. 6 నెలల క్రితం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద పట్టణంలోని నాగన్నకుంట ఏరియాకి చెందిన వెంకటేశ్వర్లుపై నమోదైన కేసులో రాజీ కోసం జరిగిన సంభాషణ ఆడియోను తీసుకొని కానిస్టేబుల్ రవీంద్ర వేధింపులకు గురి చేస్తున్నాడంటూ రౌడీషీటర్ ఖాసిం సైదా తప్పుడు ప్రచారం చేస్తున్నాడని పోలీస్ వర్గాలు చెబుతున్నాయి. గత ఆదివారం రౌడీషీటర్లను కౌన్సెలింగ్‌కు పిలిచిన నేపథ్యంలో ఖాసింసైదాను కూడా పిలవడంతో తన స్నేహితుడైన వెంకటేశ్వర్లు వద్ద ఆరు నెలల క్రితం ఉన్న ఆడియోను తీసుకొని దుష్ప్రచారం చేస్తూ సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేశాడని పోలీసు వర్గాలు విమర్శిస్తున్నాయి. ఈ వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. తనపై ఉన్న కేసుల నుంచి తప్పించుకునేందుకు పోలీసులపై ఖాసిం సైదా తప్పుడు ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో ఆడియోను విడుదల చేశాడని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పట్టణ సీఐ బొప్పన బ్రహ్మయ్య తెలిపారు. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఇరువురి మధ్య సంభాషణ ఆడియో వైరల్


