చెన్నుని బ్రహ్మోత్సవాలలో గరుడ వాహనం
మాచర్ల రూరల్: శ్రీలక్ష్మీచెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామి వారిని గరుడు వాహనంపై ఊరేగించనున్నారు. మంగళవారం ఆలయ ప్రధాన అర్చకులు కొండవీటి రాజగోపాలాచార్యులు ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామి వారి ఊరేగింపును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్నాటి ప్రజల ఇలవేల్పు శ్రీలక్ష్మీచెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయన్నారు. భక్తులు వేలాదిగా తరలివస్తారన్నారు. ఈఓ ఎం. పూర్ణచంద్రరావు, జేఏ వీరారెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు కొమెర అనంతరాములు, బండ్ల బ్రహ్మం, గాజుల గణేష్, కోమటి వీరు, మద్దిగపు శ్రీనివాసరెడ్డి, సుంకె వాసు, తదితరులు పాల్గొన్నారు.
ఎస్సీ సంక్షేమ శాఖ డీడీగా రాజా దేబోరా
నెహ్రూనగర్: గుంటూరు జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌గా రాజా దేబోరా నియమితులయ్యారు. ప్రస్తుతం ఇక్కడ డీడీగా పనిచేస్తున్న డి.మధుసూదన్‌రావు 3 నెలలకుపైగా సెలవుపై వెళ్లడంతో ఇప్పటి వరకు ఏఓగా పనిచేస్తున్న మాణిక్యవరరావు ఇన్‌చార్జిగా వ్యవహరించారు. తాజాగా ఆయన స్థానంలో బాపట్ల జిల్లా ఎస్సీ వెల్ఫేర్ డీడీగా పనిచేస్తున్న రాజ్ దేబోరాకు గుంటూరు జిల్లా డీడీగా (పూర్తి అదనపు) బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
వెబ్‌సైట్‌లో ఎస్‌ఏల
సీనియార్టీ జాబితా
గుంటూరు ఎడ్యుకేషన్: పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశాల మేరకు ఉమ్మడి గుంటూరు జిల్లాలోని జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో గ్రేడ్–2 హెచ్‌ఎం పోస్టులను ఉద్యోగోన్నతులతో భర్తీ చేసేందుకు అర్హత కలిగిన స్కూల్ అసిస్టెంట్లతో రూపొందించిన తాత్కాలిక సీనియార్టీ జాబితాను విడుదల చేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుక మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. డీఈవోజీఎన్‌టీ.బ్లాగ్‌స్పాట్.కామ్ సైట్‌లో ఉంచిన సీనియార్టీ జాబితాపై ఏమైనా అభ్యంతరాలు ఉన్న పక్షంలో ఈ నెల 20వ తేదీలోపు గుంటూరు డీఈవో కార్యాలయంలో లిఖిత పూర్వకంగా సమర్పించాలని తెలిపారు. మున్సిపల్ యాజమాన్యంలోని పాఠశాలల్లో ఉద్యోగోన్నతులకు అర్హులైన ఉపాధ్యాయులతో సీనియార్టీ జాబితాను ఇప్పటికే విడుదల చేశామని గుర్తుచేశారు.
వక్ఫ్ సవరణ బిల్లును
ఉపసంహరించుకోవాలి
మాజీ ఎమ్మెల్యే జియావుద్దీన్
కొరిటెపాడు(గుంటూరు): వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించిన వైఎస్సార్ సీపీ ముస్లింల పట్ల అంకితభావం చాటుకుందని గుంటూరు మాజీ ఎమ్మెల్యే, మైనార్టీ వ్యవహారాల రాష్ట్ర ప్రభుత్వ మాజీ సలహాదారు ఎస్.ఎం.జియావుద్దీన్ అన్నారు. గుంటూరులోని తన కార్యాలయంలో మంగళవారం మీడియాతో మాట్లాడారు. వక్ఫ్ బిల్లు విషయంలో తెలుగుదేశం పార్టీ ద్వంద్వ విధానాలను అనుసరిస్తోందని విమర్శించారు. ముస్లింలకు మంచి చేసే సంస్థలను నీరుగార్చేలా కేంద్రంలోని బీజేపీ కూటమి కుయుక్తులకు పాల్పడుతోందని దుయ్యబట్టారు.ఈ విషయంలో కూటమి ప్రభుత్వ అధినేత చంద్రబాబునాయుడు, జనసేన నేత పవన్ కల్యాణ్ ఎందుకు మౌనం వీడటం లేదని ప్రశ్నించారు.
సాగర్ నీటిమట్టం
విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం మంగళవారం 515.20 అడుగుల వద్ద ఉంది. ఇది 140.6684టీఎంసీలకు సమానం.


