వెయిట్ లిఫ్టింగ్‌లో సత్తా చాటడం అభినందనీయం
పెదకాకాని: వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో సత్తా చాటి జిల్లాకు మంచిపేరు తేవడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి అన్నారు. పెదకాకాని మండలం ఉప్పలపాడు జెడ్పీ హైస్కూల్‌లో 10వ తరగతి చదువుతున్న బిట్రా రోచిష్మతి ఈనెల 7వ తేదీ నుంచి 12 వరకు మణిపూర్‌లో జరిగిన 68వ జాతీయస్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొంది. అండర్–17 విభాగంలో పాల్గొన్న రోచిష్మతి ఉత్తమ ప్రతిభ కనబరచి సిల్వర్ మెడల్ సాధించింది. ఈ సందర్భంగా బుధవారం జిల్లా కలెక్టరేట్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో రోచిష్మతిని డీఈఓ రేణుక సమక్షంలో కలెక్టర్ నాగలక్ష్మి సత్కరించారు. జిల్లా ఖ్యాతిని జాతీయ స్థాయిలో ఇనుమడింపజేయడమే కాకుండా రానున్న రోజుల్లో అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని దేశానికి మంచిపేరు తేవాలని కలెక్టర్ ప్రోత్సహించారు. అదేవిధంగా పాఠశాల పీఈటీ చండ్ర వినయ్‌కుమార్‌ను అభినందించారు. వ్యాయామ ఉపాధ్యాయ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల కరీముల్లా చౌదరి, గుంటూరు జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘ అధ్యక్షుడు యార్లగడ్డ శ్రీనివాస్, జిల్లా సెక్రటరీ మెల్లెంపూడి రవి, నేషనల్ టీం కోచ్ నాగ శిరీష తదితరులు పాల్గొన్నారు.


