సత్తెన్న ఆశయ సాధనకు కృషి చేయాలి
రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవళ్ల మురళి
సత్తెనపల్లి: సత్తెన్న ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవళ్ల మురళి పిలుపునిచ్చారు. పట్టణంలోని తాలూకా సెంటర్‌లో సోమవారం సత్తెన్న విగ్రహ మూడవ వార్షికోత్సవం జరిగింది. పట్టణ, నియోజకవర్గ వడియ రాజుల సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో సత్తెన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేవళ్ళ మురళి మాట్లాడుతూ సత్తెన్న ఆశయ సాధన కోసం వడ్డెరలంతా కలిసి కట్టుగా పని చేయాలన్నారు. ముఖ్యంగా వడ్డెరలను ఎస్టీ జాబితాలో చేర్పించేందుకు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలన్నారు. కొండ కోరీలు అనేవి వడ్డెరుల హక్కు అని, ప్రస్తుతం వాటిని కొన్ని రాజకీయ పార్టీలు కొల్ల గొడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కొండ కోరీలలో 30 శాతం లీజులు లేకుండా కేటాయించాలని, కాంట్రాక్ట్ పనులలో ఈఎండీ లేకుండా 30 శాతం కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వడ్డెర సంఘ నాయకులు బత్తుల సాంబశివరావు, కొమెర శివశంకరరావు, కందులూరి నాగేశ్వరరావు, దేవళ్ల నాగయ్య, తిరుపతి సురేష్, వేముల వరప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.
సత్తెన్న ఆశయ సాధనే లక్ష్యం..
సత్తెనపల్లి: సత్తెన్న ఆశయ సాధనే లక్ష్యంగా పని చేద్దామని ఏపీ వడియరాజుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు, హైకోర్టు న్యాయవాది వేముల బేబీ రాణి పిలుపు నిచ్చారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని తాలూకా సెంటర్‌లో సత్తెనపల్లి గడ్డ ఎత్తిన సత్తెన్న విగ్రహావిష్కరణ మూడో వార్షికోత్సవం సందర్భంగా సోమవారం సత్తెన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వడ్డెర సంఘ నాయకులు ఒంటిపుల్లి నాగేశ్వరరావు, వేముల శ్రీదేవి, పల్లపు లక్ష్మయ్య తదితరులు ఉన్నారు.


