నరసరావుపేట: ప్రతి నెలా నాలుగో శనివారం ఎస్సీ, ఎస్టీల కోసం ప్రత్యేకంగా నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ ఎస్)ను యథావిధిగా శనివారం ఉదయం 10 గంటలకు కలెక్టరేట్‌లో నిర్వహించనున్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు శుక్రవారం వెల్లడించారు. జిల్లాలోని ఎస్సీలు, ఎస్టీలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
వీర్ల అంకమ్మ కొలుపుల తిరునాళ్ల ప్రారంభం
దాచేపల్లి: వీర్ల అంకమ్మ కొలుపుల తిరునాళ్ల శుక్రవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా అమ్మ వారిని ప్రత్యేకంగా అలంకరించారు. బొడ్రాయికి జలాభిషేకం చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. పూజలు చేసి, మొక్కులు తీర్చుకున్నారు.
28న మాచర్ల వైస్ చైర్మన్ ఎన్నిక
మాచర్ల: మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక ఈ నెల 28న కౌన్సిల్ హాలులో నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ డి.వేణుబాబు శుక్రవారం తెలిపారు. ఆ రోజు ఉదయం 11 గంటలకు ఈ ఎన్నిక జరుగుతుందన్నారు. ఎన్నికల అధికారుల ఆదేశాల మేరకు దీనిని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు పాల్గొనాలని కోరారు. మున్సిపల్ వైస్ చైర్మన్‌గా ఉండి, తాత్కాలిక చైర్మన్‌గా పనిచేసిన మాచర్ల ఏసోబు తన పదవికి మూడు నెలల క్రితం రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. కూటమికి ఒక్క కౌన్సిలర్ కూడా లేరు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు 16 మంది టీడీపీలో చేరారు. మైనార్టీ నాయకుడు షేక్ మదార్ సాహెబ్‌కు వైస్ చైర్మన్‌గా అవకాశం ఇచ్చేందుకు కూటమి రంగం సిద్ధం చేసింది. మరో ఇద్దరు కౌన్సిలర్లు తాజాగా టీడీపీలో చేరారు.
వాగులో పడి బాలిక మృతి
నూజెండ్ల: ప్రమాదవశాత్తు గుండ్లకమ్మ వాగులో జారి పడి బాలిక మృతి చెందిన సంఘటన శుక్రవారం పాత ఉప్పలపాడు గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన చీకటి విజయరాజు, కృపావరం దంపతుల కుమార్తె కీర్తి (10)నాలుగో తరగతి చదువుతోంది. వేసవి సెలవులు కావటంతో సమీపంలోని గుండ్లకమ్మ వాగు వద్దకు ఆడుకుంటూ వెళ్లింది. వాగులో జారిపడి మృతి చెందింది. దుస్తులు ఉతికేందుకు వెళ్లిన స్థానికులు చూసి కన్నవారికి సమాచారం అందించారు. కాళ్లు పూడికలో కూరుకుపోవడంతో చనిపోయి ఉంటుందని తల్లిదండ్రులు చెప్పారు.
ఏఎన్‌ఎస్‌కు సామగ్రి అందజేత
నరసరావుపేట: యాంటీ నక్సల్స్ స్క్వాడ్ (ఏ ఎన్‌ఎస్)లో పనిచేస్తున్న సిబ్బందికి జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు బ్యాగులు, వాటర్ బాటిల్స్, టోపీలు అందజేశారు. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అడ్మిన్ అదనపు ఎస్పీ జేవీ సంతోష్, వీఆర్ అదనపు ఎస్పీ వి.సత్తిరాజు, నరసరావుపేట, సత్తెనపల్లి డీఎస్పీలు కె.నాగేశ్వరరావు, ఎం.హనుమంతరావు, ఏఎన్‌ఎస్ ఆర్‌ఐ యువరాజు పాల్గొన్నారు.
గిన్నిస్ బుక్‌లో విద్యార్థికి స్థానం
సత్తెనపల్లి: పల్నాడు జిల్లా సత్తెనపల్లి (రామకృష్ణాపురం) పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయంలో ఎనిమిదో తరగతి విద్యార్థి ప్రత్తిపాటి అంకిత్ పాల్ గిన్నిస్ బుక్ రికార్డు సొంతం చేసుకున్నాడు. విజయవాడలోని హలెల్ మ్యూజిక్ స్కూల్‌లో సంగీతం నేర్చుకొని గతేడాది డిసెంబర్ ఒకటిన 18 దేశాల్లోని 1,046 మందితో కలిసి స్వరాలు ఆలపించి ఈ రికార్డును సొంతం చేసుకున్నాడు. శుక్రవారం గిన్నిస్ బుక్ రికార్డ్ ధ్రువీకరణ పత్రం, పతకాలను విజయవాడలో అందుకున్నాడు. బాలుడి తండ్రి ప్రత్తిపాటి బాబు జె.జె. ట్యూషన్ నిర్వాహకుడు (ఆంగ్ల అధ్యాపకుడు) కాగా, తల్లి వరలక్ష్మి ఉపాధ్యాయురాలు. ఈ సందర్భంగా పలు పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు అభినందించారు.