‘ఉల్లాస్’ లక్ష్యాలను అధిగమించాలి : కలెక్టర్
పార్వతీపురం: కేంద్రం ప్రవేశపెట్టిన ఉల్లాస్ కార్యక్రమం కింద ఇచ్చిన లక్ష్యాలను అధిగమించాలని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ వయోజన విద్య నోడల్ అధికారిని ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో వయోజన విద్యాశాఖ సిబ్బందితో గురువారం ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 23వేల మంది నిరక్ష్యరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దడమే కార్యక్రమ లక్ష్యమన్నారు. లక్ష్యాన్ని అధిగమించేందుకు మండల, జిల్లా స్థాయిలో నోడల్ అధికారులను నియమించడంతో పాటు అధికారులతో సమన్వయం చేసుకొనేలా చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. నిరక్ష్యరాస్యుల కోసం ప్రచురించే పుస్తకాలు మండల, జిల్లా స్థాయిలో సరఫరా చేయనున్నట్టు తెలిపారు. జిల్లాలో 53 శాతం ఉన్న అక్షరాస్యతను ఉల్లాస్ కార్యక్రమం ద్వారా మరింత పెరిగేలా పని చేయాలన్నారు. కార్యక్రమం ముగింపు రోజున ధ్రువీకరణ పత్రం, పథకాలు బహుకరించి ప్రోత్సహించాలన్నారు. సమావేశంలో వయోజన విద్య నోడల్ అధికారి టి. వైకుంఠరావు, డీఆర్‌డీఏ పీడీ వై.సత్యంనాయుడు, డ్వామా పీడీ కె.రామచంద్రరావు, సీడీపీఓ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
రక్తహీనత నివారణకు ప్రత్యేక చర్యలు
పార్వతీపురం: గర్భిణులు, బాలింతలు, ఐదేళ్లలోపు చిన్నారులు, కిశోర్ బాలికల్లో రక్తహీనత లేకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ సీడీపీఓలకు ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో మహిళ, శిశు సంక్షేమ అధికారులు, సీడీపీఓలు, అంగన్‌వాడీ సూపర్‌వైజర్లతో గురువారం ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లల్లో వయస్సుకు తగిన బరువు, ఎత్తు ఉండాలని అందుకు అవసరమైన పోషక పదార్ధాలు అందించాలన్నారు. పాలు, ఆకు కూరలు, గుడ్లు, చెక్కీలు తదితరమైనవి తప్పనిసరిగా ఇవ్వాలన్నారు. పిల్లల్లో బరువు, ఎత్తులను ప్రతీ వారం రిజిస్ట్రర్‌లో నమోదు చేయాలన్నారు. అంగన్‌వాడీ సొంత భవనాలకు పెయింటింగ్స్, తాగునీరు, మరుగుదొడ్లు ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. పిల్లలందరూ కేంద్రాలకు హాజరయ్యేలా చూడాలన్నారు. సమావేశంలో ఐసీడీఎస్ పీడీ ఎంఎన్ రాణి, వివిధ మండలాల సీడీపీఓలు, సూపర్‌వైజర్లు తదితరులు పాల్గొన్నారు.


