పట్టణాల్లో పేదలు నివసిస్తున్న చోటే జీవో నంబర్ 30 ప్రకారం స్థలాలను కేటాయించాలని, ఉన్న స్థలాలను క్రమబద్ధీకరించాలని సీపీఎం జిల్లా నగర కార్యదర్మి శంకరరావు డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం పట్టణాల్లో నివసిస్తున్న పేదలకు 2 సెంట్లు భూమి ఇస్తామని చెప్పి 9 నెలలు గడుస్తున్నా మంజూరు చేయకపోవడంపై మండిపడ్డారు. సీపీఎం ప్రజా చైతన్య యాత్ర ముగింపు సందర్భంగా కూటమి ప్రభుత్వ తీరుకు నిరసనగా కోట కూడలి నుంచి విజయనగరం తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నినదించారు. నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు బి.రమణ, పి.రమణమ్మ, జగన్‌మోహన్, ఆర్.శ్రీనివాసరావు, శాంతమూర్తి తదితరులు పాల్గొన్నారు.
– విజయనగరం గంటస్తంభం


