మా వాళ్లే.. ఉద్యోగం ఇచ్చేయ్..
● కూటమి నాయకుల అధికార దర్పం.. ● లక్కిడాం పీఏసీఎస్‌లో ఇద్దరికి ఉద్యోగాలు
● నిబంధనల ప్రకారం కుదరదన్న ఉద్యోగులు ● వారిపై ఒత్తిడి తీసుకువచ్చిన మంత్రి బంధువు
గంట్యాడ: కూటమి నేతలు రెచ్చిపోతున్నారు. అధికారం ఉంది కదా అని ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. అధికార దర్పాన్ని ప్రదర్శిస్తూ ఇతరులను ఇబ్బంది పెడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా పనులు చేయాలని అధికారులపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. దీంతో అధికారుల పరిస్థితి ముందు నుయ్యి.. వెనుక గొయ్యి అన్న చందాన తయారైంది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించలేమని ఎవరైనా చెబితే.. ఏం మా మాట అంటే లెక్కలేదా అని బెదిరింపులకు దిగుతున్నారు.
మంత్రి బంధువు రుబాబు..
గంట్యాడ మండలంలోని లక్కిడాం సొసైటీ (ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం) లో పని చేయడానికి ఇద్దరు వ్యక్తులను కూటమి నేతలు పంపించారు. వాస్తవంగా సొసైటీలో వారి అవసరం లేకపోయినా పంపించారు. తమకు సరిపడా సిబ్బంది ఉన్నారని సొసైటీ అధికారులు చెప్పినా కూటమి నేతలు పట్టించుకోవడం లేదు. వారిని తీసుకుంటారా లేదా అని తీవ్ర ఒత్తిడి తీసుకురావడంతో అధికారులు తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకున్నారు. ఇప్పడు ఏకంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ బంధువు ఒకరు రంగప్రవేశం చేసి ఆ ఇద్దరినీ సొసైటీ ఉద్యోగులుగా పరిగణిస్తూ తీర్మానం చేయాలని సొసైటీ అధికారులపై ఒత్తిడి తీసుకువస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
డీఎల్‌ఈసీ ఆమోదం తప్పనిసరి
డిస్ట్రిక్ట్ లెవిల్ ఎంపవర్డ్ కమిటీ (డీఎల్‌ఈసీ) ఆమోదం లేకుండా ఎటువంటి నియామకాలు చేపట్టకూడదని 2019లో ప్రభుత్వం జీఓ జారీ చేసింది. ఒకవేళ ఎవరైనా కమిటీ ఆమోదం లేకుండా నియమకాలు చేపడితే వారిని తొలగించే అధికారం కమిటీకి ఉంటుంది.
నోటిఫికేషన్ లేకుండా నియామకాలు..
ఏదైనా సంస్థలో ఖాళీలు ఏర్పడితే నిబంధనల ప్రకారం ఆయా ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలి. రాత పరీక్ష గాని, మెరిట్ ఆధారంగా గాని నియామకాలు చేపట్టాలి. కాని కూటమి నాయకులు తమ మాటే నిబంధన అన్నట్లు వ్యవహరిస్తున్నారు. లక్కిడాం సొసైటీ వ్యవహారంలో కూటమి నేతలు వ్యవహరిస్తున్న తీరుపై సర్వత్రా ఆరోపణులు వినిపిస్తున్నాయి. ఇప్పటికే లక్కిడాం సొసైటీ నష్టాల్లో ఉన్నట్టు ఆరోపణులు వినిపిస్తున్నాయి. అవసరం లేకపోయినా ఉద్యోగులను నియమిస్తే వారికే ఇచ్చే జీతాల వల్ల సొసైటీ మరింత నష్టాల్లోకి వెళ్లే అవకాశం ఉంది.
నా దృష్టికి వచ్చింది..
2019 హెచ్‌ఆర్ పాలసీ ప్రకారం సొసైటీకి ఒక డీఈఓ ఉండాలి. లక్కిడాం సొసైటీకి ప్రస్తుతం ఒకరున్నారు. మరో ఇద్దరి కోసం సొసైటీలో తీర్మానం చేయాలన్న విషయం తన దృష్టికి వచ్చింది. సర్వేలు, ఇతర అవసరాల కోసం సిబ్బంది అవసరం అనుకుంటే ఎన్ని రోజులు అవసరమో అన్ని రోజులకు మాత్రమే తీసుకోవాలి. అటువంటి వారికి రోజువారీ వేతనం చెల్లించవచ్చు.
పి. రమేష్, జిల్లా సహకార అధికారి


