
విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి..
● 107,108 జీఓలు రద్దు చేయాలి
● ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
బందెల నాసర్‌జీ
విజయనగరం గంటస్తంభం: విద్యారంగ సమస్యలు పరిష్కరించేంతవరకు పోరాటం చేస్తామని ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాసర్‌జీ అన్నారు. శనివారం స్థానిక అమర్‌భవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి ఐదు మెడికల్ కళాశాలలు మాత్రమే మంజూరు చేయడం సరికాదన్నారు. పైగా ఆయా కళాశాలల్లో పేదవారికి స్థానం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా మచిలీపట్నం, నంద్యాల, ఏలూరు, రాజమండ్రి, విజయనగరంలో ఏర్పాటు చేయనున్న కళాశాలల్లో 35 శాతం సీట్లు అమ్ముకునేలా రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 107, 108 జీఓలను రద్దు చేయాలని కోరారు. ఏఐఎస్‌ఎఫ్ జిల్లా సభ్యుడు ఎన్. నాగభూషణం మాట్లాడుతూ .. విజయనగరం జిల్లాలో గిరిజన యూనివర్సిటీకి పూర్తి స్థాయిలో నిధులు కేటాయించకపోవడం అన్యాయమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయాలని కోరారు. కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్మి పి.గౌరీశంకర్, ఉపాధ్యక్షుడు ఎ.సుమన్, శ్రావణ్‌కుమార్, ప్రవీణ్‌కుమార్, శంకరరావు, నరేంద్ర, తదితరులు పాల్గొన్నారు.