
ఎన్నికల హామీలు నీటి మూటలేనా?
● ఉచిత బస్సు ప్రయాణం తుస్సుమనిపించారు ● ఉత్తుత్తి ప్రజాదర్బారులతో కాలం వెళ్లదీత ● సమాచార హక్కు చట్టాన్ని నిర్లక్ష్యం చేస్తున్న యంత్రాంగం ● మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర
సాలూరు రూరల్:
ఎన్నికల హమీలు నీటిమూటలేనా?.. ఉగాది నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని ఎన్నికల ప్రచారంలో గొప్పగా చెప్పిన గిరిజన సంక్షేమ శాఖ మంత్రి ఇప్పుడు మహిళలకు ఏం సమాధానం చెబుతారని మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర ప్రశ్నించారు. సాలూరులోని తన నివాసంలో సోమవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో ఓట్లు దండుకునేందుకు ఉత్తుత్తి హామీలిచ్చిన కూటమి నేతలు ఇప్పుడు డైవెర్షన్ పాలిటిక్స్‌తో పబ్బంగడుపుకుంటున్నారని విమర్శించారు. సంక్షేమ పథకాల అమలుపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజాదర్బార్లు, గ్రామసభలు, గ్రీవెన్సులు పెట్టి ప్రజలకు ఏదో చేస్తున్నామని మభ్యపెడుతున్నారని ఆరోపించారు. ఇంతవరకు ప్రజాసమస్యల పరిష్కర వేదికకు ఎన్ని వినతులు వచ్చాయి, ఎన్ని పరిష్కరించారన్న విషయం తెలుసుకునేందుకు ఆర్టీఐ ప్రతినిధి పిరిడి రామకృష్ణ ఽసమాచార హక్కుచట్టానికి దరఖాస్తు చేసి నెలరోజులవుతున్నా ఇంతవరకు జిల్లా అధికారుల నుంచి స్పందనలేదన్నారు.
పాచిపెంట మండలం కేసలి పంచాయతీ సమాచారానికి టీడీపీ నాయకుడు సమాచార హక్కు చట్టం ప్రకారం వివరాలు కావాలని దరఖాస్తుచేసుకుంటే వెంటనే ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. ప్రభుత్వ భూములు ఆక్రమణపై సమాచారం కోసం స్వయంగా తాను దరఖాస్తు చేసినా సమాచారం ఇవ్వకపోవడం దారుణమన్నారు. న్యాయవాది రేగుమహేశ్వరరావు పెట్టిన దరఖాస్తుకు కూడా అధికారులు స్పందించలేదన్నారు. చట్టం తమకంటే ఎక్కువ కాదనుంకుంటే కోర్టును ఆశ్రయించాల్సి వస్తుందని హెచ్చరించారు. తన స్నేహితుడు ప్రిన్సిపాల్‌గా పనిచేసి రిటైర్ అయి నెలలు గడుస్తున్నా ఇంతవరకు ఎలాంటి బెనిఫిట్స్ అందలేదని దరఖాస్తు చేసుకుంటే, సమస్య పరిష్కారం కాకుండానే పరిష్కరించామని మెసేజ్ పంపించారన్నారు. మేధావుల పరిస్థితే ఇలా ఉంటే సామన్యుడి పరిస్థితి ఎలా ఉంటుందో అర్థంచేసుకోవచ్చన్నారు.
అభివృద్ధి పనులు నిరంతర ప్రక్రియ
అభివృద్ధి పనులు కొనసాగించడం ప్రభుత్వాల నిరంతర ప్రక్రియ అని మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర అన్నారు. సిమిడివలస బీటీ రోడ్డు ప్రారంభ అంశంపై స్పందిస్తూ గత తెలుగుదేశం ప్రభుత్యంలో కొబ్బరికాయ కొట్టి విడిచిపెట్టిన కందుల పదం వంతెన, మోసూరు వంతెన, సాలూరు వేగావతి నదిపై పాంచాలి వెళ్లే వంతెన, సాలూరు 100 పడకల ఆస్పత్రి నిర్మాణాలను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పూర్తిచేసిందన్నారు. సిమిడి వలస రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయించి పనులు ప్రారంభించామని, ఇప్పుడు రోడ్డు పూర్తికావడంతో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి ప్రారంభించారన్నారు. రోడ్డు నిర్మాణం పూర్తి కావడం మంచివిషయమన్నారు. సమావేశంలో వైస్ చైర్మన్ వంగపండు అప్పలనాయుడు, వైస్ ఎంపీపీ రెడ్డి సురేష్, మండల నాయకుడు దండి శ్రీను, మాజీ కౌన్సిలర్ పిరిడి రామకృష్ణ , కౌన్సిలర్ సింగారపు ఈశ్వరరావు పాల్గొన్నారు.