స్లాట్ బుకింగ్స్‌తో రిజిస్ట్రేషన్లు
విజయనగరం రూరల్:
రిజిస్ట్రేషన్లను మరింత సులభతరం చేయడానికి ప్రభుత్వం తీసుకు వచ్చిన స్లాట్ బుకింగ్ విధానాన్ని ఈ నెల రెండో తేదీ నుంచి విజయనగరం ఆర్వో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రారంభించనున్నట్లు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ డీఐజీ ఎ.నాగలక్ష్మి తెలిపారు. పట్టణంలోని దాసన్నపేటలో ఉన్న ఆర్వో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని జిల్లా రిజిస్ట్రార్ ఏవీ కుమారితో కలిసి సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భూ క్రయ, విక్రయదారులకు సమయం వృథా కాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం స్లాట్ బుకింగ్ విధానం తీసుకువచ్చిందని చెప్పారు. ఈ విధానం వల్ల పారదర్శకంగా రిజిస్ట్రేషన్లు జరుగుతాయన్నారు. పబ్లిక్ డేటా ఎంట్రీ విధానం ద్వారా ఆన్‌లైన్‌లో స్లాట్ బుక్ చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సబ్ రిజిస్ట్రార్లు ఎస్వీ ప్రసాద్, కేఏ షీలా, సిబ్బంది, క్రయ విక్రయదారులు పాల్గొన్నారు.


