రెంటికీ చెడిన.. రేవటిగూడ | - | Sakshi
Sakshi News home page

రెంటికీ చెడిన.. రేవటిగూడ

Apr 2 2025 12:47 AM | Updated on Apr 3 2025 1:34 AM

కనీస సదుపాయాలు లేవు..

మా ఊరు ఇటు ఆంధ్రాకు, అటు ఒడిశాకు చెందకుండా ఉంది. రెండు రాష్ట్ర ప్రభుత్వాలూ మమ్మల్ని పట్టించుకోవడం లేదు. కనీస సౌకర్యాలు లేవు. రేషన్‌ లేదు, పెన్షన్‌ రావడం లేదు. తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. పార్వతీపురం కలెక్టరేట్‌లో అధికారులను కలిసి సమస్య చెప్పుకొంటాం.

– మందంగి దేబురు, రేవటిగూడ

ఆంధ్రాలోనే ఉంచాలి..

మాది ఒడిశాలోని కొరాపుట్‌ జిల్లా అంటున్నారు. మాకు ఆ ప్రాంతం చాలా దూరం. ఆంధ్రాలోనే ఉంచాలని అడుగుతున్నాం. పార్వతీపురం మండలం పెదమరికి పంచాయతీలో మమ్మల్ని విలీనం చేయాలి. మా గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలి. ఇప్పటికే పలుమార్లు అధికారులను కలిసి వేడుకున్నా ఫలితం ఉండటం లేదు.

– మందంగి బొండయ్య

ఆధార్‌కార్డు లేదు..

రెండు రాష్ట్రాలకూ చెందకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ఎవరూ మమ్మల్ని పట్టించుకోవడం లేదు. గ్రామంలో అభివృద్ధి పనులేవీ జరగడం లేదు. మా దగ్గర ఓట్లు లేవు కదా.. ఇంకెవరు పట్టించుకుంటారు. ఆంధ్రాలోనే ఉంచాలని అడుగుతున్నాం. రేషన్‌కార్డు, ఆధార్‌ కార్డు ఇప్పించాలి.

– ఆరిక రౌతు, రేవటిగూడ

సాక్షి, పార్వతీపురం మన్యం: ఆంధ్రా–ఒడిశా సరిహద్దులోని కొటియా గ్రామాల మధ్య వివాదం కొన్ని దశాబ్దాలుగా సాగుతూ వస్తున్న విషయం విదితమే. ఆ గ్రామాలపై పట్టు సాధించేందుకు ఇరు రాష్ట్రాలూ ప్రయత్నాలు సాగిస్తున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే.. ఆంధ్ర రాష్ట్ర యంత్రాంగం కంటే.. ఒడిశా యంత్రాంగమే ఆ గ్రామాల విషయంలో దూకుడు మీద వెళ్తోంది. ఇరు రాష్ట్రాల నుంచి సంక్షేమ పథకాలను, ఆధార్‌, రేషన్‌కార్డులను కొటియా ప్రజలు పొందారు. ఒడిశా ప్రభుత్వం అక్కడ మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేసింది. దీనికి కారణం అక్కడ విలువైన మైనింగ్‌ నిక్షేపాలు ఉండడం వల్లేనని.. అందుకే ఒడిశా పట్టువీడటం లేదని సమీప గ్రామ ప్రజల ఆరోపణ.

ఇదే పార్వతీపురం మన్యం జిల్లా పరిధిలోని రెండు రాష్ట్రాల సరిహద్దులో మరో గ్రామం ఉండిపోయింది. 45 సంవత్సరాలుగా అటు ఒడిశా పట్టించుకోక.. ఇటు ఆంధ్రా నుంచీ స్పందన లేక అక్కడి గిరిజన ప్రజలు నలిగిపోతున్నారు.

జిల్లాలోని సాలూరు నియోజకవర్గ పరిధి కొదమ నుంచి దాదాపు 40 గిరిజన కుటుంబాల వారు పోషణ కోసం సుమారు 45 ఏళ్ల కిందట పార్వతీపురం మండలం పెదమరికి పంచాయతీ సమీపంలోని రేవటిగూడ గిరిజన గ్రామానికి విచ్చేసి, స్థిరనివాసం ఏర్పరుచుకున్నారు. కొంత భూమిలో జీడి, మామిడి, వరి సాగు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. పార్వతీపురం జిల్లా కేంద్రానికి ఈ ప్రాంతం దాదాపుగా పది కిలోమీటర్ల దూరంలో ఉంటే.. ఒడిశాలోని కొరాపుట్‌ జిల్లాకు కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉంది. గతంలో ఈ ప్రాంతంలో కొరాపుట్‌ జిల్లా పరిధిలోనిదే అని చెబుతూ నలుగురైదుగురికి అక్కడి ప్రభుత్వం ఆధార్‌, రేషన్‌కార్డులు, పింఛన్లు కూడా ఇచ్చింది. ఆ తర్వాత పట్టించుకోవడం మానేసింది. జంఝావతిలో నీరు పారితే.. అటు ఒడిశా వైపు వెళ్లడానికి పూర్తిగా రాకపోకలు స్తంభించిపోతాయి. తమను ఆంధ్రాలోనే ఉంచాలని ఇక్కడి గిరిజనులు ఎన్నో ఏళ్లుగా కోరుతున్నారు. సాగు భూములకు హక్కు పత్రాలు ఇవ్వడంతో పాటు.. ఆధార్‌, రేషన్‌కార్డులు, పింఛన్లు, ఇతర ప్రభుత్వ పథకాలు ఇవ్వాలని కోరుతున్నారు.

అటు ఒడిశాలో కాక.. ఇటు ఆంధ్రాలో లేక..

పార్వతీపురానికి సమీపంలో ఉన్న గిరిజన గ్రామం దుస్థితి

ఆధార్‌, రేషన్‌కార్డులు లేక గ్రామస్తుల ఇక్కట్లు

రెంటికీ చెడిన.. రేవటిగూడ 1
1/4

రెంటికీ చెడిన.. రేవటిగూడ

రెంటికీ చెడిన.. రేవటిగూడ 2
2/4

రెంటికీ చెడిన.. రేవటిగూడ

రెంటికీ చెడిన.. రేవటిగూడ 3
3/4

రెంటికీ చెడిన.. రేవటిగూడ

రెంటికీ చెడిన.. రేవటిగూడ 4
4/4

రెంటికీ చెడిన.. రేవటిగూడ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement