Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today
Sakshi News home page

ప్రధాన వార్తలు

TDP Janasena Leaders Over Action On BC Women ZP Chairperson1
ఏపీలో బీసీ మహిళా జెడ్పీ చైర్‌పర్సన్‌పై 'టీడీపీ గూండాయిజం'

గుడివాడ రూరల్‌/గుడివాడ టౌన్‌: రాష్ట్రంలో ప్రజాస్వామ్య హననం జరుగుతోందనడానికి మరో తార్కాణం.. రాష్ట్రంలో ఆటవిక పాలన సాగుతోందనడానికి మరో నిదర్శనం.. రాష్ట్రంలో శాడిస్టు ప్రభుత్వం రాజ్యమేలుతోందనడానికి నిలువుటద్దం.. కృష్ణా జిల్లా గుడివాడలో శనివారం సాక్షాత్తు జిల్లా ప్రథమ పౌరురాలు, జెడ్పీ చైర్‌పర్సన్, బీసీ మహిళ ఉప్పాల హారికపై టీడీపీ, జనసేన గూండాలు విచక్షణా రహితంగా మారుణాయుధాలతో దాడి చేశారు. తాలిబన్లు, ఐసిస్, హమాస్, హిజ్‌బుల్లా ఉగ్రవాదులను మరిపించే రీతిలో పోలీసుల సమక్షంలోనే బూతులు తిడుతూ దాడికి తెగబడ్డారు. ‘బాబు ష్యూరిటీ–మోసం గ్యారెంటీ’ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్తుండగా అడ్డుకుని మరీ దాడి చేయడం విస్తుగొలుపుతోంది. మద్యం, గంజాయి సేవించి.. సైకోల్లా కేకలు వేస్తూ.. చంపండి.. కొట్టండి.. అని అరుస్తూ బండరాళ్లు, కర్రలతో దాడులు చేస్తున్నా పోలీసులు అడ్డుకోవడానికి ఏమాత్రం ముందుకు రాకపోవడం రాష్ట్రంలో రెడ్‌బుక్‌ పాలనకు అద్దం పడుతోంది. దాడిని నిలువరించక పోగా, సినిమా షూటింగ్‌ చూస్తున్నట్లు వ్యవహరించడం.. తీరా దాడి చేసి వెళ్లిపోతుండగా హంగామా చేయడం పోలీసులు ప్రభుత్వ పెద్దల ఆదేశాలకు ఎంతగా లొంగి పోయారన్నది తేటతెల్లం చేస్తోంది. ఇదే రీతిలో నెల్లూరులో కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్‌రెడ్డి ఇంటిపై కూడా టీడీపీ గూండాలు విచక్షణా రహితంగా దాడికి పాల్పడటం తెలిసిందే. దాడి చేసిన టీడీపీ మూకలపై ఇప్పటి దాకా కేసు కూడా నమోదు చేయని పోలీసులు.. బాధితుడైన ప్రసన్న కుమార్‌రెడ్డి పైనే కేసు నమోదు చేయడం చంద్రబాబు ప్రభుత్వ దురీ్నతిని బయట పెడుతోంది. అంతకు మందు ఉమ్మడి అనంతపురం జిల్లా తాడిపత్రిలో టీడీపీ గూండాల తరఫున వకాల్తా పుచ్చుకున్న సీఐ.. వైఎస్సార్‌సీపీ శ్రేణులపై రివాల్వర్‌ ఎక్కుపెట్టి.. కాల్చేస్తానని బెదిరించడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. హైకోర్టు అనుమతితో.. అదీ ఏడాది తర్వాత సొంత నియోజకవర్గం తాడిపత్రిలోని తన ఇంట్లో అడుగుపెట్టిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని టీడీపీ గూండాల ఒత్తిళ్లకు తలొగ్గి.. పోలీసులే ఆయ­న్ను బలవంతంగా వాహనంలోకి ఎక్కించి అనంతపురం పంపడం రాష్ట్రంలో ప్రభుత్వ దుర్మార్గానికి అద్దం పట్టింది. గుడివాడలో దాడి జరిగిందిలా.. చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలను ఊరారా ఎండగట్టేలా ‘బాబు ష్యూరిటీ–మోసం గ్యారెంటీ’ కార్యక్రమాన్ని గుడివాడ మండలం లింగవరంలోని కె.కన్వెన్షన్‌లో వైఎస్సార్‌సీపీ శ్రేణులు నిర్వహించ తలపెట్టాయి. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఉమ్మడి కృష్ణా జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్, బీసీ నాయకురాలు ఉప్పాల హారిక తన భర్త, ఇతరులతో కలిసి వాహనంలో బయలు దేరారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల నుంచి పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వచ్చాయి. ఈ విషయం తెలియడంతో కూటమి నేతల కన్ను కుట్టింది. గుడివాడ నియోజకవర్గంలో ఈ కార్యక్రమం విజయవంతం కాకుండా చూడాలని ప్రభుత్వ పెద్దల నుంచి స్థానిక టీడీపీ, జనసేన నేతలకు ఆదేశాలు అందాయి. దీంతో ఆ కార్యక్రమానికి వచ్చే వైఎస్సార్‌సీపీ శ్రేణులను నాగవరప్పాడు వద్ద అడ్డుతగులుతూ, రెచ్చగొట్టే ధోరణితో వ్యవహరించారు. రాళ్లు, కర్రలు చేత పట్టుకుని యుద్ధ వాతావరణాన్ని సృష్టించారు. కర్రలు, రాడ్లతో సభకు వెళ్లే వారిని అడ్డగించి, అడ్డువచ్చిన వాహనాలపై దాడులకు తెగబడ్డారు. అయినప్పటికీ వైఎస్సార్‌సీపీ శ్రేణులు సంయమనం పాటించాయి. ఈ క్రమంలో సభకు హాజరయ్యేందుకు గుడివాడ మీదుగా లింగవరం వెళ్తున్న జెడ్పీ చైర్‌పర్సన్‌ ఉప్పాల హారిక కారు అక్కడికి రాగానే.. టీడీపీ, జనసేన నేతలు రాళ్లు, కర్రలు, రాడ్లతో పోలీసుల సమక్షంలో దాడులకు తెగబడ్డారు. కారు అద్దాలను ధ్వంసం చేశారు. కారుపై బండరాళ్లు విసిరారు. బీసీ మహిళ అని కూడా చూడకుండా బూతులు తిట్టారు. కారును ముందుకు కదలనివ్వకుండా అడ్డుకున్నారు. కారుపై పదిసార్లు విచ్చలవిడిగా దాడి చేయడంతో గంటన్నర సేపు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని జెడ్పీ చైర్‌పర్సన్, ఆమె భర్త కారులోనే ఉండిపోయారు. ఈ తతంగం అంతా జరిగాక, అక్కడే ఉన్న పోలీసులు తాపీగా అక్కడికి చేరుకుని ఉప్పాల హారికను అక్కడి నుంచి వెళ్లిపోవాలని హుకుం జారీ చేశారు. దాడికి పాల్పడిన వారిని పల్లెత్తు మాట అనకుండా జెడ్పీచైర్‌పర్సన్, అమె భర్త, వైఎస్సార్‌సీపీ నేతలనే తప్పు పట్టేలా వ్యవహరించారు. చంపేస్తారనుకున్నా.. కూటమి పాలనలో మహిళలకు రక్షణ కరువైందని జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ ఉప్పాల హారిక కన్నీటి పర్యంతమయ్యారు. స్థానిక వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ సమీపంలో శనివారం రాత్రి ఆమె విలేకరులతో మాట్లాడారు. గుడివాడ మండలం లింగవరం వద్ద వైఎస్సార్‌సీపీ తలపెట్టిన కార్యక్రమంలో పాల్గొనేందుకు తన భర్త రాముతో కలసి కారులో వెళ్తుంటే మార్గమధ్యంలో నాగవరప్పాడు వద్ద టీడీపీ, జనసేన నాయకులు గూండాల్లా కర్రలు, రాడ్లతో కారుపై పోలీసుల సమక్షంలోనే దాడి చేసి కారు అద్దాలను పగలకొట్టారని చెప్పారు. తమను హతమార్చేందుకు ప్రయత్నించారని కన్నీటిపర్యంతమయ్యారు. ఓ దశలో తనను చంపేస్తారనుకున్నానని చెప్పారు. తన మామ, తన భర్త, తాను రాజకీయాల్లో ఉన్నా, ఇప్పటి వరకు ఎవరినీ విమర్శించలేదని, తన దారిలో తాను వెళ్తుంటే బీసీ మహిళ అని కూడా చూడకుండా నోటితో చెప్పలేని విధంగా అసభ్య పదజాలంతో దూషించి తమను చంపేందుకు యత్నించారన్నారు. సీఐలు, ఎస్‌ఐలు, పోలీస్‌ సిబ్బంది పెద్ద సంఖ్యలో అక్కడ ఉండగానే, వారి సమక్షంలోనే తమపై దాడి చేశారన్నారు. కూటమి ప్రభుత్వంలో జిల్లా ప్రథమ పౌరురాలినైన తనకే రక్షణ లేకపోతే సామాన్య మహిళలకు ఏం రక్షణ ఉంటుందని ఆమె ప్రశ్నించారు. తనపై జరిగిన దాడికి సీఎం చంద్రబాబు, హోం మంత్రి అనిత వెంటనే సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. తనపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్‌ చేయాలని, ఇప్పటికే గుడివాడ వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశానని తెలిపారు. జిల్లా ఎస్పీని కలసి దాడి గురించి ఫిర్యాదు చేస్తానని హారిక తెలిపారు. పెడన నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి ఉప్పాల రాము మాట్లాడుతూ టీడీపీ నేతలు మద్యం తాగి వచ్చి వీధి గూండాల్లా కర్రలు, రాడ్లతో తమపై దాడి చేసి తమను హతమార్చేందుకు ప్రయత్నించారన్నారు. దాదాపు 400 మంది పోలీసుల సమక్షంలోనే తమపై దాడి చేశారన్నారు. కారులో తాను ఒక్కడినే ఉంటే భయపడేవాడిని కాదని, మహిళ అయిన తన భార్య ఉండటంతో ఆందోళన చెందానన్నారు. తన భార్యను ఇష్టానుసారంగా దుర్భాషలాడి, తమను చంపేందుకు ప్రయత్నించారని, దీనిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన నందివాడ జెడ్పీటీసీ సభ్యురాలి భర్త కందుల నాగరాజుపై కూడా దాడికి దూసుకు వచ్చారన్నారు. కూటమి నేతలకు బీసీ మహిళలు అంటే అంత చులకనా? ఓట్ల కోసమే బీసీలు కావాలా? అని ప్రశ్నించారు. ఈ దాడిపై గుడివాడ ఎమ్మెల్యే రాము స్పందించాలని, దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్‌ చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ముఖ్య నాయకుల హౌస్‌ అరెస్ట్‌ గుడివాడ కార్యక్రమానికి జిల్లా నాయకులు వస్తున్నారన్న సమాచారంతో ముందస్తుగానే అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లతో పోలీసులు హౌస్‌ అరెస్ట్‌లు చేశారు. మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని), పామర్రు మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్, పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త పేర్ని కృష్ణమూర్తి(కిట్టు)లను పోలీసులు ముందుగానే మచిలీపట్నంలో హౌస్‌ అరెస్ట్‌ చేశారు. కేవలం గుడివాడలో వైఎస్సార్‌సీపీకి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక టీడీపీ నేతలు గూండాలుగా మారి దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఇదిలా ఉండగా టీడీపీ నాయకులు, గూండాలు వైఎస్సార్‌సీపీ తలపెట్టిన కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. వైఎస్సార్‌సీపీ తలపెట్టిన కార్యక్రమంలో దాదాపు మూడు వేల మంది పాల్గొనడంతో గుడివాడ దద్దరిల్లిపోయింది. ఈ కార్యక్రమానికి వస్తున్న జెడ్పీ చైర్మన్‌ కారుపై పచ్చమూకలు దాడికి తెగబడ్డారన్న విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ నాయకులు రోడ్డుపైకి రావడంతో ఒక్కసా­రిగా టీడీపీ నేతల్లో కంగారు మొదలైంది. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి వైఎస్సార్‌సీపీ నాయకులకు సర్దిచెప్పారు. రాష్ట్రంలో ఆటవిక పాలన కృష్ణా జిల్లా జడ్పీ చైర్‌పర్సన్‌పై దాడిని తీవ్రంగా ఖండించిన వైఎస్‌ జగన్‌ ఉప్పాల హారికతో ఫోన్‌లో మాట్లాడి పరామర్శ ధైర్యంగా ఉండాలని.. పార్టీ అండగా ఉంటుందని భరోసా కృష్ణా జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్‌ ఉప్పాల హారికపై టీడీపీ, జనసేన మూకల దాడిని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. శనివారం బాధితురాలితో ఫోన్‌లో మాట్లాడి దాడి వివరాలు తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని, పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. దాడి జరిగిన విషయాన్ని పార్టీ నాయకులు తన దృష్టికి తీసుకువచ్చారన్నారు. ఒక బీసీ మహిళ, జిల్లా ప్రథమ పౌరురాలు భయంతో వణికిపోయే పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయంటే ఇంతకంటే దారుణం ఉంటుందా.. అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో ప్రజాస్వామ్య హననం జరుగుతోందని, ఆటవిక పాలన సాగుతోందని మండిపడ్డారు. వాహనాలు, అంబులెన్స్‌ను అడ్డుకుని వీరంగంగుడివాడలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తల సమావేశాన్ని అడ్డుకోడానికి కూటమి ప్రభుత్వంలోని టీడీపీ, జనసేన కార్యకర్తలు చేయని ప్రయత్నం లేదు. వారు శనివారం స్థానిక నాగవరప్పాడు వంతెన వద్ద వీరంగం సృష్టించారు. గంజాయి, మద్యం మైకంలో ఏమి చేస్తున్నారో తెలియక వచ్చి పోయే వాహనాలను అడ్డుకుని సాధారణ ప్రజలను ఇబ్బందులకు గురిచేశారు. పోలుకొండ రోడ్‌లో రోగిని తీసుకెళ్లేందుకు వెళ్తున్న అంబులెన్స్‌ను సైతం అడ్డుకున్నారు. పోలీసులు జోక్యం చేసుకోవడంతో దానిని వదిలివేశారు. ఇలా ప్రతి వాహనాన్ని ఆపడం, అందులో ఉన్న వారిని గుర్తించి.. వైఎస్సార్‌సీపీ నాయకులని భావిస్తే వారిపై దాడులకు తెగబడ్డారు. వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుడు సూర నరసారావు ఏలూరు వెళుతుండగా నాగవరప్పాడు వంతెన వద్ద టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. తాను సమావేశానికి వెళ్లడం లేదని, వ్యక్తిగత పనిపై ఏలూరు వెళుతున్నానని చెప్పినా వినిపించుకోకుండా కారుపై దాడి చేసి అద్దాలు పగులగొట్టేయత్నం చేశారు. అరాచకానికి పరాకాష్టరాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పోలీసులను గుప్పిట్లో పెట్టుకుని, యథేచ్ఛగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది. రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ప్రశ్నించే గొంతుకలను నొక్కేస్తూ.. పౌర హక్కులను కాలరాస్తోంది. తమను ప్రశ్నించే వారే ఉండకూడదన్నట్లు తాలిబన్లను మరిపిస్తోంది. ఇందులో భాగంగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనలను సైతం అడ్డుకుంటోంది. ఆయన కార్యక్రమాల్లో పాల్గొన్న వారిపై తప్పుడు కేసులు నమోదు చేస్తోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్‌ సిక్స్, సూపర్‌ సెవెన్‌ హామీలతో పాటు మిగతా హామీలన్నీ అమలు చేయాలన్న డిమాండ్‌ ప్రజల నుంచి రాకుండా ముందే భయభ్రాంతులకు గురి చేసేలా రెడ్‌ బుక్‌ రాజ్యాంగాన్ని అమలు చేస్తోంది. ఈ కమ్రంలో ప్రజా సమస్యలు ఎత్తి చూపేందుకు ప్రజల్లో వెళ్తున్న వైఎస్‌ జగన్‌కు భద్రత కల్పించకుండా కుట్ర పూరితంగా వ్యవహరిస్తోంది. రైతులకు అండగా నిలిచేందుకు వైఎస్‌ జగన్‌ గుంటూరు మిర్చి యార్డు పర్యటన, టీడీపీ గూండాల చేతిలో హతమైన బీసీ నాయకుడు కురుబ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు ఉమ్మడి అనంతపురం జిల్లా రామగిరి మండల పర్యటనకు వెళ్లినప్పుడు అడ్డంకులు సృష్టించింది. ఇదే రీతిలో ప్రకాశం జిల్లా పొదిలిలో పొగాకు రైతులకు అండగా నిలిచేందుకు వెళ్లినప్పుడు, పల్నాడు జిల్లా సత్తెనపల్లెలో టీడీపీ గూండాల వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న వైఎస్సార్‌సీపీ నాయకుడి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లినప్పుడు, నిన్నటికి నిన్న చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో మామిడి రైతులకు మద్దతు ధర కోసం గళం విప్పేందుకు వెళ్లినప్పుడు ఇదే తరహాలో అడ్డంకులు సృష్టించింది. ఆ కార్యక్రమంలో పాల్గొన్న రైతులు, నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయించింది.

Sakshi Editorial On Education sector in Andhra Pradesh Chandrababu Govt2
విద్యారంగంపై విషపు చూపు!

ఆయనో గాడిదను చూపెడతారు. దాన్ని గుర్రం అనాలంటారు. ఔనౌను అది గుర్రమేనని పెంపుడు మీడియా నమ్మ బలుకుతుంది. తామేది చెబితే జనం దాన్నే నమ్మాలనే నియ మావళిని ఆయన అమల్లోకి తెచ్చారు. అయ్యయ్యో, అది గుర్రం కాదు గాడిదని అమాయకంగా ఎవరైనా అరిస్తే వారి మీద పెంపుడు మీడియా దండుపాళ్యం బ్యాచ్‌ అనే ముద్రను వేస్తుంది. ఆ దండుపాళ్యం బ్యాచ్‌ను దండించడానికి ఖాకీ మూక కదులుతుంది. దేశంలో ఉన్న అత్యంత సీనియర్‌ రాజకీయ నాయకుల్లో ఆయనొకరు. ముఖ్యమంత్రి కుర్చీతో నాలుగు విడ తలుగా పదిహేనేళ్ల సావాసముంది. అయినా పచ్చి అబద్ధాలను పబ్లిగ్గా వల్లెవేయడానికి ఇప్పటికీ వెనకాడటం లేదు.ఎందుకంటే, ఆయనకది అచ్చొచ్చిన విద్య. ఆ విద్యతోనే రాజకీయంగా తనను తాను ప్రమోట్‌ చేసుకున్నారు. పెంపుడు మీడియా అండదండగా నిలబడింది. ఇతరులకు దక్కవలసిన ఘనతను లాఘవంగా లాగేసుకోవడంలో, ఇతరుల మెడలో వేయాల్సిన వీరతాళ్లను తన మెడలో వేసుకోవడంలో ఆయన ప్రదర్శించే దిగ్భ్రాంతికరమైన చొరవ జగమెరిగిన సత్యమే. ఆయన వయసు డెబ్బై ఐదు దాటింది. ఇంకో పదిహేనేళ్లు ఆయన నాయకత్వంలోనే పని చేస్తానని పవన్‌ కల్యాణ్‌ పదే పదే చెబుతున్నారు. పవన్‌ కల్యాణ్‌ శిరోధార్యంగా తలపోసే సనాతన ధర్మంపై సర్వహక్కులున్న ఆరెస్సెస్‌ అధినేత మోహన్‌ భాగవత్‌ మాత్రం మరోరకంగా ఆలోచిస్తున్నారు. సెవెంటీ ఫైవ్‌ దాటిందంటే శాలువా కప్పుకొని తప్పుకోవలసిందేనని ఆయన కుండబద్దలు కొడుతున్నారు.ఆరెస్సెస్‌ బాస్‌ విధిస్తున్న ఈ సెవెంటీ ఫైవ్‌ డెడ్‌లైన్‌పై భారత రాజకీయాల్లో ఈ సంవత్సరం పెద్ద చర్చే జరిగే అవ కాశముంది. ఈ నేపథ్యంలో మన సెవెంటీ ఫైవ్‌ ప్లస్‌ బాబు కూడా తననింతటి వాడిని చేసిన గోబెల్స్‌ వ్యూహాన్ని తన వారసుడి కోసం కూడా అమలు చేయడం మొదలుపెట్టాడు. అమెరికా వాళ్లు ఇటీవల ఇరాన్‌ మీద ప్రయోగించిన బంకర్‌ బస్టర్‌ లాంటి బాంబునొకదాన్ని సత్యసాయి జిల్లా కొత్తచెరువు స్కూల్లో చంద్రబాబు జారవిడిచారు. అడపాదడపా ఇలా బాంబులేయడం రివాజే కనుక పెద్దగా గగ్గోలు పుట్టలేదు కానీ, ఈ రకమైన క్షుద్ర రాజకీయాలను ఇంకో తరం కూడా భరించ వలసిందేనా అనే ఆందోళన మాత్రం మొదలైంది.జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అమలుచేసిన విప్లవాత్మక కార్యాచరణలో ‘అమ్మఒడి’ అనే పథకం అతి ముఖ్యమైనఅంశం. 2014 ఎన్నికలకు ముందు విడుదల చేసిన మేనిఫెస్టో లోనే ఆయనీ వాగ్దానం చేశారు. 2019లో గెలిచిన తర్వాత అమలు చేయడం, దీనిపై దేశవ్యాప్తంగా ప్రశంసలు కురవడం తెలిసిన విషయాలే. చంద్రబాబు ఈ పథకం పేరు ‘తల్లికి వందనం’గా మార్చి మరింత గొప్పగా చేస్తానంటూ తన సూపర్‌ సిక్స్‌ ఎన్నికల హామీల్లో చేర్చారు. ఏడాది ఎగనామం తర్వాత ఆంక్షల వర్తింపుతో అమల్లోకి తెచ్చి ఆ వీరతాడును మీడియా కెమెరాల సాక్షిగా తన కుమారుడి మెడలో వేశారు. పాఠశాల పిల్లలతో మాట్లాడుతూ ‘‘విద్యామంత్రి బాగా చదువుకున్నారు. మంత్రయ్యారు. ఇప్పుడు మీకోసం ‘తల్లికి వందనం’ అనే ఆలోచన ఆయనే చేశార’’ని నిస్సంకోచంగా చెప్పుకొచ్చారు. ఆ విధంగా తన గోబెల్స్‌ బాటన్‌ను మరుసటి తరం చేతికి అందజేశారు.‘మెగా పేరెంట్స్‌ – టీచర్స్‌ మీట్‌’ అనే మరో గిన్నీస్‌ బుక్‌ కార్యక్రమం ఈ వేడుకకు వేదికైంది. విద్యార్థుల డేటాబేస్‌ను నిర్వహించే కేంద్ర ప్రభుత్వ సంస్థ లెక్క ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో 87 లక్షలమంది విద్యార్థులుండాలి. ప్రతి విద్యార్థికీ ‘తల్లికి వందనం’ స్కీమును వర్తింపజేస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం 67 లక్షలమందినే లెక్క తేల్చింది. అందులో తల్లికి వందనం నిధులు 60 లక్షల లోపు విద్యార్థులకే అందినట్టు లెక్కలున్నాయి. మెగా పీటీఎమ్‌ రికార్డు బ్రేకింగ్‌ కార్యక్రమానికి 61 వేల పాఠ శాలల్లోని 74 లక్షలమంది విద్యార్థులు పాల్గొన్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. వారి తల్లిదండ్రులతో సహా 2 కోట్ల 30 లక్షల మంది హాజరై రికార్డు సృష్టించినట్టు చెప్పారు. 67 లక్షల మంది పిల్లల లెక్క తీసుకున్నప్పుడు తల్లుల సంఖ్యను 42 లక్షలుగా చూపెట్టారు. 74 లక్షలకు అదే నిష్పత్తితో లెక్కిస్తే తల్లుల సంఖ్య 46 లక్షలవుతుంది. అదే సంఖ్యలో తండ్రులు కూడా హాజరై ఉంటారు. 3 లక్షల పైచిలుకు టీచర్లు హాజరయ్యారు. అంతా కలిపి 1 కోటీ 69 లక్షలు. ఇంకో 60 లక్షలమంది పరిశీలకులూ, దాతలని పేర్కొన్నారు. సగటున ప్రతి పాఠశాలకు వందమంది వీరే. కొన్ని ప్రభుత్వ స్కూళ్లలోని విద్యార్థుల సంఖ్య కంటే దాతల సంఖ్యే ఎక్కువ కనిపించడం గిన్నిస్‌ బుక్‌లో చేర్చాల్సిన అసలు విషయం.విద్య ప్రభుత్వ బాధ్యత కాదు, కార్పొరేట్‌ సంస్థలే చూసుకోవాలన్న చంద్రబాబు కొటేషన్‌ మరీ పాతదేం కాదు. ఆరేడేళ్ల కిందటిదే. ఇంతలోనే ఈ బృహత్తర కార్యక్రమాన్ని అమలు చేయడం కోసం ఆయన తన ఫిలాసఫీని వదిలేసు కున్నారా? ఎంతమాత్రమూ కాదు. ఇది నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరించడం అనే డబుల్‌ యాక్షన్‌ ప్లాన్‌. ఈ పథ కాన్ని అమలు చేసే నాటికే ప్రభుత్వ బడుల్లో నాలుగు లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారు. ప్రభుత్వ స్కూళ్లలో ప్రైవేటు స్కూళ్లకు దీటుగా సౌకర్యాలు మెరుగుపరిచే ‘నాడు–నేడు’ కార్యక్రమం ఆగిపోయింది. విద్యార్థుల పౌష్టికాహారం కోసం 16 రకాల పదార్ధాలతో జగన్‌మోహన్‌రెడ్డి స్వయంగా పరిశీలించిన ‘గోరుముద్ద’ పథకం స్థానంలో బొద్దింకల భోజనం స్వయంగా మంత్రుల అనుభవంలోకే వచ్చింది. విద్యా ప్రమాణాలు మెరుగుపరచడం కోసం ప్రాథమిక స్థాయిలోనే జగన్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన సబ్జెక్ట్‌ టీచర్‌ బోధన ఎగిరిపోయింది. విద్యార్థులు లేక 4,700 పాఠశాలలు మూసివేతకు సిద్ధంగా ఉన్నాయి.పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం కోసం వైసీపీ సర్కార్‌ వెయ్యి స్కూళ్లలో ప్రారంభించిన సీబీఎస్‌ఈ బోధనను చంద్రబాబు – లోకేశ్‌ల సర్కార్‌ తొలగించింది. వారి నైపుణ్యానికి పదును పెట్టే టోఫెల్‌ శిక్షణను మాయం చేశారు. నగరాల్లో ఉన్నత వర్గాల వారు వారి పిల్లలకోసం లక్షలు గుమ్మ రించి చెప్పించే ఐబీ సిలబస్‌ను పేద పిల్లలకు ఉచితంగా నేర్పించాలన్న జగన్‌ సంకల్పానికి గండికొట్టారు. పేద విద్యార్థులు కూడా డిజిటల్‌ ప్రపంచంలో ముందడుగు వేయాలన్న లక్ష్యంతో ఎనిమిదో క్లాసు విద్యార్థులకు ట్యాబ్‌లను అందజేయడం ప్రారంభించింది జగన్‌ ప్రభుత్వం. ఆయన హయాంలో సుమారు పది లక్షలమంది చేతుల్లోకి ట్యాబ్‌లు వచ్చాయి. ఈ కార్య క్రమాన్ని నిర్దాక్షిణ్యంగా ఆపేసి, పేద బిడ్డల్ని డిజిటల్‌ ప్రపంచానికి దూరం చేసే కుట్రను అమలుచేశారు. పేద ప్రజల పిల్లల్ని ఐక్యరాజ్యసమితి వేదికపై నిలబెట్టిన ఇంగ్లిష్‌ మీడియం బోధనకు వ్యతిరేకంగా ఎన్ని కుట్రలు చేశారో, ఎంతమంది కుహనా సాంస్కృతిక రాబందుల్ని రంగంలోకి దింపారో, పేద పిల్లల నోటి దగ్గరి ‘నాణ్యతా’ ముద్దను తన్నేయడానికి ఎన్ని గద్దలు ఎగిరాయో ఈ సమాజం జ్ఞాపకాల్లోంచి అంత త్వరగా చెరిగిపోయేవి కావు.పేదల విద్యాసాధికారత మీద ఇన్ని కుట్రలు చేసిన తెలుగుదేశం పెద్దల పుర్రెల్లో ‘తల్లికి వందనం’ ఆలోచన పుట్టిందని చెప్పడం కంటే హాస్యాస్పద విషయం ఇంకేముంటుంది? ‘నాడు–నేడు’ కార్యక్రమాన్ని నిలిపివేయడం, జగన్‌ ప్రభుత్వం కల్పించిన సౌకర్యాలను క్రమంగా ఉపసంహరించడం, మధ్యాహ్న భోజన పథకాన్ని నీరుగార్చడం వంటివన్నీ ఉద్దేశ పూర్వక చర్యలేనని అభిజ్ఞవర్గాల సమాచారం. ఈ చర్యలు ఇంకా చురుగ్గా సాగుతాయట! రెండో దశలో ఇంకో ప్రచారం మొదల వుతుంది. ప్రైవేట్‌ స్కూళ్లలో చదివినా తల్లికి వందనం వస్తున్న ప్పుడు సౌకర్యాలు లేని ప్రభుత్వ స్కూళ్లలో ఎందుకు చదవాలని టముకు వేస్తారు. చేరగలిగిన వాళ్లంతా ప్రైవేట్‌కు మారిన తర్వాత అసలు కథ మొదలవుతుంది. ప్రైవేట్‌ స్కూళ్లలో చదివించే స్థోమత కలిగిన వారికి ప్రభుత్వ సాయమెందుకని పెంపుడు మీడియానే ప్రశ్నిస్తుంది. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు. విద్య ప్రభుత్వం బాధ్యత కాదనే చంద్రబాబు మాట నెగ్గి ప్రైవేట్‌ విద్య వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతుంది. నాణ్యమైన విద్యకు దూరమైన శ్రామిక వర్గాల పిల్లలు చౌక శ్రామికులుగానే మిగిలిపోతారు.బాల్యంలో వేగంగా నేర్చుకునే వయసులో ఉన్నప్పుడు వారికి అందే విద్యా ప్రమాణాలే వారి ఐక్యూ స్థాయులను నిర్ధారిస్తాయని అనేక సర్వేలు వెల్లడించాయి. పోషకాహార లేమి వేగంగా నేర్చుకునే సామర్థ్యాన్ని దెబ్బతీస్తుందని కూడా చాలాకాలంగా నిపుణులు చెబుతున్నారు. ఉన్నత స్థాయి బోధనా పద్ధతులు, డిజిటల్‌ పరిజ్ఞానం. పౌష్టికాహారం కొంత మందికి మాత్రమే అందుబాటులో ఉండి ఎక్కువమంది బాలలకు అందని ద్రాక్షలుగా ఉన్న దేశాలు ఐక్యూ ర్యాంకుల్లో వెనుకబడి ఉండటానికి కారణం అదే. విద్యా వ్యవస్థపై శాస్త్రీయమైన మదింపు చేసిన తర్వాతనే జగన్‌ మోహన్‌రెడ్డి మన పిల్లలకు ఇచ్చే ఆస్తి చదువు మాత్రమేనని తన ప్రసంగాల్లో, సందేశాల్లో పదేపదే ప్రస్తావించేవారు. జగన్,చంద్రబాబుల దృక్పథంలో ఉన్న మౌలికమైన తేడా ఇదే! పేద, ధనిక, కులం, మతం, ప్రాంతం, ఆడ, మగ తేడాల్లేకుండా చదువు అనే ఆస్తి అందరికీ సమకూరాలనేది జగన్‌మోహన్‌ రెడ్డి తాత్విక భూమిక. చదువు అనే ఆస్తి కూడా కొనుగోలు చేయగలిగినవాడికే చెందాలనేది చంద్రబాబు విచార ధార.అందుకే దాన్ని ప్రభుత్వ బాధ్యతగా కాకుండా కార్పొరేట్‌ బాధ్యతగా వర్గీకరించారు. ‘తల్లికి వందనం’ కార్యక్రమాన్ని చిత్తశుద్ధితో కాకుండా ఒక ఎరగా వేశారని నిపుణులు అభిప్రా యపడుతున్నది కూడా అందుకే!ఈ మౌలికమైన తేడా ఇప్పుడు ఉపాధ్యాయుల అనుభవంలోకి కూడా వచ్చినట్టుంది. మొన్నటి మెగా పీటీఎమ్‌ కార్య క్రమాన్ని ఒక ఈవెంట్‌లా నిర్వహిస్తున్నారంటూ వారి సామాజిక మాధ్యమ గ్రూపుల్లో విమర్శలు వెల్లువెత్తాయి. అందులో ఒక్క పోస్టును క్లుప్తంగా గమనిస్తే వారి అభిప్రాయం ఏమిటో తేటతెల్లమవుతుంది. ‘‘బాబుగారూ, లోకేశ్‌గారూ... మీరు ఈ సమావేశంలో కూర్చున్న బెంచీలు మీ ప్రభుత్వం ఇచ్చినవి కావు. మీ ఎదురుగా వున్న ఐఎఫ్‌పీ ప్యానెళ్లు మీరు ఏర్పాటు చేయలేదు. పైన తిరుగుతున్న ఫ్యాను, వెలుగుతున్న లైటూ కూడా మీరిచ్చినవి కావు. మిగిలిన నాలుగేళ్లయినా ఈ పనికి మాలిన సమావేశాలు మానేయండి. టీచర్ల కాలాన్ని వృథా చేయకండి. పిల్లల భవిష్యత్తును నాశనం చేయకండి. ఉపాధ్యా యుల్ని మీ కూటమి ప్రభుత్వం ఈవెంటు మేనేజర్లుగా మార్చేస్తున్నది. పిల్లల తల్లిదండ్రులతో టీచర్ల సమావేశాలు ప్రతినెలా జరుగుతూనే ఉన్నాయి. దయచేసి ఈ కార్యక్రమాన్ని రాజకీయ కార్యక్రమంగా మార్చవద్దు. ముఖ్య విషయం: పదిహేనేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న మీరు పాఠశాలలకు చేసిన మేలు ఒక్కటంటే ఒక్కటైనా ఉన్నదా?... చెప్పండి సీ.ఎం. సారూ!’’వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com

YS Jagan Mohan Reddy fires on Chandrababu Naidu3
ప్రజాస్వామ్యంలో ఉన్నామా? నియంతృత్వంలో ఉన్నామా?: వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పోలీసు యంత్రాంగాన్ని.. వారి అధికారాన్ని పూర్తిగా దుర్వినియోగం చేస్తూ ప్రశ్నించే గొంతుకలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్దాక్షిణ్యంగా నొక్కేస్తున్నారని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మనం అసలు ప్రజా­స్వామ్యంలో ఉన్నామా.. లేక నియంతృత్వంలో ఉన్నామా? అన్న సందేహం కలుగుతోందని మండిపడ్డారు. ఈ మేరకు శనివారం సామాజిక మాధ్య­మం ‘ఎక్స్‌’లో సుదీర్ఘ పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్‌ జగన్‌ ఏమన్నారంటే.. ‘ప్రశ్నించే హక్కుతో పాటు, నిరసన వ్యక్తం చేయడం అనేవి ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాది వంటివి. ప్రజలు తమ సమస్యలు ప్రస్తావించి, వాటి పరిష్కారం కోరడం అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు. కానీ, దురదృష్టవశాత్తు మన ఆంధ్రప్రదేశ్‌లో.. ప్రజాస్వామ్యంలో అత్యంత ముఖ్యమైన ప్రాథమిక హక్కు­లను చంద్రబాబు సారథ్యంలోని ప్రభు­త్వం నిర్దాక్షిణ్యంగా అణిచి వేస్తోంది. పోలీసు యంత్రాంగాన్ని, వారి అధికారాన్ని పూర్తిగా దుర్వినియోగం చేస్తూ ప్రశ్నించే గొంతుకలను నొక్కేస్తోంది. అసలు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? లేక నియంతృత్వంలో ఉన్నామా? అని సందేహం కలిగే స్థాయికి అది చేరింది. ప్రజలు తమ సమస్యలు లేవనెత్తినా, వారికి మద్దతుగా విపక్షం గళం విప్పినా ప్రభుత్వం సహించడం లేదు. దారుణంగా వేధిస్తున్నారు. లేని కేసులు సృష్టిస్తూ వారి గళాన్ని నొక్కడంతో పాటు, అసలు ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారే ఉండకూడదన్న విధంగా వ్యవహరిస్తున్నారు. ఈ ప్రక్రియలో రాష్ట్రంలో ఏ ఒక్కరినీ కూడా ఈ ప్రభుత్వం విడిచి పెట్టడం లేదు. అలా ప్రజాస్వామ్య స్ఫూర్తి, పౌర హక్కులకు తీవ్ర భంగం కలిగిస్తున్నారు. దీని వెనక ఉన్న ప్రధాన ఉద్దేశం ఒక్కటే. ఒక పద్ధతి ప్రకా­రం ప్రజాస్వామ్య వ్యవస్థకు విఘాతం కలిగించడంతో పాటు, ప్రతిపక్షం అనేది లేకుండా చేయాలి.. అలాగే ప్రశ్నించే ఏ గొంతుకా ఉండకూడదన్నదే ఈ ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది. ఆ దిశలో ఈ ప్రభుత్వం చేసిన, చేస్తున్న చర్యలు.. పద్ధతి ప్రకారం ప్రజాస్వామ్యాన్నే అణిచి వేసేలా వ్యవహరిస్తున్న తీరుకు ఈ ఘటనలు అద్దం పడుతున్నాయి. ఫిబ్రవరి 19, 2025. గుంటూరు మిర్చి యార్డు ‘దారుణంగా ధరలు పతనం కావడంతో మిర్చి రైతులు పడుతున్న కష్టాలు తెలుసుకుని, వారిని పరామర్శించేందుకు గుంటూరు మిర్చి యార్డును సందర్శించాను. మిర్చి ధరలు రూ.27 వేల నుంచి ఏకంగా రూ.8 వేలకు పడిపోయాయి. ఆ పరిస్థితుల్లో నేను గుంటూరు మిర్చి యార్డును సందర్శించి, ఆ రైతులను పరామర్శిస్తే కేసు నమోదు చేశారు. ఏప్రిల్‌ 8, 2025. శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి టీడీపీ మూకల చేతిలో దారుణ హత్యకు గురైన మా పార్టీకి చెందిన బీసీ నాయకుడు కురుబ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గంలోని రామగిరిలో పర్యటించాను. దానిపైనా కేసు నమోదు చేశారు. వైఎస్సార్‌సీపీ రాప్తాడు నియోజకవర్గం కోఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపైనా కేసు పెట్టారు. జూన్‌ 11, 2025. ప్రకాశం జిల్లా పొదిలి ఏ మాత్రం గిట్టుబాటు ధర లేక నానా ఇక్కట్లు పడుతున్న పొగాకు రైతులను పరామర్శించేందుకు వెళ్తే ఏకంగా మూడు కేసులు నమోదు చేశారు. పొగాకు బోర్డు సూచన మేరకు రైతులు 20 శాతం పొగాకు ఎక్కువ సాగు చేశారు. కానీ, ధరలు మాత్రం దారుణంగా పతనమయ్యాయి. ఈ పరిస్థితుల్లో నేను పొగాకు రైతుల పరామర్శకు వెళ్తే మూడు కేసులు పెట్టారు. 15 మంది రైతులను జైళ్లకు పంపడంతో పాటు, నలుగురిని అరెస్టు చేశారు. చివరకు న్యాయస్థానం కూడా ఈ చర్యను తప్పు బట్టింది.జూన్‌ 18, 2025. పల్నాడు జిల్లా సత్తెనపల్లి గత ఏడాది ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత పోలీసుల దారుణ వేధింపులకు గురై ఆత్మహత్య చేసుకున్న మా పార్టీ నాయకుడి కుటుంబాన్ని పరామర్శించేందుకు రెంటపాళ్ల వెళ్తే, అక్కడా కేసులు నమోదు చేశారు. ఐదు కేసులు నమోదు చేయడంతో పాటు ఏకంగా 131 మందికి నోటీసులు జారీ చేశారు. ఇంకా సినిమా పోస్టర్లు ప్రదర్శించిన ఇద్దరిని అరెస్టు చేశారు. జూలై 9, 2025. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం ఏ మాత్రం కొనుగోళ్లు లేక తీవ్ర నష్టాల్లో కూరుకుపోయిన తోతాపురి మామిడి రైతులను పరామర్శించేందుకు చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలోని మార్కెట్‌ యార్డును సందర్శిస్తే.. అక్కడా ఏకంగా ఐదు కేసులు నమోదు చేశారు. 20 మందిని అదుపులోకి తీసుకున్నారు. రెండు రోజులు గడిచినా, వారి అరెస్టు చూపలేదు. కోర్టులో ప్రవేశ పెట్టలేదు. వారంతా ఇంకా పోలీసుల అదుపులోనే ఉన్నారు. టార్గెట్‌ పెట్టుకున్న వారందరిపై కేసులు ప్రతి కేసుకు సంబంధించి ముగ్గురు, నలుగురి పేర్లు పెట్టి.. ఇంకా ఇతరులు అని రాస్తున్నారు. ఆ విధంగా తాము టార్గెట్‌ పెట్టుకున్న వారిని ఆ తర్వాత ఆ కేసులో జోడిస్తున్నారు. నా ప్రతి పర్యటనలో కూడా ప్రజలెవ్వరూ రాకుండా, తీవ్ర నిర్బంధం విధిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలకు నోటీసులు జారీ చే­యడమే కాకుండా, వారిని ముందస్తుగా హౌజ్‌ అరెస్ట్‌ చేస్తున్నారు. చివరకు రైతులను కూడా ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నారు. వారు రాకుండా నియంత్రించే కుట్ర చేస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ చెక్‌పోస్టులు పెట్టి, అడ్డుకుంటున్నారు. రాష్ట్రంలో ఉన్నది ఒకే ఒక విపక్షం. ప్రజా సమస్యలపై పోరా­డేది కూడా విపక్షమే. అలాంటి మా పార్టీని.. సీఎం చంద్రబాబు అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ, అణిచి వేసే ప్ర­యత్నాన్ని నిరంతరం కొనసాగిస్తున్నారు. లేని కేసులు బనాయించడం, అరెస్టులు చేయడం, ఆ విధంగా దారుణంగా వేధించడం పరిపాటిగా మారింది. అలా ప్రజాస్వామ్య స్ఫూర్తికే విఘాతం కలిగించడమే కాకుండా, వాయిస్‌లెస్‌ పీపుల్‌ వా­యిస్‌ను నొక్కేస్తున్నారు. అడ్డగోలు హామీలిచ్చి, ఏవీ అమలు చేయకుండా ఉన్న తమను ఎవరూ ప్రశ్నించకూడదు.. వాటిపై ఎవరూ మాట్లాడకూడదు.. అన్న విధంగా ఈ ప్రభుత్వం అత్యంత దారుణంగా వ్యవహరిస్తోంది’ అని పేర్కొన్నారు.

India Vs England 3rd Test Day 3 Match Highlights And Full Scorecard4
సరిగ్గా... సమంగా...

లార్డ్స్‌ మైదానంలో మూడు రోజు ఆట సమంగా ముగిసింది...భారత బ్యాటర్లు పట్టుదలగా నిలబడగా, ఇంగ్లండ్‌ కూడా కీలక సమయాల్లో వికెట్లతో మ్యాచ్‌లో నిలిచింది. సరిగ్గా ఇంగ్లండ్‌ చేసిన స్కోరునే భారత్‌ కూడా తొలి ఇన్నింగ్స్‌లో చేసింది. తొలి సెషన్‌లో రాహుల్‌–పంత్‌ల భాగస్వామ్యం, రెండో సెషన్‌లో జడేజా, నితీశ్‌ కుమార్‌ రెడ్డిల నిలకడ... భారత్‌ దీటైన స్కోరు చేసేందుకు దోహదం చేసింది. మూడు రోజులైనా ఎవరి పైచేయి ఖరారు కానీ ఈ ‘లార్డ్స్‌’ టెస్టును నేటి నాలుగో రోజే అటో... ఇటో... తేల్చనుంది. నిర్జీవమైన పిచ్‌పై రెండు రోజుల్లో 20 వికెట్లు సాధ్యమా అనేది సందేహమే! డ్రా కు, డ్రామాకు నేడు, రేపు రసవత్తర పోరు జరగనుంది.లండన్‌: బుమ్రా తన బౌలింగ్‌తో కూలగొట్టిన ప్రదర్శనకు దీటుగా భారత బ్యాటర్లు తలబడ్డారు. ఇంగ్లండ్‌ను సమష్టిగా ఎదుర్కొన్నారు. మూడో రోజంతా ఆడటంలో సఫలమైన టీమిండియా సరిగ్గా... సమానంగా ఇంగ్లండ్‌ చేసిన స్కోరే చేసింది. భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 119.2 ఓవర్లలో 387 పరుగుల వద్ద ఆలౌటైంది. ఓవర్‌నైట్‌ బ్యాటర్లలో కేఎల్‌ రాహుల్‌ (177 బంతుల్లో 100; 13 ఫోర్లు) సెంచరీ సాధించాడు. రిషభ్‌ పంత్‌ (112 బంతుల్లో 74; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు), రవీంద్ర జడేజా (131 బంతుల్లో 72; 8 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించారు.ఇంగ్లండ్‌ బౌలర్లలో క్రిస్‌ వోక్స్‌ 3, జోఫ్రా ఆర్చర్, బెన్‌ స్టోక్స్‌ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ మొక్కుబడిగా ఆడిన ఇంగ్లండ్‌ ఒక ఓవర్లో వికెట్‌ నష్టాపోకుండా 2 పరుగులు చేసింది. క్రాలీ (2 బ్యాటింగ్‌), డకెట్‌ (0) క్రీజులో ఉన్నారు. మూడో రోజు మరిన్ని ఓవర్లు ఆడేందుకు ఏమాత్రం ఇష్టపడని ఓపెనర్లు అదే పనిగా బుమ్రా ఓవర్‌ను ఎదుర్కొనేందుకు తాత్సారం చేశారు. దీంతో భారత కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ ఇంగ్లండ్‌ ఓపెనర్ల తీరును తప్పుబట్టాడు. రిషభ్‌ పంత్‌ ఫిఫ్టీ ఓవర్‌నైట్‌ స్కోరు 145/3తో మూడో రోజు ఆట ప్రారంభించిన భారత్‌ తొలి సెషన్‌లో ఆతిథ్య బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంది. పిచ్‌ సహకారంతో ఓపెనర్‌ రాహుల్, రిషభ్‌ పంత్‌ సాధికారికంగా ఆడారు. దీంతో ఆరంభంలోనే వికెట్‌ తీసి పట్టుబిగిద్దామనుకున్న ఇంగ్లండ్‌ ఆశలేవీ ఫలించలేదు. బౌలర్లను మార్చినా, స్పిన్‌ను ప్రయోగించినా ఈ జోడీ మాత్రం నింపాదిగానే పరుగులు రాబట్టింది. దీంతో ఈ సెషన్‌ అసాంతం భారత్‌దే పైచేయి అయింది. ఇద్దరు ఆచితూచి ఆడుతూనే, వీలుచిక్కిన బంతిని బౌండరీకి తరలించారు. రాహుల్, రిషభ్‌ల సమన్వయంతో పరుగుల రాకకు ఏ దశలోనూ ఇబ్బంది లేకపోయింది.చూస్తుండగానే జట్టు స్కోరు 200కు చేరింది. ఎట్టకేలకు లంచ్‌ విరామానికి ముందు ఇంగ్లండ్‌కు పంత్‌ వికెట్‌ రూపంలో ఓదార్పు లభించింది. లేని పరుగుకు ప్రయత్నించిన రిషభ్‌... స్టోక్స్‌ విసిరిన డైరెక్ట్‌ త్రోకు వికెట్‌ను సమరి్పంచుకున్నాడు. ఐదు మంది బౌలర్ల వల్ల కాని పనిని స్టోక్స్‌ ఒక్క త్రోతో విడగొట్టేశాడు. దీంతో నాలుగో వికెట్‌కు 141 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అతని వికెట్‌ పడిన 248/4 స్కోరు వద్దే లంచ్‌ బ్రేక్‌కు వెళ్లారు. రాహుల్‌ శతకానికి 2 పరుగుల దూరంలో నిలిచాడు. రాహుల్‌ శతక్కొట్టిన వెంటనే... రెండో సెషన్‌లో రాహుల్‌తో కలిసి జడేజా క్రీజులోకి వచ్చాడు. రాహుల్‌ సెంచరీ చేశాడన్న ఆనందం అతను అవుటవడంతోనే ఆవిరైంది. 176 బంతుల్లో సెంచరీ పూర్తిచేసుకున్న కేఎల్‌ రాహుల్‌... తర్వాత ఒక్క పరుగైన చేయకుండా ని్రష్కమించాడు. టెస్టుల్లో రాహుల్‌కిది పదో సెంచరీ కాగా... క్రికెట్‌ మక్కా లార్డ్స్‌లో రెండో శతకం. 2021–22 సీజన్‌లోనూ అతను శతక్కొట్టాడు. కాగా అతని వికెట్‌ ఇంగ్లండ్‌ శిబిరానికి పెద్ద సాఫల్యం. అదృష్టం కొద్ది సులువైన రనౌట్ల నుంచి నితీశ్‌ బతికిపోవడం జట్టుకు కాస్త ఊరటనిచి్చంది. లేదంటే బ్యాటింగ్‌ చేసే సామర్థ్యమున్న నితీశ్‌ వికెట్‌ కూడా భారత్‌ కోల్పోయేది. జడేజాకు జతగా నితీశ్‌ కుమార్‌ (30; 4 ఫోర్లు) విలువైన పరుగులు చేయడంతో జట్టు స్కోరు 300 దాటింది. 316/5 స్కోరు వద్ద ఈ సెషన్‌ ముగిసింది. జడేజా అర్ధ సెంచరీ టి విరామం తర్వాత కాసేపటికే నితీశ్‌ వికెట్‌ను పారేసుకున్నాడు. స్టోక్స్‌ బంతిని ఎదుర్కోవడంలో పొరపడిన నితీశ్‌ కీపర్‌ స్మిత్‌ చేతికి క్యాచ్‌ అప్పజెప్పి వెళ్లాడు. తర్వాత క్రీజులోకి వచి్చన వాషింగ్టన్‌ సుందర్‌ (23; 1 ఫోర్, 1 సిక్స్‌) అండతో జడేజా 87 బంతుల్లో ఫిఫ్టీ సాధించాడు. వీళ్లిద్దరి జోడీ కూడా ఆతిథ్య బౌలర్లను దీటుగా ఎదుర్కోవడంతో వికెట్‌ తీసేందుకు ఇంగ్లండ్‌ బౌలర్లు ఆపసోపాలు పడ్డారు. ఏడో వికెట్‌కు సరిగ్గా 50 పరుగులు జతయ్యాక జడేజా అవుటయ్యాడు. ఇతను అవుటైన 11 పరుగుల వ్యవధిలోనే ఆకాశ్‌ దీప్‌ (7), బుమ్రా (0) సుందర్‌ వికెట్లను కోల్పోవడంతో భారత్‌ సరిగ్గా 387 పరుగుల వద్దే ఆలౌటైంది. స్కోరు వివరాలు ఇంగ్లండ్‌ తొలిఇన్నింగ్స్‌: 387; భారత్‌ తొలిఇన్నింగ్స్‌: జైస్వాల్‌ (సి) బ్రూక్‌ (బి) ఆర్చర్‌ 13; రాహుల్‌ (సి) బ్రూక్‌ (బి) బషీర్‌ 100; కరుణ్‌ (సి) రూట్‌ (బి) స్టోక్స్‌ 40; శుబ్‌మన్‌ (సి) స్మిత్‌ (బి) వోక్స్‌ 16; పంత్‌ రనౌట్‌ 74; జడేజా (సి) స్మిత్‌ (బి) వోక్స్‌ 72; నితీశ్‌ రెడ్డి (సి) స్మిత్‌ (బి) స్టోక్స్‌ 30; సుందర్‌ (సి) బ్రూక్‌ (బి) ఆర్చర్‌ 23; ఆకాశ్‌ (సి) బ్రూక్‌ (బి) కార్స్‌ 7; బుమ్రా (సి) స్మిత్‌ (బి) వోక్స్‌ 0; సిరాజ్‌ నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (119.2 ఓవర్లలో ఆలౌట్‌) 387.వికెట్ల పతనం: 1–13, 2–74, 3–107, 4–248, 5–254, 6–326, 7–376, 8–385, 9–387, 10–387.బౌలింగ్‌: వోక్స్‌ 27–5–84–3, ఆర్చర్‌ 23.2–6–52–2, కార్స్‌ 24–5–88–1, స్టోక్స్‌ 20–4–63–2, బషీర్‌ 14.5–2–59–1, జో రూట్‌ 10.1–0–35–0. ఇంగ్లండ్‌ రెండోఇన్నింగ్స్‌: క్రాలీ బ్యాటింగ్‌ 2; డకెట్‌ బ్యాటింగ్‌ 0; మొత్తం (1 ఓవర్లో వికెట్‌ నష్టపోకుండా) 2/0. బౌలింగ్‌: బుమ్రా 1–0–2–0.

Sakshi Guest Column On Shiv Sena, Raj Thackeray, Uddhav Thackeray5
కలయిక సరే... లాభం ఎవరికి?

జూలై 9 నాటి, సాక్షి పత్రిక సంపా దకీయం– ‘ఠాక్రే సోదరుల యుగళం’ చదివాక, మరిన్ని వాస్తవాలు తెలియ జేయటానికి ఈ విశ్లేషణ. మరాఠీ అస్మిత (ఉనికి), మరాఠీ యువత ఉద్యోగావకాశాల కోసం రాజకీయ పార్టీలకు అతీతంగా 1966 జూన్‌ 19న ఏర్పాటైన శివసేన ‘మరాఠీ మానసాంచా హక్‌ ఆని న్యాయ సాఠీ’ (మరాఠీ వాళ్ళ న్యాయమైన హక్కుల కోసం) అనే నినాదం ఆ రోజుల్లో యువతను ఆకట్టుకుంది. భూమి పుత్రుల (సన్స్‌ ఆఫ్‌ సాయిల్‌) ఉద్యోగ సమస్యలు పరిష్కరిస్తూ, చట్ట సభలో వారి గొంతు వినిపించాలని మొదట ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌కు, తర్వాత విధాన స¿ý కు ప్రతినిధులన పంపటంతో రాజకీయాలతో ప్రమేయం లేని శివసేన, రాజకీయ రంగు పులుముకుంది. 1960, 1970 దశకాలలో కమ్యూనిస్టులకు నిలయం బొంబాయి నగరం అనేవారు. శివసేన రాకతో క్రమేణా కమ్యూనిస్టులు ఈ నగరంలో తెరమరుగు కావటం అప్పట్లో కాంగ్రెసుకు కూడా కలిసొచ్చింది. 1984 నుండి రైట్‌ వింగ్‌ జాతీయ పార్టీ అయిన భాజపాతో చేతులు కలిపిన శివసేన 1995లో కాషాయ కూటమితో మహారాష్ట్రలో (శివ షాహి) అధికారం చేజిక్కించుకుని, రాష్ట్రంలో కాంగ్రెసుకు ముఖ్య విరోధిగా ఎదిగింది. సుమారు నాలుగు దశాబ్దాలు పార్టీ అధినేత బాలా సాహెబ్‌ ఠాక్రే, సర్వం తానై పార్టీని రిమోట్‌ కంట్రోల్‌ శైలిలో, పకడ్బందీగా నడిపించారు (అడపా దడపా వలసలు మినహా). బాల్‌ ఠాక్రే సోదరుడు శ్రీకాంత్‌ కొడుకు స్వరరాజ్‌. ఈయన్నే రాజ్‌ అని పిలుస్తారు. చిన్నప్పటి నుండీ సాహెబ్‌తో చనువుగా ఉండేవాడు. తొమ్మిది పదేళ్ల ప్రాయం నుండే అతడిని తన ఒడిలో కూర్చోబెట్టుకుని పార్టీ మీటింగుకు తరచుగా హాజరయ్యేవారు బాల్‌ ఠాక్రే. పెద నాన్న ముఖ కవళికలు కలిగిన రాజ్‌ ఆయనలాగే పొలిటికల్‌ కార్టూన్లు గీయటం హాబీగా చేసుకున్నారు. బాలా సాహెబ్‌ హావ భావాలు, ఆయన ఉపన్యాస శైలి, బాడీ లాంగ్వేజ్‌ను అప్పటినుండే పుణికిపుచ్చుకున్న రాజ్‌ను, కాలేజీ రోజుల్లోనే శివసేన విద్యార్థి విభాగం ‘భారతీయ విద్యార్థి సేన’ చీఫ్‌గా నియమించి రాజకీయ సెలయేటిలోకి దించారు బాలా సాహెబ్‌. 1990 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అధినేతకు కుడి భుజంగా మెదిలిన రాజ్‌ను... మున్ముందు అతడే పార్టీ పగ్గాలు చేపట్టే సాహెబ్‌ వారసుడు అని అప్పట్లో కార్యకర్తలు చెప్పు కోసాగారు. మరాఠీ యువతకు కొత్త ఒరవడి చూపిస్తూ, పార్టీ లోకి వారిని చేర్చుతూ నవ చైతన్యం ప్రోదిచేశారు రాజ్‌. అయినా, పుత్ర వాత్సల్యం ప్రభావమో, మరే కారణమో తెలియదు కానీ రాజకీయాలకు బహుదూరంగా ఉన్న తన చిన్న కొడుకు ఉద్ధవ్‌ ఠాక్రేను 2002 నుండి రాజకీయాల వైపు మరల్చటం మొదలెట్టారు బాలా సాహెబ్‌. 2003లో జరిగిన శివసేన కార్యకర్తల శిబిర్‌లో ఉద్ధవ్‌ను పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంటుగా నియమించారాయన. అది రాజ్‌కు అస్సలు మింగుడు పడలేదు. ఆ లగాయతు పార్టీలో ఉద్ధవ్, రాజ్‌ మధ్య అంతర్గత యుద్ధం ముదిరింది. చివరికి 2005 నవంబర్‌లో పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి, నాలుగు నెలల తర్వాత (మార్చి 2006) సొంత కుంపటి, ‘మహారాష్ట్ర నవ నిర్మాణ సేన’ (ఎమ్‌ఎన్‌ఎస్‌) ఏర్పాటు చేసు కున్నారు రాజ్‌ ఠాక్రే. కానీ, రాజ్‌కు అనుకున్న ఫలితం దక్క లేదు. ఎమ్‌ఎన్‌ఎస్‌ 2009 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 13 సీట్లతో ఖాతా తెరిచింది. అయితే శివసేన ఓట్లను చాలా వరకు చీల్చింది. ఆ తర్వాత 2014, 2019ల్లో కేవలం ఒక్క సీటుకే పరిమితమై, మొన్నటి 2024 ఎన్నికల్లో 1.55 ఓటింగ్‌ శాతంతో ఆ ఒక్క సీటును సైతం పోగొట్టుకుంది. గత ఇరవై సంవత్సరాల నుండి ఉత్తర–దక్షిణ ధ్రువాలుగా ఉన్న ఈ సోదరులు మొన్నటి (జూలై 5) హిందీభాష వ్యతిరేక ఉద్యమ విజయోత్సవ ర్యాలీలో ఒకే వేదిక పైకి వచ్చినప్పటికీ, రాజ్‌ ఠాక్రే వ్యవహార తీరులో అనుకున్న స్పందన కనిపించ లేదని కొందరు విశ్లేషకుల అభిప్రాయం. రాజ్‌ దూకుడు వైఖరి, ఉద్ధవ్‌ నిదానమే ప్రధానం పద్ధతి వల్ల రాబోయే కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఇరుపార్టీలూ సీట్లు సర్దుబాటు చేసుకుని, ఓటర్ల ముందుకు రావటం క్లిష్ట సమస్యే కావచ్చు. అదీకాక, ఉద్ధవ్‌ కొడుకు, మాజీ మంత్రి ఆదిత్య; రాజ్‌ కొడుకు అమిత్‌ (మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడు)ల రాజకీయ భవిష్యత్తులు కూడా ఈ కలయిక నేపథ్యంలో ఆలోచించాల్సిన మరో కోణం.కాంగ్రెస్‌ దోస్తీ పుణ్యమా అని శివసేన (ఉద్ధవ్‌) పార్టీకి గత లోక్‌సభ ఎన్నికల్లో మైనారిటీ ఓట్లు చాలానే కలిసి వచ్చాయి. ఇప్పుడు ఆ పార్టీకి ఎమ్‌ఎన్‌ఎస్‌తో స్నేహం కారణంగా ఆ మైనారిటీ ఓట్లే కాక ఉత్తర భారతీయుల ఓట్లు కూడా మున్ముందు దూరం కావచ్చు. ‘రాజ్‌ ఠాక్రే బహిరంగ సభలో జనాన్ని ఆకర్షించవచ్చు కానీ, ఆయన భాషణ్‌ బ్యాలెట్‌ లోకి ఓట్లను తేలేద’ని సీనియర్‌ మరాఠా అధినేత, శరద్‌ పవార్‌ గతంలో ఒకసారి ఘంటాపథంగా చెప్పారు. అది వాస్తవం కూడా. ఏది ఏమైనా రాజ్‌ ఠాక్రే, తన అన్నయ్య ఉద్ధవ్‌తో రాజకీయ మైత్రి నెరపడానికి కారణం ఉపముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే ఓటు బ్యాంక్‌కు చెక్‌ పెట్టడమే కావచ్చు. అయితే ఈ కలయిక ‘మహా వికాస్‌ అఘాడీ’ కూటమిని కూడా ఇరకాటంలో పడేసింది. చివరిగా, ఠాక్రే సోదరులు కలిసిపోయే ఎపిసోడ్‌కు స్క్రిప్ట్‌ రైటర్‌ రాష్ట్ర బీజేపీ నాయకుడు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీసే అని అంటున్న స్థానిక విశ్లేషకుల మాటా గమనార్హమే!జిల్లా గోవర్ధన్‌ వ్యాసకర్త విశ్రాంత పీఎఫ్‌ కమిషనర్, ముంబైమొబైల్‌ : 98190 96949

Donald Trump releases new tariff letters for Mexico, European Union6
ఈయూ, మెక్సికోపై 30% టారిఫ్‌లు 

వాషింగ్టన్‌: యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ), మెక్సికో దేశాల ఉత్పత్తులపై 30 శాతం టారిఫ్‌లు విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. ఆగస్టు 1వ తేదీ నుంచే ఈ సుంకాలు అమల్లోకి వస్తాయని వెల్లడించారు. సుంకాలపై ఆయా దేశాలకు రాసిన లేఖలను సోషల్‌ మీడియాలో శనివారం పోస్టుచేశారు. అక్రమ వలసదారులు, మత్తు పదార్థాలు అమెరికాలోకి ప్రవేశించకుండా నిరోధించడానికి మెక్సికో ప్రభుత్వం తమకు చక్కగా సహకరిస్తోందని మెక్సికోకు రాసిన లేఖలో ట్రంప్‌ ప్రశంసించారు. మత్తు పదార్థాల నియంత్రణకు మరింత కృషి చేయాల్సిన అవసరం ఉందని మెక్సికో ప్రభుత్వానికి సూచించారు. అలాగే ఈయూతో అమెరికాకు వాణిజ్య లోటు ఉందని, ఇది తమ జాతీయ భద్రతకు ముప్పేనని తేల్చిచెప్పారు. ఈ లోటును పూడ్చడానికి కలిసికట్టుగా పనిచేద్దామని ఈయూకు రాసిన లేఖలో పిలుపునిచ్చారు. అమెరికా ఉత్పత్తులపై ఈయూ దేశాలు అధికంగా టారిఫ్‌లు విధిస్తున్నాయని ట్రంప్‌ అసంతృప్తి వ్యక్తంచేశారు. ఆయన ఇప్పటిదాకా 24 దేశాలతోపాటు 27 దేశాలతో కూడిన ఈయూపై టారిఫ్‌లను ప్రకటించారు. మరికొన్ని దేశాలపై సుంకాలను త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. ఏ రెండు దేశాల మధ్యనైనా సరే టారిఫ్‌లు ఒకేరకంగా ఉండాలని ట్రంప్‌ వాదిస్తున్నారు. ఒక దేశం నుంచి వచ్చే ఉత్పత్తులపై అధికంగా సుంకాలు వసూలు చేస్తూ.. అదే దేశానికి ఎగుమతయ్యే మన ఉత్పత్తులపై సుంకాలు తక్కువగా ఉండాలని కోరుకోవడం న్యాయం కాదని అంటున్నారు.

New ration cards will be distributed on Monday7
పదేళ్ల తర్వాత.. కొత్త రేషన్‌కార్డులు

సాక్షి, హైదరాబాద్‌/సాక్షిప్రతినిధి, నల్లగొండ: రాష్ట్రంలో దశాబ్ద కాలం తర్వాత అధికారికంగా సోమవారం కొత్త రేషన్‌కార్డులు పంపిణీ చేయనున్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి మండల కేంద్రంలో సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా కొత్త రేషన్‌కార్డులు జారీ చేయనున్నారు. మంత్రులు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్‌ తదితరులు ఈ సభలో పాల్గొంటారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక..ఈ జనవరి 26 తర్వాత మొదలైన కొత్త కార్డుల జారీ ప్రక్రియ నిరాటంకంగా సాగుతోంది. ఇప్పటి వరకు కొత్తగా జారీ చేసిన, చేస్తున్న కార్డుల సంఖ్య 5,61,343. పాత కార్డుల్లోని డూప్లికేట్‌ పేర్లు తొలగించిన తర్వాత..ప్రస్తుతం కార్డుల్లో సభ్యుల సంఖ్య 3,09,30,911గా తేల్చారు. ఇంత పెద్ద మొత్తంలో ఇప్పుడే... పదేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం రేషన్‌కార్డుల స్థానంలో జాతీయ ఆహారభద్రత చట్టం (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ) కింద ఆహార భద్రత కార్డులను జారీ చేసింది. అప్పట్లో రాష్ట్రంలో సుమారు 55 లక్షల కార్డులను మాత్రమే కేంద్ర ప్రభుత్వం జారీ చేయగా, ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ కార్డులతో సంబంధం లేకుండా మరో 30 లక్షల కార్డులను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. తర్వాత జరిగిన పరిణామాల్లో అప్పుడప్పుడు జారీ చేసిన కార్డులు, తొలగించిన కార్డులు పోగా 2023లో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారం కోల్పోయే నాటికి రాష్ట్రంలో 89.95 లక్షల ఆహార భద్రత కార్డులు ఉన్నాయి. కాగా కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వ చ్చిన తర్వాత జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి కొత్త కార్డుల జారీ ప్రకటన చేశారు. అప్పటి నుంచి మే 23వ తేదీ వరకు కొత్తగా 2.03 లక్షల కార్డులు జారీ అయ్యాయి. ఆ తర్వాత 24 మే నుంచి ఇప్పటి వరకు మరో 3.58 లక్షల కార్డులను ఆన్‌లైన్‌లో జారీ చేశారు.దీంతో ఇప్పటి వరకు జారీ చేసిన కార్డుల సంఖ్య 5,61,343గా తేల్చారు. దీంతో రాష్ట్రంలో ఉన్న రేషన్‌ కార్డుల సంఖ్య 95,56,625గా పౌరసరఫరాల శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. కొత్త సభ్యులను చేర్చుకుంటూ, పాత రేషన్‌కార్డుల్లోని ఉమ్మడి కుటుంబాల్లో పెళ్లిళ్లు అయిన వారిని, ఇళ్లల్లో లేని వారిని తొలగించగా, రాష్ట్రంలో రేషన్‌ పొందేందుకు అర్హులుగా 3.09 కోట్లుగా నిర్ధారించినట్టు పౌరసరఫరాల శాఖ స్పష్టం చేసింది. పది జిల్లాల్లో అత్యధిక కార్డులు పది జిల్లాల్లో కొత్త రేషన్‌ కార్డులు ఎక్కువగా పంపిణీ చేయబోతున్నారు. రాష్ట్రంలోనే అత్యధికంగా నల్లగొండ జిల్లాలో 50,102 కొత్త రేషన్‌ కార్డులు రాబోతున్నాయి. ఆ తర్వాత కరీంనగర్‌లో 31,772 కొత్త కార్డులను ఇవ్వబోతున్నారు. కొత్త కార్డుల జారీ తర్వాత అత్యధికంగా 6,67,778 రేషన్‌కార్డులు ఉన్న జిల్లాగా హైదరాబాద్, అతి తక్కువ కార్డులు కలిగిన జిల్లాగా 96,982 కార్డులతో ములుగు ఉంది. 5,61,343 కార్డుదారులకు ప్రయోజనం : మంత్రి ఉత్తమ్‌రాష్ట్రంలో కొత్తగా 5,61343 రేషన్‌కార్డులు అందజేస్తున్నామని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. తద్వారా 45,34,430 మందికి ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు. రాష్ట్రంలో పదేళ్ల తర్వాత ఇంత పెద్ద ఎత్తున రేషన్‌కార్డులు పంపిణీ చేస్తున్న ప్రభుత్వం తమదేనని వెల్లడించారు. పాతకార్డుల్లో పేర్ల చేర్పు ద్వారా మరో 28,32,719మందికి ప్రయోజనం చేకూరుతుందన్నారు.మొత్తంగా కార్డుల సంఖ్య 95,56,625 సన్నబియ్యం ఇచ్చేది 3,09,30,911 మందికి 13 ఏళ్ల తర్వాత కార్డు నాకు వివాహమై 13 ఏళ్లు అవుతోంది. మాకు ఇద్దరు పిల్లలు. ఇంతవరకు రేషన్‌ కార్డు రాలేదు. ఇరవై ముప్పై సార్లు మీసేవ కేంద్రంలో, తహసీల్దార్‌ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాం. అయినా రాలేదు. ఈసారి దరఖాస్తు చేసుకున్నాం. ఇప్పుడు కార్డు వస్తోంది. – బూరి రేణుక, మొల్కపట్నం, నల్లగొండసంతోషంగా ఉంది చేనేత కార్మికులుగా పనిచేస్తూ జీవనం గడుపుతున్నాం. నాలుగైదేళ్లుగా కార్డు కోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. గతంలోనూ అనేకసార్లు దరఖాస్తు చేసుకున్నాం. అయినా రాలేదు. ఇప్పుడు మీసేవలో దరఖాస్తు చేసుకున్నాం. కార్డు అప్రూవ్‌ అయ్యింది. – చెరుపల్లి నవీన, గట్టుప్పల్, నల్లగొండఇప్పటికొచ్చింది నాకు ఐదేళ్ల కిందట వివాహమైంది. ఇద్దరు పిల్లలు ఉన్నారు. గత ప్రభుత్వంలో రేషన్‌ కార్డు కోసం రెండుసార్లు దరఖాస్తు చేశా. అయినా రాలేదు. మొత్తానికి ఇప్పుడు అప్రూవ్‌ అయ్యింది. – బొందల విక్రం, తుమ్మల పెన్‌పహాడ్, సూర్యాపేట

Luxury EV sales zoom 66percent in India8
లగ్జరీ ఈవీలవైపు..  సంపన్నుల చూపు

న్యూఢిల్లీ: దేశీయంగా అత్యంత సంపన్నులు కాలుష్యకారక ఇంధనాలతో నడిచే వాహనాలతో పోలిస్తే క్రమంగా పర్యావరణహితమైన వాహనాల వైపు మళ్లుతున్నారు. దీనితో లగ్జరీ కార్ల విభాగంలో ఎలక్ట్రిక్‌ వాహనాల (ఈవీ) వాటా పెరుగుతోంది. వాహన్‌ పోర్టల్‌ గణాంకాల ప్రకారం 2024 జనవరి–మే మధ్య కాలంలో లగ్జరీ సెగ్మెంట్లో 7 శాతంగా ఉన్న ఈవీల వాటా ఈ ఏడాది అదే వ్యవధిలో 11 శాతానికి చేరింది. ఏకంగా 66 శాతం వృద్ధి చెందింది. ప్రీ–ఓన్డ్‌ కార్ల మార్కెట్లో కూడా ఇదే ధోరణి కనిపిస్తోంది. 2025లో జూన్‌ నెలాఖరు వరకు అమ్ముడైన ఖరీదైన కార్లలో 10 శాతం వాటా ఈవీలదే ఉంటోంది. గతేడాది ఇదే వ్యవధిలో వీటి వాటా 5 శాతం లోపే నమోదైంది. కొత్త మోడల్స్‌ దన్ను.. మెర్సిడెస్‌ బెంజ్, బీఎండబ్ల్యూ, ఆడిలాంటి దిగ్గజ సంస్థలు ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్‌ను ప్రవేశపెడుతుండటం కూడా ప్రీమియం కస్టమర్లకు ఎలక్ట్రిక్‌ వాహనాలపై ఆసక్తి నెలకొనడానికి కారణమని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. బీఎండబ్ల్యూ ఐఎక్స్‌1 మోడల్‌ గేమ్‌చేంజర్‌గా నిల్చిందని పేర్కొన్నాయి. ఇక, తమిళనాడులోని రాణిపేటలో 2026 తొలి నాళ్లలో భారీ ప్లాంటును ఏర్పాటు చేస్తున్నట్లు జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ ఇటీవల ప్రకటించింది. ప్రాథమికంగా దీని వార్షికోత్పత్తి సామర్థ్యం 30,000 యూనిట్లుగా ఉంటుంది. ఇక అమెరికన్‌ దిగ్గజం టెస్లా కూడా భారత్‌లో విక్రయాలకు సిద్ధమవుతోంది. జూన్‌ 15న తొలి స్టోర్‌ను ముంబైలో ప్రారంభిస్తోంది. దీనితో ఎలక్ట్రిక్‌ వాహనాల విభాగం మరింత ఆసక్తికరంగా మారుతోంది. ప్రస్తుతం ఈవీలను ఎందుకు కొనాలి అనే సందేహం నుంచి బైటపడి ఏ ఈవీని కొనుక్కోవాలి అనే ఆలోచించే వైపు కొనుగోలుదార్లు మళ్లుతున్నట్లు మెర్సిడెస్‌ బెంజ్‌ ఎండీ సంతోష్‌ అయ్యర్‌ తెలిపారు. తాను రెండేళ్లుగా ఈవీని ఉపయోగిస్తున్నానని పేర్కొన్నారు. మాస్‌ మార్కెట్‌ ఈవీల రేట్లు కూడా దాదాపు సంప్రదాయ ఐసీఈ వాహనాల ధరలకు కాస్త అటూ ఇటూగా ఉండటం కూడా ఎలక్ట్రిక్‌ వాహనాల డిమాండ్‌కి దోహదపడుతోంది. ట్యాక్సేషన్‌పరమైన ప్రయోజనాల వల్ల లగ్జరీ సెగ్మెంట్లో ఐసీఈ వాహనాలతో పోలిస్తే ఈవీల రేట్లు కొన్ని సందర్భాల్లో 4–5 శాతం తక్కువకే లభిస్తున్నాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఇక , డ్రైవింగ్‌పరంగా సౌకర్యం, చార్జింగ్‌ పాయింట్లు పెరుగుతుండటం వంటి అంశాలు సైతం ఎలక్ట్రిక్‌ వాహనాలపై ఆసక్తికి దోహదపడుతున్నాయని వివరించాయి. రేంజ్‌పరమైన (మైలేజీ) ఆందోళన కూడా తగ్గుతోందని పేర్కొన్నాయి. టాప్‌ ఎండ్‌ లగ్జరీ కార్లకు డిమాండ్‌ దేశీయంగా టాప్‌ ఎండ్‌ లగ్జరీ, బ్యాటరీ ఎలక్ట్రిక్‌ వాహనాలకు గణనీయంగా డిమాండ్‌ నెలకొందని మెర్సిడెస్‌ బెంజ్‌ ఇండియా ఎండీ సంతోష్‌ అయ్యర్‌ తెలిపారు. వ్యక్తిగత అభిరుచులకు అనుగుణంగా తీర్చిదిద్దిన వాహనాలపై కస్టమర్లు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో అమ్మకాలపరంగా అత్యుత్తమ గణాంకాలను నమోదు చేసినట్లు చెప్పారు. 4,238 కార్లను విక్రయించినట్లు పేర్కొన్నారు. ఎస్‌–క్లాస్, మేబాక్, ఏఎంజీల్లాంటి టాప్‌ ఎండ్‌ వాహన విక్రయాలు 20 శాతం ఎగిశాయని వివరించారు. కొత్తగా జీఎల్‌ఎస్‌ ఏఎంజీ లైన్‌కి సంబంధించి రెండు వాహనాలను కంపెనీ ప్రవేశపెట్టింది. వీటి ధర రూ. 1.4 కోట్ల నుంచి ప్రారంభమవుతుంది.

CJI Justice Bhushan Ramakrishna Gavai On Constitution9
ఒకే రాజ్యం.. ఒకే రాజ్యాంగం..

సాక్షి, హైదరాబాద్‌: అమెరికాలో రాష్ట్రంలో ఒకటి.. దేశంలో మరొకటి ద్వంద్వ పౌరసత్వం ఉంటుందని.. మన దేశం (రాజ్యం)లో అది సాధ్యం కాదని.. ఒకే దేశం–ఒకే రాజ్యాంగం మనదని బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ వ్యాఖ్యానించారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ భూషణ్‌ రామకృష్ణ గవాయ్‌ పేర్కొన్నారు. శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలు ఎలా పనిచేయాలో ఆయన రోడ్‌మ్యాప్‌ వేశారన్నారు. 75 ఏళ్లుగా ఇలా చెక్కుచెదరకుండా ఉన్నామంటే అందుకు దృఢమైన రాజ్యాంగమే కారణమని చెప్పారు. భవిష్యత్‌ అవసరాల మేరకు రాజ్యాంగ సవరణ అనివార్యమంటూనే ప్రాథమిక హక్కుల రక్షణ బాధ్యతను సుప్రీంకోర్టుకు అప్పగించారని వెల్లడించారు. భారత రాజ్యాంగం: అంబేడ్కర్‌ పాత్ర అనే అంశంపై ఉస్మానియా యూనివర్సిటీ ఠాగూర్‌ ఆడిటోరియంలో శనివారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సీజేఐ జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ రాజ్యాంగ రూపకల్పన సమయంలో అంబేడ్కర్‌ ఆలోచనా సరళిని లోతుగా విశ్లేషిచారు. అట్టడుగు వర్గాలకు న్యాయం చేరాలని.. రాజ్యాంగ విలువలు, లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. దేశంలో అంతర్గత సంఘర్షణలు ఎన్ని వచ్చినా మన రాజ్యాంగం వల్లే బలంగా తట్టుకొని నిలబడగలిగామని చెప్పారు. నేరుగా ‘సుప్రీం’ను ఆశ్రయించే వెసులుబాటు.. ‘భవిష్యత్తు అవసరాల రీత్యా రాజ్యాంగ సవరణకు అంబేడ్కర్‌ అనుమతించారు. ఆ స్ఫూర్తితో పనిచేయాల్సిన అవసరం ఉంది. అతి సమైక్య, అతి కేంద్రీకృత రాజ్యాంగాన్ని అంబేడ్కర్‌ వ్యతిరేకించిన విషయాన్ని గుర్తుంచుకోవాలి. రాజ్యాంగ ఆత్మలా, రక్షణ కవచంలా ఆరి్టకల్‌ 32 పౌర హక్కులకు భంగం కలగకుండా కాపాడుతోంది. పరిష్కార మార్గాలు లేని హక్కులున్నా ఉపయోగం లేదని అంబేడ్కర్‌ చెప్పిన విషయాన్ని మరిచిపోవద్దు. పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లితే నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించే వెసులుబాటును రాజ్యాంగం కల్పించింది. అమెరికాలో ద్వంద పౌరసత్వం అమల్లో ఉన్నా.. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంతోపాటు సమాఖ్య పౌరసత్వం ఉంది. అందుకు భిన్నంగా రాష్ట్రాలన్నింటినీ ఏకతాటిపైకి తెచ్చేలా బలమైన ప్రజాస్వామ్య రాజ్యంగా పటిష్టపరిచే ఒకే దేశం ఒకే రాజ్యాంగాన్ని అంబేడ్కర్‌ అమల్లోకి తీసుకురావడం గరి్వంచదగిన విషయం. 1973లో ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక హక్కులపై ఘర్షణ వచ్చింది. దీనిపై 13 మంది న్యాయమూర్తుల సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టమైన ఉత్తర్వులిచ్చింది. ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు కలిసే పనిచేస్తాయని తేల్చిచెప్పింది. శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలకు కూడా రోడ్‌మ్యాప్‌ నిర్మాణంలో అంబేడ్కర్‌ పాత్ర ఎనలేనిది’అని సీజేఐ జస్టిస్‌ గవాయ్‌ వివరించారు. త్వరలోనే మళ్లీ ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వచ్చి ఎక్కువ సమయం కేటాయిస్తానని ప్రసంగాన్ని ముగించారు. అంబేడ్కర్‌కు హైకోర్టు సీజేగా ఆఫర్‌.. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ పమిడిఘంటం శ్రీ నరసింహ ప్రసంగిస్తూ ‘హైదరాబాద్‌ నా సొంత నగరం. ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నా. నా సొంత నగరంలో నా వర్సిటీకి సీజీఐ రావడం, ఈ కార్యక్రమంలో నేను కూడా పాల్గొనడం హర్షణీయం. అంబేడ్కర్‌కు హైదరాబాద్‌తో అనుబంధం ఉంది. సామాజిక న్యాయ పోరాటంలో భాగంగా అంబేడ్కర్‌ భాగ్యనగరాన్ని సందర్శించారు. నిజాం నవాబ్‌ ఆయన్ను కలసి తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉండాలని కోరారు. అయితే ఆ ఆఫర్‌ను అంబేడ్కర్‌ సున్నితంగా తిరస్కరించారు. మన దేశ రాజ్యాంగం ఎంతో గొప్పది.. ఔన్యతమైనది’అని వెల్లడించారు. అంబేడ్కర్‌తో హైదరాబాద్‌కు ఉన్న అనుబంధాన్ని ఆయన గుర్తుచేశారు. ఇక్కడ జరిగిన సామాజిక ఉద్యమాలకు ఆయన మద్దతు ప్రకటించారన్నారు. అంబేడ్కర్‌ తన ఆత్మకథలో హైదరాబాద్‌ ఉద్యమాలు, సామాజిక న్యాయం సహా అనేక విషయాలను పొందుపరిచారని వివరించారు. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సుజోయ్‌పాల్‌ ప్రసంగిస్తూ 1947 అక్టోబర్‌లో రాజ్యాంగ ముసాయిదా సిద్ధమైందని.. రెండున్నరేళ్ల చర్చలు, భేటీల తర్వాత 1949 నవంబర్‌లో తుదిరూపు వచ్చిందన్నారు. బీఆర్‌ గవాయ్‌ తండ్రి అంబేడ్కర్‌కు సన్నిహితుడు.. అడ్వొకేట్‌ జనరల్‌ ఎ.సుదర్శన్‌రెడ్డి ప్రసంగిస్తూ 1953 జనవరి 12న అంబేడ్కర్‌కు ఓయూ గౌరవ డాక్టరేట్‌ ప్రదానం చేసిందన్నారు. ఇది ఓ భారతీయ విశ్వవిద్యాలయం ఆయనకు ప్రదానం చేసిన తొలి డాక్టరేట్‌ అని చెప్పారు. బీఆర్‌ గవాయ్‌ తండ్రి ఆర్‌ఎస్‌ గవాయ్‌ అంబేడ్కర్‌కు అత్యంత సన్నిహితుడని.. దాదా సాహెబ్‌ గవాయ్‌గా ఆయన సుపరిచితుడన్నారు. విద్యావేత్త, రాజకీయ నేత, సామాజిక కార్యకర్తగానే కాకుండా పలు రాష్ట్రాలకు గవర్నర్‌గా పనిచేశారన్నారు. ఓయూ ఉపకులపతి ఆచార్య కుమార్‌ మొలుగరం మాట్లాడుతూ... 108 ఏళ్ల ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రగతిని నివేదించారు. కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, పీపీ పల్లె నాగేశ్వర్‌రావు, రిజిస్ట్రార్‌ జనరల్‌ (ఎఫ్‌ఏసీ) గోవర్దన్‌రెడ్డి, ఏఏజీలు ఇమ్రాన్‌ఖాన్, తేరా రజనీకాంత్‌రెడ్డి, రిజిస్ట్రార్‌ ఆచార్య నరేశ్‌రెడ్డి, ఓఎస్డీ ఆచార్య జితేందర్‌ కుమార్‌ నాయక్, న్యాయవాదులు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేడ్కర్‌ పోస్టల్‌ కవర్‌ను జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ విడుదల చేశారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆహూతులను అలరించాయి.

Air India Plane Crash: AAIB Preliminary Report Released10
ఇంధనం అందలేదు!

‘ఇంధన నియంత్రణ స్విచ్‌ను ఎందుకు ఆపేశావు?’ – ఆదుర్దాగా ప్రశ్నించిన పైలట్‌‘నేను ఆపలేదు’ – బదులిచ్చిన రెండో పైలట్‌దేశమంతటినీ శోకసంద్రంలో ముంచిన అహ్మదాబాద్‌ ఎయిరిండియా విమాన ప్రమాదానికి క్షణాల ముందు పైలట్ల తుది సంభాషణ ఇది. వారిమధ్య నెలకొన్న అయోమయానికి ఈ సంభాషణ అద్దం పడుతోందని ఎయిర్‌క్రాఫ్ట్‌ యాక్సిడెంట్‌ ఇన్వెస్టిగేషన్‌ బ్యూరో పేర్కొంది.న్యూఢిల్లీ: జూన్‌ 12న అహ్మదాబాద్‌ నుంచి లండన్‌ బయల్దేరిన ఎయిరిండియా బోయింగ్‌ 787 డ్రీమ్‌లైనర్‌ విమానం టేకాఫైన 32 క్షణాల వ్యవధిలోనే రన్‌వేను ఆనుకుని ఉన్న వైద్య కళాశాల భవనాలపై కుప్పకూలడం, 241 మంది ప్రయాణికులతో సహా మొత్తం 260 మంది దుర్మరణం పాలవడం తెలిసిందే. దీనిపై దర్యాప్తు చేపట్టిన ఏఏఐబీ, ఇప్పటిదాకా వెలుగు చూసిన కీలకాంశాలతో రూపొందించిన 15 పేజీల ప్రాథమిక నివేదికను సంస్థ శనివారం విడుదల చేసింది. ‘‘విమానం టేకాఫైనక్షణాల్లోనే రెండు ఇంజన్ల తాలూకు ఇంధన నియంత్రణ స్విచ్‌లు ఒక్క సెకన్‌ వ్యవధిలో ఒకదాని తర్వాత ఒకటి ‘రన్‌’ నుంచి ‘ఆఫ్‌’ మోడ్‌కు మారిపోయాయి. దాన్ని గమనించగానే పైలట్లు పరస్పరం ప్రశ్నలు సంధించుకున్నారు.అప్పటికే ఇంజన్లకు ఇంధన సరఫరా ఆగిపోవడంతో విమానం పైకెగిరేందుకు అత్యవసరమైన థ్రస్ట్‌ లభించలేదు. అప్పటికి కేవలం 625 అడుగుల ఎత్తుకు మాత్రమే వెళ్లిన విమానం అక్కణ్నుంచి శరవేగంగా కిందకు దిగడం మొదలైంది. పరిస్థితిని చక్కదిద్దేందుకు పైలట్లిద్దరూ శాయశక్తులా ప్రయత్నించారు. తొలుత మొదటి ఇంజన్‌ ఇంధన స్విచ్‌ను, రెండు సెకన్లలోనే రెండో స్విచ్‌ను ఆన్‌ చేసినా లాభం లేకపోయింది. మొదటి ఇంజన్‌ కాసేపు రికవరీ అయినట్టే కనిపించినా ఆ వెంటనే చేíÙంచిన మీదట ఏఏఐబీ ఈ మేరకు అంచనాకు వచ్చింది ‘‘విమానానికి విద్యుత్‌ సరఫరా చేసే ఆగ్జిలరీ పవర్‌ యూనిట్‌ (ఏపీయూ) ఇన్‌లెట్‌ డోర్‌ టేకాఫ్‌ ప్రక్రియ పూర్తవకుండానే అనూహ్యంగా తెరుచుకుంది. ఇంజన్లు మొరాయించిన సమయంలోనే ఇది చోటుచేసుకుంది. విమానం చుట్టూ వాయు ప్రవాహాన్ని తీవ్రంగా ప్రభావితం చేయగల పరిణామమిది!’’ అని వివరించింది. స్విచ్‌లు ఆఫ్‌ కావడానికి ఏఏఐబీ ఎలాంటి కారణమూ పొందుపరచకపోయినా, ‘‘ఇంధన నియంత్రణ స్విచ్‌లు ఆటోమేటిగ్గా పని చేయవు. ఎవరో ఒకరు పూనుకుని వాటిని ఆన్, ఆఫ్‌ చేయాల్సిందే’’ అని చెప్పుకొచ్చింది. తద్వారా, పైలట్లే పొరపాటున ఆ పని చేసి ఉంటారనే సంకేతాలిచ్చింది.అంతా 32 సెకన్లలోపే...ఇదీ ప్రమాదక్రమం...⇒ ఉదయం 11.17: ఢిల్లీ నుంచి⇒ అహ్మదాబాద్‌ విమానాశ్రయంలో దిగిన ఎయిరిండియా విమానం⇒ మధ్యాహ్నం 1.38:39: రన్‌వే నంబర్‌ 23 నుంచి టేకాఫ్‌ అయిన విమానం⇒ మధ్యాహ్నం 1.38:42: టేకాఫై 180 నాట్ల ఐఏఎస్‌ వేగం అందుకున్న విమానం. అదే సమయంలో ‘రన్‌’ పొజిషన్‌ నుంచి ‘కటాఫ్‌’కు మారిన రెండు ఇంధన నియంత్రణ స్విచ్‌లు⇒ 1.38:47: ఇంధన సరఫరా నిలిచిపోవడంతో రెండు ఇంజన్లూ విఫలమయ్యాయి. దాంతో విమానం పూర్తిగా గాల్లోకి లేచేందుకు కావాల్సిన మినిమం ఇడిల్‌ రేట్‌ను అందుకోలేదు. అందుకు కావాల్సిన హైడ్రాలిక్‌ పవర్‌ అందించేందుకు రామ్‌ ఎయిర్‌ టర్బైన్‌ (ఆర్‌ఏటీ) పంప్‌ క్రియాశీలమైంది.⇒ 1.38:52: ఆన్‌ అయిన ఒకటో ఇంజన్‌ స్విచ్‌⇒ 1.38:54: తెరుచుకున్నఏపీయూ ఇన్‌లెట్‌ తలుపు⇒ 1.38:56: ఆన్‌ అయిన రెండో ఇంజన్‌ స్విచ్‌⇒ 1.39:05: పైలట్‌ ప్రమాద (మే డే) సందేశం⇒ 1.39:11: తుది డేటా నమోదు. ఏటీసీ స్పందించేలోపే జనసమ్మర్ధ ప్రాంతంలో నేలను తాకి మెడికల్‌ కాలేజీ హాస్టల్‌ భవనంపై పడి పేలిపోయిన విమానం

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement