Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today
Sakshi News home page

ప్రధాన వార్తలు

Kommineni Comments On Chandrababu Politics And Lies1
హవ్వ... బాబూ నవ్విపోతారు!

‘‘నేను, గాంధీజీ, అంబేద్కర్‌లు సామాన్య కుటుంబాల్లోనే పుట్టినా వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని ఎదిగాము’’. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో చేసిన వ్యాఖ్య ఇది. రాష్ట్రంలోనే కాదు.. దేశాద్యంతం ఈ వ్యాఖ్యలకు నివ్వెరపోయి ఉండవచ్చు. గాంధీజీ.. అంబేద్కర్లతో పోల్చుకోవడం ఎంతవరకూ సమజసం అన్న ప్రశ్న కూడా వస్తుంది. అయితే చంద్రబాబు తీరే అంత. ఏమైనా అనగలరు. చేయగలరు. పోల్చుకోగలరు కూడా. వాస్తవం ఏమిటంటే... గాంధీజీ, అంబేద్కర్‌లో సామాన్య కుటుంబాల్లో పుట్టిన మాట నిజం. అయితే వారెవరూ అవకాశాలను అందిపుచ్చుకోలేదు.సామాజిక పరిస్థితులను ఎదిరించి ప్రజలకు ఒక దారి చూపడం ద్వారా నేతలుగా ఎదిగారు! దేశ స్వాతంత్ర్య సాధనలో అందరికంటే ముందున్న గాంధీజీ జాతిపితగా ఎదిగితే... అంబేద్కర్‌ రాజ్యాంగ నిర్మాతగా ఈ దేశానికి ప్రజాస్వామ్యాన్ని పరిచయం చేశారు. ఇద్దరూ అసత్యాలు చెప్పడాన్ని నిరసించారు. తిరస్కరించారు. కుల మత రాజకీయాలకు అతీతంగా ప్రజలను చైతన్యపరిచారు.చంద్రబాబు విషయానికి వస్తే... ఈయన కూడా సామాన్య కుటుంబంలో జన్మించారు. సీఎం స్థానానికి ఎదిగారు. వాస్తవమే. కానీ ఈయన రాజకీయ ప్రస్థానాన్ని తరచి చూస్తే గాంధీజీ, అంబేద్కర్ల ఆలోచనలు, ఆదర్శాలకు ఎంతో దూరంగా.. విరుద్ధంగా ఎన్నో మరకలు కనిపిస్తాయి. కాంగ్రెస్(ఐ)తో రాజకీయ ఆరంగేట్రం చేసి గ్రూపులు కట్టి, పైరవీలతో మంత్రిపదవి సాధించిన చరిత్ర చంద్రబాబుది. తరువాతి కాలంలో పిల్లనిచ్చిన మామ తెలుగుదేశం పేరుతో పార్టీ పెడితే.. మామపైనా పోటీ చేస్తానని సవాలు విసిరారు. ఆ ఎన్నికల్లో ఓడిపోయిన వెంటనే బంధుత్వాన్ని అడ్డుపెట్టుకుని అదే తెలుగుదేశం పార్టీలోకి చేరిపోయారు. అక్కడ ఏకు మేకు అయినట్లు మామనే పదవి నుంచి లాగిపడేశారు. పదవుల కోసం ఆరాటపడకపోవడం గాంధీజీ, అంబేద్కర్ల నైజమైతే.. వాటి కోసం కుట్రలు, కుతంత్రాలకు పాల్పడ్డ చరిత్ర బాబు గారిది!చంద్రబాబు నిజంగానే వారిని ఆదర్శంగా తీసుకోదలిస్తే ముందుగా అసత్యాలు చెప్పడం మానుకోవాలి. రాజకీయ ప్రత్యర్థులపై ద్వేష భావాన్ని వదిలించుకోవాలి. కుమారుడు లోకేష్ అమలు చేస్తున్న రెడ్ బుక్ రాజ్యాంగాన్ని వ్యతిరేకించాలి. ఏపీలో యథేచ్ఛగా సాగుతున్న హింసను నిలువరించాలి. ఎన్నికలలో ఇష్టం వచ్చినట్లు వాగ్దానాలు చేయడం, ఆ తర్వాత వాటిని ఎగవేసి ప్రజలను మోసం చేస్తున్నారన్న విమర్శలకు ఫుల్‌స్టాప్‌ పెట్టాలి. అయితే... గాంధీజీ, అంబేద్కర్లలతో పోల్చుకోవడానికి ప్రయత్నించిన సభలోనే ఆయన ఎంత పరస్పర విరుద్ధమైన మాటలు మాట్లాడారో చూడండి.ఏపీలో జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా చేసిన అప్పుల గురించి స్వేచ్ఛగా అబద్ధాలు చెప్పేశారే. వెయ్యి రూపాయల అదనపు పెన్షన్ ఇవ్వడం కోసం మంచినీళ్లలా లక్షలు ఖర్చుపెట్టి హెలికాప్టర్లో పర్యటిస్తూ సభలు పెడుతున్నారే! కార్యకర్త కారు కింద పడితే కుక్క పిల్లలా పక్కన పడేశారని వైఎస్సార్‌ కాంగ్రెస్ అధినేత జగన్‌పై ఎంత దారుణమైన ఆరోపణ చేశారు! కారు ప్రమాదంలో మరణించిన సింగయ్య భార్యను పిలిచి అంబులెన్స్‌లో ఏదో జరిగిందని చెప్పించారని సీఎం స్థాయి వ్యక్తి ఆరోపించడమా! చంద్రబాబు ఈ ఘటనకు ఇచ్చిన ప్రాధాన్యం.. ఈనాడు దినపత్రిక దాన్ని బ్యానర్‌గా వండి వార్చడం చూస్తే వారు సింగయ్య మృతి విషయంలో ఆత్మరక్షణలో పడ్డారని తెలిసిపోతోంది. ఏపీ హైకోర్టులో తగిలిన ఎదురు దెబ్బను కవర్ చేసుకోవడానికి ఇలాంటి వ్యూహాలను అమలు చేసినట్లు అర్థమవుతోంది. ఈ కుట్రల అమలుకు ఎల్లో మీడియాను ఒక టూల్‌గా వాడుతున్నారన్నమాట.నిజానికి ఈ కేసులో ఎన్నో సందేహాలున్నాయి. జగన్‌ సత్తెనపల్లి సమీపంలోని రెంటపాళ్ల గ్రామానికి వెళ్తునప్పుడు వచ్చిన జన సందోహాన్ని నియంత్రించేందుకు పోలీసులు ఎందుకు తగిన చర్యలు తీసుకోలేదు? మాజీ ముఖ్యమంత్రి హోదా ఉన్న జగన్‌కు ఎందుకు తగిన భద్రత కల్పించలేదు? వాహనాల వెంట ఉండవలసిన రోప్ పార్టీ ఎందుకు లేదో తెలియదు. కారు తగిలి సింగయ్య అనే వ్యక్తి గాయపడినప్పుడు వచ్చిన వీడియోలు గమనించిన వారెవరికైనా ఆయనకేమీ ప్రమాదం లేదన్నట్టుగానే అనిపించింది. కాని అంబులెన్స్‌లోనే ఆయన మరణించడం సహజంగానే అనుమానాలకు తావిస్తుంది.ఇవన్నీ ఒక ఎత్తైతే... ఏదో గుర్తు తెలియని వీడియో ఆధారంగా పోలీసులు జగన్‌తో పాటు కొందరు వైసీపీ నేతలను నిందితులుగా చేసేశారు. కారు ప్రమాదానికి డ్రైవర్ కాకుండా... అందులో ప్రయాణిస్తున్న వారిపై కేసులు పెట్టి కొత్త ట్రెండ్‌ సృష్టించారు. హైకోర్టు ఇదే ప్రశ్న లేవనెత్తడంతో సమాధానాలు చెప్పలేని ప్రభుత్వ న్యాయవాదులు వాయిదాలు కోరారన్న భావన కలిగింది. దాంతో జగన్ తదితరులపై నేరారోపణకు ప్రాధమిక ఆధారాలు లేవని హైకోర్టు అభిప్రాయపడింది.అదే టైమ్ లో ప్రమాదంలో మరణించిన సింగయ్య భార్య లూర్దు మేరి చేసిన ప్రకటన మరింత సంచలనమైంది.తన భర్త మృతిపై అనుమానాలు ఉన్నాయని, లోకేష్ మనుషులు వచ్చి కాగితాలపై సంతకాలు పెట్టాలని బెదిరించారని ఆమె చెబుతున్నారు. ఒక సాధారణ మహిళగా ఉన్న ఆమె అంత ధైర్యంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడానికి ముందుకు వచ్చిందంటే అందులో నిజం లేకపోతే అలా చేయగలుగుతుందా? అయినా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న సీనియర్ నేత దానిపై స్పందించడం ఏమిటి? అంబులెన్స్ లో ఏదో జరిగిందని చెప్పించారని అనడం ఏమిటి? అదే జగన్ పై ఆమె ఏదైనా ఆరోపణ చేసి ఉంటే సీఎం ఎంత తీవ్రంగా ప్రచారం చేసి ఉండేవారు. ఎల్లో మీడియా ఎంతగా ఇల్లెక్కి అరిచేది. పోలీసులు ఎలా రియాక్ట్ అయ్యేవారు! ఇప్పుడేమో ఆ ఆరోపణలపై విచారణ కాకుండా, ఆమె జగన్‌ను కలవడంపై విచారణ చేస్తారట. ఇదేనా ప్రభుత్వం నడిపే పద్దతి?గాంధీజీ, అంబేద్కర్లతో పోల్చుకునే వారు ఎంత నిజాయితీగా ఉండాలి? ఒక ప్రమాదాన్ని జగన్‌కు పులమడం ద్వారా కుటిల రాజకీయం చేయడం ఏ తరహా నీతి అవుతుంది. గతంలో గోదావరి పుష్కరాల్లో డాక్యుమెంటరీ తీసేందుకు ఒక్కసారిగా గేట్లు తెరచి తొక్కిసలాటలో 29 మంది ప్రాణాలు కోల్పోయినప్పుడు ఇదే చంద్రబాబు ఏమన్నారు? రోడ్డు ప్రమాదాలు జరగడం లేదా? పూరి జగన్నాథ ఉత్సవాలలో తొక్కిసలాటలు జరగడం లేదా? కొందరు మరణించడం లేదా అని ప్రశ్నించారు. కందుకూరు, గుంటూరులలో జరిగిన తొక్కిసలాటలలో పదకుండు మంది మరణిస్తే, అదంతా పోలీసుల వైఫల్యం అని ప్రచారం చేయలేదా?జగన్ కాన్వాయ్‌లో ప్రమాదం జరిగితే మాత్రం ఆయనను నిందితుడుగా చేర్చుతారా? ఇది చిల్లర రాజకీయం కాదా? పైగా రాజకీయాలు, రౌడీలు, అంటూ నీతి సూత్రాలు వల్లిస్తే సరిపోతుందా? వైసీపీ నేతలు కొందరు రౌడీలు, గూండాలు, పేకాట క్లబ్లులు నడుపుతారు.. అంటూ గతంలో ఆరోపణలు చేసిన చంద్రబాబు ఎన్నికల సమయంలో వారిని టీడీపీలో చేర్చుకుని టిక్కెట్లు ఎలా ఇచ్చారన్న దానికి జవాబు దొరుకుతుందా?అదెందుకు అంగళ్లు వద్ద గతంలో టీడీపీ కార్యకర్తలను చంద్రబాబే ఎంతగా రెచ్చగొట్టారో వీడియోలు చెబుతాయి. పుంగనూరు వద్ద తన సమక్షంలోనే టీడీపీ కార్యకర్తలు పోలీస్ వ్యాన్‌ను దగ్దం చేయడం, రాళ్ల దాడిలో పోలీస్ కానిస్టేబుల్ ఒకరి కన్ను పోవడం ఇటీవలి చరిత్రే కదా? ప్రతిపక్షంలో ఉంటే ఏ అరాచకం చేసినా సమర్థించుకోవడం, అధికారంలోకి రాగానే శాంతి వచనాలు పలకడమే చంద్రబాబు ఇజమా! అని అంటే ఏమి చెబుతాం. ఏ నాయకుడైనా పదవుల కోసం సంకుచిత రాజకీయాలకు దిగకుండా ఉంటేనే మంచి పేరు వస్తుంది కానీ... రాజకీయ అవసరాలకు గొప్పవాళ్ల పేర్లు చెప్పుకుని పోల్చుకుంటూ, స్వార్ధ ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరిస్తే ప్రజలు తెలుసుకోలేకపోతారా!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

Elon Musk formed a new Political Party in America2
అన్నంతపనీ చేసిన మస్క్‌.. పార్టీ ఫ్యూచర్‌ ప్లాన్‌ ఇదే..

వాషింగ్టన్‌ డీసీ: టెక్‌ దిగ్గజం ఎలన్ మస్క్ తన కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. అధ్యక్షుడు ట్రంప్ బిగ్ బ్యూటీఫుల్ చట్టం తీసుకువచ్చిన దరిమిలా, దాన్ని వ్యతిరేకిస్తూ మస్క్‌ కొత్త రాజకీయ పార్టీ పెట్టారు. తాను అనుకున్నది సాధించేవరకూ వదలని చెప్పే మస్క్‌ ఇప్పుడు అమెరికాలో కొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధమయ్యారు.ప్రముఖ టెస్లా, స్పేస్‌ఎక్స్ సీఈఓ ఎలన్ మస్క్, అమెరికాలో కొత్త రాజకీయ పార్టీని స్థాపనపై ప్రకటన చేశారు. ఈ పార్టీకి ‘అమెరికా పార్టీ’ అని పేరు పెట్టే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో విభేదాల నేపధ్యంలో ఆయన ఈ ప్రకటన చేయడం విశేషం. ఎలన్ మస్క్ తన ‘ఎక్స్‌’లో ఒక పోల్ నిర్వహించి, తన 22 కోట్ల మంది ఫాలోవర్స్‌ను ఓ ప్రశ్న అడిగారు ‘అమెరికాలో కొత్త రాజకీయ పార్టీని నెలకొల్పాల్సిన సమయం వచ్చిందా?" అని అడిగినప్పుడు 80 శాతం మంది అవును అని సమాధానమిచ్చారు. By a factor of 2 to 1, you want a new political party and you shall have it!When it comes to bankrupting our country with waste & graft, we live in a one-party system, not a democracy.Today, the America Party is formed to give you back your freedom. https://t.co/9K8AD04QQN— Elon Musk (@elonmusk) July 5, 2025ఈ ఫలితాలను వెల్లడిస్తూ మస్క్ ఓ ప్రకటనలో ‘అమెరికాలో 80 శాతం మందికి ప్రాతినిధ్యం వహించే కొత్త రాజకీయ పార్టీ అవసరమని తెలిపారు. ఇది ప్రధాన పార్టీలైన డెమోక్రటిక్, రిపబ్లికన్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఉంటుందని మస్క్ అభివర్ణించారు. కొత్త పార్టీ సాయంతో 2026 మధ్యంతర ఎన్నికల్లో హౌస్, సెనేట్ సీట్లపై మస్క్ దృష్టి సారించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. తదుపరి అధ్యక్ష ఎన్నికల్లో మస్క్‌ అధ్యక్ష అభ్యర్థిగా పోటీ చేయనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అమెరికాలో డెమోక్రటిక్, రిపబ్లికన్ పార్టీలు దశాబ్దాలుగా రాజకీయ రంగంలో ఆధిపత్యం చలాయిస్తున్నాయి. ఇప్పుడు మస్క్ ‘అమెరికా పార్టీ’ వీటికి సవాలుగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Andhra Pradesh High Court sensational orders to magistrates3
ఆర్డర్‌.. ఆర్డర్‌ 'రిమాండ్లకీ రూల్సున్నాయ్‌'!

సాక్షి, అమరావతి: ఏడేళ్ల కన్నా తక్కువ శిక్ష పడే కేసుల్లో నిందితులకు ఆయా కోర్టుల మేజిస్ట్రేట్‌లు యాంత్రికంగా రిమాండ్‌ విధిస్తున్న సంఘటనలు పెరిగిపోతున్న నేపథ్యంలో హైకోర్టు స్పందించింది. యాంత్రిక రిమాండ్‌ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ ప్రతి రోజూ పిటిషన్లు దాఖలవుతుండడంతో మేజిస్ట్రేస్టేట్‌లకు పరిపాలనాపరంగా మార్గదర్శకాలను నిర్దేశించింది. ఈ మేరకు స్పష్టమైన మార్గదర్శకాలతో ప్రత్యేక సర్క్యులర్‌ జారీ చేసింది. ఏడేళ్ల కన్నా తక్కువ శిక్షపడే నేరాల్లో ఎలాపడితే అలా రిమాండ్‌ ఇవ్వడానికి వీల్లేదని.. అర్నేష్‌కుమార్‌ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన నిర్దేశాలను తు.చ. తప్పక అనుసరించాలని తేల్చిచెప్పింది. అలాగే, ఇమ్రాన్‌ప్రతాప్‌ గాది వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ గుజరాత్‌ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సైతం పాటించి తీరాల్సిందేనని స్పష్టం చేసింది. ⇒ రిమాండ్‌ విధించేటప్పుడు మార్గదర్శకాలు పాటించాలని.. పోలీసులు చట్టప్రకారం నడుచుకున్నారా? లేదా..? చూడాలని, చాలా కేసుల్లో సుప్రీం నిర్దేశించిన సూత్రాలను పాటించకుండా రిమాండ్‌ విధిస్తుండడంతో అనవసరమైన అరెస్టులు, శిక్షా నిబంధనల దుర్వినియోగానికి దారితీస్తోందని పేర్కొంది. ⇒ ప్రసంగాలు, రచనలు, కళల వ్యక్తీకరణలకు సంబంధించి (3–7 ఏళ్లు శిక్షపడే నేరాలు) పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసేముందు డీఎస్పీ ఆమోదంతో.. బీఎన్‌ఎస్‌ఎస్‌ సెక్షన్‌ 173(3) కింద ప్రాథమిక విచారణ జరపాలని, 14 రోజుల్లో దానిని ముగించాలని ఇమ్రాన్‌ప్రతాప్‌ గాది కేసులో సుప్రీంకోర్టు పేర్కొన్నదని... దీనిప్రకారం రాష్ట్రంలోని మేజిస్ట్రేస్టేట్‌లందరూ రిమాండ్‌ విధించే ముందు ముఖ్యంగా సోషల్‌ మీడియా పోస్టులు, వ్యాఖ్యలకు సంబంధించిన కేసుల్లో దర్యా­ప్తు అధికారి... అర్నేష్‌కుమార్, ఇమ్రాన్‌ప్రతాప్‌ గాది కేసుల్లో సుప్రీం ఇచ్చిన ఆదేశాలను పాటించారా? లేదా? అన్నది చూడాలని హైకోర్టు తేల్చిచెప్పింది. ⇒ నిందితులు పదేపదే నేరాలు చేస్తున్నారా? రిమాండ్‌ ఇవ్వకుంటే సాక్షులను ప్రభావితం చేసి, సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని.. అందుకని పోలీసు కస్టోడియల్‌ విచారణ అవసరమని మేజిస్ట్రేస్టేట్లు సంతృప్తి చెందాల్సి ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ ఆదేశాలను మేజిస్ట్రేస్టేట్‌లందరూ పాటించి తీరాల్సిందేనని ఆదేశించింది. ఉల్లంఘిస్తే తీవ్ర పర్యవసానాలతో పాటు శాఖాపరమైన విచారణతో పాటు కోర్టు ధిక్కార చర్యలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందని మేజిస్ట్రేస్టేట్‌లకు హెచ్చరించింది. ఈ మేరకు హైకోర్టు శనివారం సర్క్యులర్‌ జారీ చేసింది.చంద్రబాబు సర్కారుకు ఝలక్‌..! పోలీసు రాజ్యానికి చెక్‌!ఏడాది కాలంగా తీవ్ర నిర్బంధంతో... తాలిబాన్ల మాదిరిగా పాలన సాగిస్తున్న చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వానికి హైకోర్టు తాజా మార్గదర్శకాలు చెంపపెట్టులాంటివే. రెడ్‌బుక్‌ రాజ్యాంగంతో.. ఎలాంటి నిబంధనలు పాటించకుండా, లెక్కలేనితనంతో చెలరేగుతున్న పోలీ­సుల తీరుకు అడ్డుకట్ట పడనుంది. కక్షసాధింపు చర్యలకు దిగుతూ ఎడాపెడా అరెస్టులకు పాల్పడు­తున్న ఖాకీలకు చెంపపెట్టు అని పరిశీలకులు పేర్కొంటున్నారు. హైకోర్టు తాజా మార్గదర్శకా­లతో ఇకపై అడ్డగోలు అరెస్టులు, నిబంధనలకు విరుద్ధంగా రిమాండ్‌లు కుదరదని వివరిస్తున్నారు.⇒ కూటమి సర్కారు వచ్చాక తమ పనితీరును, వారి నేతలను విమర్శిస్తూ సోషల్‌ మీడియా పోస్టులు, వ్యాఖ్యలు పెట్టినవారిపై.. మరీ ప్రధానంగా ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలు, నాయకులపై అడ్డగోలుగా కేసు నమోదు చేస్తోంది. వ్యంగ్య ప్రదర్శన ఇచ్చినా సహించలేక కేసులు పెట్టింది. సోషల్‌మీడియా పోస్టులను అత్యంత కఠినమైన వ్యవస్థీకృత నేరం పరిధిలోకి తీసుకొచ్చింది. పెద్దసంఖ్యలో అరెస్ట్‌లు చేసి జైలుకు కూడా పంపింది. బెయిల్‌ రాకుండా చేసేందుకు ప్రభుత్వం ఏకంగా సుప్రీంకోర్టు వరకు వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. అయితే, హైకోర్టు పలు సందర్భాల్లో సోషల్‌ మీడియా పోస్టులకు వ్యవస్థీకృత నేరం కింద ఎలా కేసు పెడతారంటూ నిలదీసింది. అవి ఆ నేరం కిందకు రావని సైతం తెలిపింది. అయినా కూడా పోలీసులు వ్యవస్థీకృత నేరం కింద కేసులు నమోదు చేస్తూనే ఉన్నారు. ⇒ ఇక సోషల్‌ మీడియా యాక్టివిస్టులను పోలీసులు అరెస్ట్‌ చేసి మేజిస్ట్రేట్‌ల ఎదుట ప్రవేశపెట్టగా చాలామంది యాంత్రికంగా రిమాండ్‌ ఉత్తర్వులు ఇచ్చారు. ఏడేళ్ల కన్నా తక్కువ శిక్ష పడే కేసుల్లో కూడా సహేతుక కారణాలను వెల్లడించకుండానే రిమాండ్‌ ఇవ్వడం మొదలుపెట్టారు. దీంతో పలువురు నిందితులు తమ రిమాండ్‌ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ హైకోర్టులో పిటిషన్లు వేశారు. మొన్నటిదాక కూడా రిమాండ్‌ ఉత్తర్వులపై ప్రతి రోజూ పిటిషన్లు దాఖలవుతూనే వచ్చాయి.హైకోర్టు ఎన్ని వ్యాఖ్యలు చేసినా పట్టించుకోని మేజిస్ట్రేట్‌లుఈ వ్యాజ్యాల విచారణ సందర్భంగా హైకోర్టులోని పలువురు న్యాయమూర్తులు.. మేజిస్ట్రేట్‌ల తీరుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. యాంత్రికంగా రిమాండ్‌ విధించడం సరికాదని హితవు పలికారు. కొన్ని సందర్భాల్లో ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. అర్నేష్‌కుమార్‌ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను పాటించి తీరాలని చెప్పినా ప్రయోజనం లేకపోయింది. అయినా, యాంత్రికంగా, సహేతుక కారణాలను తెలియజేయకుండా రిమాండ్‌లు విధించడం కొనసాగిస్తూ వచ్చారు. దీంతో హైకోర్టు చివరకు మేజిస్ట్రేట్లకు పరిపాలనా పరమైన ఉత్తర్వులు ఇవ్వక తప్పలేదు. ఈ క్రమంలో అర్నేష్‌కుమార్, ఇమ్రాన్‌ ప్రతాప్‌ గాది కేసుల్లో సుప్రీం ఇచ్చిన ఆదేశాలను అమలు చేసి తీరాల్సిందేనని, లేదంటే పర్యవసనాలు తీవ్రంగా ఉంటాయని మేజిస్ట్రేట్లకు తేల్చి చెప్పింది.ఇదీ అర్నేష్‌కుమార్‌ కేసు...బిహార్‌ కు చెందిన అర్నేష్‌ కుమార్‌ కట్నం కోసం వేధిస్తున్నట్లు అతడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఐపీసీ సెక్షన్‌ 498ఎ, వరకట్న నిషేధ చట్టంలోని సెక్షన్‌ 4 కింద కేసులు నమోదు చేశారు. అర్నేష్‌ ముందస్తు బెయిల్‌ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఈ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం అరెస్టుల విషయంలో కీలక మార్గదర్శకాలు జారీ చేసి వాటిని పాటించాల్సిందేనని కింది కోర్టులు, పోలీసులను ఆదేశించింది. 2014లో సుప్రీంకోర్టు ఇచ్చిన ముఖ్యమైన తీర్పు ఇది. అందులోని మార్గదర్శకాలు..1. సాధారణంగా ఏడేళ్ల కంటే తక్కువ శిక్ష విధించే నేరాల్లో నిందితులను అరెస్ట్‌ చేయకూడదు. ఒకవేళ అరెస్టు చేయాల­నుకుంటే.. ముందుగా నిందితుడికి వారిపై వచ్చిన ఆరోపణలకు సంబంధించిన సమాచారం ఇవ్వాలి. అలాగే వారి హక్కుల గురించి వివరించాలి.2. అరెస్టు చేయడానికి కారణాలను తప్పకుండా రికార్డు చేయాలి.3. పోలీసులు కేసు దర్యాప్తు చేసేటప్పుడు ఈ మార్గ­దర్శకాలను పాటించాలి.4. న్యాయమూర్తులు కూడా ఈ మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకొని, అవసరమైతే ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలి.

BCCI confirms India vs Bangladesh series postponement4
కోహ్లి, రోహిత్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్‌..

అంతా ఊహించిందే జ‌రిగింది. బంగ్లాదేశ్‌లో భారత జ‌ట్టు పర్యటన వాయిదా ప‌డింది. ఈ విష‌యాన్ని భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) శ‌నివారం ధ్రువీక‌రించింది. ఇరు బోర్డుల అంగీకారంతోనే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు బీసీసీఐ తెలిపింది. అంత‌ర్జాతీయ క్రికెట్ క‌మిట్‌మెంట్స్‌, రెండు జ‌ట్ల షెడ్యూల్‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నాము.ఈ సిరీస్‌ను వ‌చ్చే ఏడాది సెప్టెంబర్‌లో నిర్వ‌హించేందుకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఆతృతగా ఎదురుచూస్తోంది. ఈ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌, పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని భారత క్రికెట్ బోర్డు ఓ ప్రకటనలో పేర్కొంది.వాయిదా ఎందుకంటే?కాగా ఈ ఏడాది ఆరంభం నుంచే బంగ్లా-భార‌త్ వైట్‌బాల్ సిరీస్‌ల‌పై నీలినీడ‌లు క‌మ్ముకున్నాయి. బంగ్లా ప‌ర్య‌ట‌న‌కు భార‌త జ‌ట్టును పంపేందుకు బీసీసీఐ ప్ర‌భుత్వ అనుమతి కోసం ఎదురు చూసింది. కానీ భద్రతా కారణాల దృష్ట్యా ఈ పర్యటనను వాయిదా వేసుకోమని భారత ప్రభుత్వం బీసీసీఐని సూచించినట్లు తెలుస్తోంది.మాజీ ప్రధాని షేక్‌ హసీనా ప్రభుత్వం కూలాక అక్కడ చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలతో బంగ్లాదేశ్ అట్టుడికింది. ప్రస్తుతం తాత్కాళిక ప్రభుత్వ ఏర్పాటుతో పరిస్థితులు అదుపులో ఉన్నట్లు కనబడుతున్నప్పటికీ, నివురుగప్పిన నిప్పులా మళ్లీ ఉద్రిక్తతలు తలెత్తితే ఛాన్స్ ఉంది. అంతకుతోడు బంగ్లాదేశ్‌ మాజీ మంత్రులు, రాజకీయ నేతలపై అక్కడ తరచూ మూకదాడులు జరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.వచ్చే ఏడాదికల్లా ఎన్నికలు పూర్తయితే పరిస్థితిలో మార్పుంటుందని బోర్డు భావిస్తోంది. వీటిన్నంటిని పరిగణలోకి తీసుకునే ఈ పర్యటను బీసీసీఐ వాయిదా వేసింది. షెడ్యూల్ ప్రకారం.. భారత జట్టు ఆతిథ్య బంగ్లాతో వచ్చేనెల 17 నుంచి 31 వరకు చిట్టగాంగ్, ఢాకా వేదికలపై మూడేసి చొప్పున వన్డేలు, టి20లు ఆడాల్సి ఉంది. రోహిత్‌-కోహ్లి ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్‌..మరోవైపు తమ ఆరాధ్య క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలను మైదానంలో చూడాలన్న ఆశపడ్డ అభిమానులు మరి కొన్న నెలలు వేచి చూడాల్సిందే. టెస్టు, టీ20లకు ప్రకటించిన రోహిత్‌, కోహ్లి కేవలం వన్డేల్లో మాత్రమే ఆడనున్నారు. ఈ క్రమంలో బంగ్లాతో జరిగే వన్డే సిరీస్‌లో వీరిద్దరని చూడవచ్చని అంతా భావించారు. కానీ ఇప్పుడు టూర్ వాయిదా పడడంతో ఫ్యాన్స్‌కు నిరాశే ఎదురైంది. ఈ ఏడాది ఆక్టోబ‌ర్‌లో ఆస్ట్రేలియాతో జ‌రిగే వ‌న్డే సిరీస్‌లో రో-కో ద్వ‌యం ఆడ‌నున్నారు.చదవండి: సునామీ శతకంతో విరుచుకుపడ్డ వైభవ్‌ సూర్యవంశీ.. ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన భారత్‌

Poll Bodys Big Decision on Documents for Bihar Elector Roll5
Bihar: పోల్‌ బాడీ కీలక నిర్ణయం.. ప్రతిపక్షాలకు ఉపశమనం

పట్నా: ఈ ఏడాది చివరిలో బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇంతలో ‘పోల్‌ బాడీ’ కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికలకు కొద్ది నెలల​ సమయమే ఉన్న ప్రస్తుత తరుణంలో అధికార ప్రభుత్వం ఓటర్ల జాబితాను తీర్చిదిద్దడాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శించాయి. దీంతో ఎన్నికల సంఘానికి చెందిన పోల్‌ బాడీ ప్రతిపక్షాల విమర్శలకు తలొగ్గింది.రాష్ట్రంలో ఓటరు నమోదుకు తప్పనిసరిగా పేర్కొన్న పత్రాలను సమర్పించకపోయినా, స్థానిక దర్యాప్తు ఆధారంగా కూడా వారి ధృవీకరణపై నిర్ణయం తీసుకోవచ్చని ఎన్నికల కమిషన్ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రభుత్వం తాజాగా రూపొందిస్తున్న ఓటరు జాబితాలో కోట్లాది మంది ఓటర్ల పేర్లు జాబితా నుంచి తొలగించే అవకాశం ఉందని ప్రతిపక్షం గగ్గోలు పెట్టిన తరుణంలో ఎన్నికల సంఘం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. తప్పనిసరి పత్రాలను సమర్పించకుండానే బీహార్‌లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌లో భాగంగా ఓటర్లు ఓటర్ల జాబితాలో ధృవీకరణ పొందవచ్చని ఎన్నికల కమిషన్ తెలిపింది. పత్రాలు లేనిపక్షంలో స్థానిక స్థాయిలో దర్యాప్తు ఆధారంగా ఎలక్టోరల్ రిజిస్ట్రార్ అధికారి ధృవీకరణ చేయనున్నారు.బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్‌)ను ప్రతిపక్షాలు విమర్శించాయి. ఈ ప్రక్రియ బీజేపీ గెలిచేందుకు చేస్తున్న కుట్రగా అభివర్ణించాయి. అయితే దీనిపై స్పందించిన ఎన్నికల కమిషన్‌ ఓటర్లకు ఒక సూచన చేస్తూ.. అవసరమైన పత్రాలు, ఫోటో అందుబాటులో లేకపోతే, గణన ఫారమ్‌ను పూరించి బూత్ స్థాయి అధికారికి అందించాలని పేర్కొంది. వారు ఆ ప్రాంతంలో నివసిస్తున్నవారితో మాట్లాడి, అందుబాటులో ఉన్న ఆధారాలు, ఇతర పత్రాల ఆధారంగా నిర్ణయం తీసుకుంటారని తెలిపింది. ఎన్నికల సంఘం అందించిన డేటా ప్రకారం బీహార్‌లో ఇప్పటివరకు 1.21 కోట్ల మంది ఓటర్లు గణన ఫారాలను నింపి సమర్పించారు. జూలై 25 నాటికి ఈ ఫారమ్‌లను సమర్పించాల్సి ఉంది. ఈ ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుందని, అర్హత ఉన్న ప్రతి పౌరుడు ఓటర్ల జాబితాలో భాగం అవుతారని పోల్ బాడీ పేర్కొంది.ఇది కూడా చదవండి: అన్నంతపనీ చేసిన మస్క్‌.. పార్టీ ఫ్యూచర్‌ ప్లాన్‌ ఇదే..

AP Army Solider BN Prasad Request Video To Chandrababu Over Land6
సీఎం సార్‌.. దేశ రక్షణలో ఉన్నా.. నా కుటుంబాన్ని రక్షించండి!

సాక్షి, టాస్క్‌ఫోర్స్‌: దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తుంటే, తన భూమిని ఓ రాజకీ­య నాయకుడు కబ్జా చేస్తున్నాడని, ఇందుకు అడ్డు­గా ఉన్నాడని తన తండ్రిపై దాడి చేశారని పేర్కొంటూ సామాజిక మాధ్యమాల్లో ఓసైనికు­డు పోస్టు చేసిన ఒక సెల్ఫీ వీడియో కలకలం రేపుతోంది. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని తెలుగు తమ్ముళ్ల అడ్డగోలు వ్యవహారాలకు ఈ వీడియో అద్దంపడుతోంది.‘ముఖ్యమంత్రికి.. నా పేరు బీఎన్‌ ప్రసాద్‌. మాది చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం, శాంతిపురం మండలం, కదిరివోబనపల్లి గ్రామం. నేను పదేళ్లుగా దేశానికి సైని­క సేవలు అందిస్తున్నాను. మీరు మా గ్రామంలో కొత్తగా నిర్మించిన ఇంటికి ఎదురుగా మాకు ఒక ఎకరం ఇరవై సెంట్ల భూమి ఉంది. ఇందులోనే 15 సెంట్ల భూమిని రాజకీయ నాయ­కుడైన సుందరప్ప ఆక్రమించుకుని రీసర్వేలో నమోదు చేసు­కుని అతని భార్యకు రిజిస్ట్రేషన్‌ చేశాడు’ అ­ని వా­పోయాడు. తన సమస్యపై దృష్టి సారించిన అధికారులు సర్వే చేసి తనకు రావాల్సిన 15 సెంట్లకు ఫెన్సింగ్‌ వేసినట్లు తెలిపారు. అయితే శనివారం ఉదయం తన తండ్రి బి.నారాయణప్ప పొలంలో పనిచేసేందుకు వెళ్లగా సుందరప్ప, ఆయన కుటుంబ సభ్యులు దాడిచేసినట్లు పేర్కొన్నాడు. సుందరప్పకు ‘దేశం’ అండా‘దందా’.. సుందరప్ప టీడీపీలో కీలక నాయకుడు. భార్య నా­రాయణమ్మ స్థానిక ఎన్నికల్లో సర్పంచ్‌ అభ్యర్థిగా పోటీచేశారు. కుమారుడు బీరేష్‌ పంచాయతీ పార్టీ అధ్యక్షుడు. చంద్రబాబు ఇంటి నిర్మాణ పనుల్లోనూ వీరు చురుగ్గా పాల్గొన్నారు. దీంతో పైస్థాయి పార్టీ నేతలతో పరిచయాలు పెరిగా­యి. ఈ నేపథ్యంలో పరిష్కారమైన భూ వివాదాన్ని మళ్లీ తిరగదోడుతూ సుందరప్ప దాడులకు పా­ల్ప­డుతున్నాడని సమాచారం. సుందరప్ప కు­టుంబంతో తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని 2024 ఆగస్టులో ఇదే సైనికుడు ప్రసాద్‌ ప్రభుత్వానికి మొరపెట్టుకున్నాడు. దీనిపై కుప్పం పోలీసులు అప్పట్లో విచా­రణ జరిపి ఆ కుటుంబం జోలికి వెళ్లవద్దని హెచ్చరించారు. కానీ ఇప్పు­డు ఈ భూమికి ఎదురుగా సీఎం గృహప్రవేశం జరగటం, పలమనేరు–కృష్ణగిరి రోడ్డు నాలుగు లైన్ల రోడ్డుగా అభివృద్ధి చేయనుండటంతో రియ­ల్టీ బూమ్‌ ఏర్పడింది. దీంతో మళ్లీ సుందరప్ప తన భూకబ్జా కుట్రలకు పదునుపెట్టాడు.

Sakshi Editorial On Chandrababu Govt Neglected Mango Farmers7
చెట్టునే నరకనా... మెడ కోసుకోనా?

ఆంధ్రప్రదేశ్‌లోని తోతాపురి మామిడి రైతుల హాహాకారాలు ఆ రాష్ట్ర సరిహద్దుల్ని దాటి ప్రతిధ్వనిస్తున్నాయి. కిలోకు పన్నెండు రూపాయలు కనీస ధరగా నిర్ణయించిన ప్రభుత్వం కార్యాచరణపై మాత్రం ముసుగేసింది. ఫలితంగా రెండు రూపాయలకు కూడా కొనే నాథుడు లేక రైతులు మామిడి కాయల్ని రోడ్లపై పారబోస్తున్న దృశ్యాలు దర్శనమిచ్చాయి. పారబోయడానికి మనసొప్పని రైతులు రవాణా ఖర్చులు వచ్చినా చాలని హైదరాబాద్‌ వంటి దూర ప్రాంత మార్కెట్లకు తరలించిన ఉదంతాలు కోకొల్లలు. తీవ్రమైన నష్టాల్లో కూరుకుపోతున్న ఈ పరిస్థితుల్లో పసిబిడ్డల్లా పెంచుకున్న చెట్లను నరికేయాలో, చేతిలో వున్న కొడవలితో మెడనే నరుక్కోవాలో అర్థం కావడం లేదంటూ ఒక రైతు వాట్సప్‌లో పెట్టిన మెసేజ్‌ కంటతడి పెట్టించింది.ఇదొక్క మామిడి రైతుల ఆక్రందనే కాదు. ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌ రైతులందరి ఉమ్మడి ఆవేదన ఇదే. జగన్‌ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు క్వింటాల్‌కు 24 వేలు పలికిన ధర ఇప్పుడు గరిష్ఠంగా ఏడు వేలు దాటకపోవడంతో మిర్చి రైతు కుదేలయ్యాడు. పత్తి ధర పదివేల నుంచి ఐదు వేలకు అంటే సగానికి సగం పడిపోయింది. అప్పుడు 18 వేల దాకా దక్కించుకున్న పొగాకు ఇప్పుడు గరిష్ఠంగా 6 వేలకు పడిపోయింది. పసుపు, కందులు, మినుములు, వేరుశనగ, మొక్కజొన్న, పెసలు, ఉల్లిపాయలు, టమాటా, మామిడిపళ్ళు, అరటి, బొప్పాయి, డ్రాగన్‌ ఫ్రూట్‌ వగైరా వ్యవసాయ ఉత్పత్తుల ధరలన్నీ సగానికి పడిపోయాయి. ఆనాటి జగన్‌ ప్రభుత్వం ప్రత్యేకంగా ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి ధరలు పతనమవకుండా మార్కెట్‌లో జోక్యం చేసుకునే విధానాన్ని అవలంబించడం సత్ఫలితాలనిచ్చి మంచి ధరలు లభించాయి. రైతన్నకు దరహాసాన్నిచ్చాయి.చంద్రబాబు ప్రభుత్వం ఆ బాధ్యతను వదిలేసింది. మొత్తంగా వ్యవసాయ రంగానికి సంబంధించినంత వరకు ఈ ప్రభుత్వం కాడి పారేసింది. జగన్‌మోహన్‌రెడ్డి ఇస్తున్న రైతు భరోసా కంటే అధికంగా ఇస్తానని హామీ ఇచ్చి వరసగా రెండో యేడు కూడా ఎగనామం పెట్టింది. వ్యవసాయ రంగం ఈ ప్రభుత్వ ప్రాధాన్యత క్రమంలో లేదు. తొలిసారి అధికారంలోకి వచ్చినప్పుడే కేంద్రం కట్టాల్సిన పోలవరాన్ని అడిగి తెచ్చుకొని తన కమీషన్ల ప్రాధాన్యాన్ని ఆ ప్రభుత్వం చాటి చెప్పుకున్నది. రెండోసారి అదే ప్రాధాన్యతను అమరావతి రూపంలో నిలబెట్టుకొన్నది. క్వాంటమ్‌ వ్యాలీ, డీప్‌ టెక్నాలజీ, ఏఐ వగైరాలన్నీ అమరావతి హైప్‌ కోసం కైపెక్కించడం తప్ప ఆచరణాత్మకమైన మాటలు కావనే అభిప్రాయం బలంగా వినిపిస్తున్నది. క్వాంటమ్‌ వ్యాలీకి అవసరమయ్యే ఎకో సిస్టమ్‌ అమరావతికి అందుబాటులోకి రావడమనేది ఒక సుదూర స్వప్నమే తప్ప ప్రభుత్వం చెబుతున్నట్టు ఐదేళ్లలో ఐదు లక్షల ఉద్యోగాలు కల్పించే స్థితి అసంభవమని నిపుణులు చెబుతున్నారు. మధ్యతరగతిని మభ్యపెట్టడానికి యువతకు జోల పాడటానికి ఇటువంటి పదజాలాన్ని వెదజల్లడం బాబు కాకస్‌కు వెన్నతో పెట్టిన విద్య. ఈ జోలపాటల మాటున అమరావతిలో జరుగుతున్న అసలు కార్యక్రమమేమిటో చాలామందికి అర్థమైంది. అమరావతి పేరుతో ఇప్పటికే తెచ్చిన అప్పులే కాదు, ఇంకా అవసరమైన అప్పులు తీర్చడానికి భూములు అమ్ముతామనీ, అదో సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కేపిటలనీ చెబుతూ వచ్చారు. తొలుత సమీకరించిన భూముల్లో రైతుల వాటా తీసేయగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అవసరాలకు పోనూ మిగిలిన భూముల అమ్మకంతో తెచ్చిన అప్పులు తీర్చడం సాధ్యం కాదనే మాట వినిపిస్తున్నది. ఈ తత్వం బోధపడినందువల్లనే ప్రపంచ బ్యాంకు వాళ్లు ఈ మధ్య ప్రభుత్వానికి తాఖీదులు పంపారట! మీరు అమ్మబోయే భూములెన్ని? ఎప్పటిలోగా అమ్ముతారు? వాటి ద్వారా ఎంత డబ్బు సమీకరిస్తారో చెప్పండని వారు అడుగుతున్నారని సమాచారం.ఇప్పుడు కొత్తగా 45 వేల ఎకరాల భూసేకరణ ప్రయత్నాలకు రైతులు ముందుకు రాకపోవడంతో ప్రభుత్వంలో కలవరం మొదలైనట్టు కనిపిస్తున్నది. కాకస్‌ పరంగా ఎంత సంపాదించుకున్నా ప్రభుత్వపరంగా మాత్రం అమరావతి ప్రాజెక్టు ఒక నిరర్థక ఆస్తిగానే మిగిలిపోయే ప్రమాదముందనే హెచ్చరికలు వినబడుతున్నాయి. పోలవరం – బనకచర్ల ప్రాజెక్టు పేరుతో ఈ మధ్యకాలంలో బాబు ప్రభుత్వం చేస్తున్న హడావుడి కూడా కమీషన్ల స్టార్టప్‌ కథేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 80 వేల కోట్లతో చేపట్టే ఈ ప్రాజెక్టు రాష్ట్రంలో గేమ్‌ ఛేంజర్‌ కాబోతున్నదని ఆయన చెబుతున్నారు. ఈ ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపై రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన నివేదికలో పేర్కొన్న సమాచారం ప్రకారం, ఇది పూర్తయితే ఏడు లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకూ, ఇంకో 23 లక్షల ఎకరాల స్థిరీకరణకూ ఉపయోగపడుతుంది. జలయజ్ఞంలో భాగంగా ప్రారంభించి చాలావరకు పూర్తయి పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ఇంకో 14 వేల కోట్లు సరిపోతుందనీ, ఈ పని చేస్తే కూడా అంత ఆయకట్టు అందుబాటులోకి వస్తుందనీ చెబుతున్నారు.అటువంటప్పుడు ఏది తొలి ప్రాధాన్యత కావాలి? 14 వేల కోట్లతో పెండింగ్‌ పనులు పూర్తి చేయడమా? 80 వేల కోట్లతో కొత్త ప్రాజెక్టును తలకెత్తుకోవడమా? గోదావరి వరద జలాలను ఉపయోగించుకోవాలన్న ఆలోచన ఆ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా అవసరమే కావచ్చు. ఈ ఆలోచన కూడా వాస్తవానికి గత ప్రభుత్వంలో వచ్చినదే. కానీ సత్వరం పూర్తి కావలసిన ప్రాజెక్టులకు పైసా విదల్చకుండా చేపట్టిన ఈ నిర్హేతుకమైన ప్రాధాన్యతాక్రమం దేన్ని సూచిస్తుంది? భారీ ప్రాజెక్టుతో భారీ కమీషన్ల దురాశతోనే ఈ రకమైన ఎంపిక చేసుకున్నారంటే తప్పవుతుందా? రాష్ట్రంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర ఇప్పించలేకపోయిన ప్రభుత్వం, ఉన్న ఊరిలోనే కల్తీలేని విత్తనాలు, ఎరువులు అందుబాటులోకి తెస్తున్న ఆర్‌బీకేలను మూసి పారేసిన ప్రభుత్వం రైతన్నల కన్నీరు తుడవడానికి భారీ ప్రాజెక్టులను సంకల్పించిందంటే నమ్మశక్యమేనా?ఆలూ లేదు, చూలూ లేదు అన్నట్టుగా బాబు ఈ ప్రాజెక్టును పూర్తిచేసే అవకాశమే లేనప్పటికీ దీనిపై తెలంగాణలోని అధికార ప్రతిపక్షాలు సిగపట్లకు దిగడం ఒక విశేషం. చంద్రబాబుతో సాన్నిహిత్యం కారణంగానే ఆయన ప్రతిపాదనకు రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం చెప్పలేదని బీఆర్‌ఎస్‌ ఆరోపించింది. దీనిపై గత కొన్ని వారాలుగా తీవ్రస్థాయిలో వాదోపవాదాలు జరుగుతున్నాయి. ఈ పంచాయితీలో బీఆర్‌ఎస్‌ వాదానిదే పైచేయిగా ఉన్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దానికి ఇతరత్రా కారణాలు కూడా కొన్ని దోహదపడి ఉండవచ్చు. ప్రెస్‌మీట్లలో కాదు, అసెంబ్లీలో చర్చిద్దాం రండని తాజాగా కాంగ్రెస్‌ మంత్రులు సవాల్‌ విసురుతున్నారు. పదిహేనేళ్లు ముఖ్యమంత్రిగా ఉండి ఏ ప్రాజెక్టునూ పూర్తిచేసిన రికార్డు లేని చంద్రబాబు చిటికెల పందిరిని ఆంధ్ర ప్రజలెవరూ పట్టించుకోకపోయినా తెలంగాణలో అది మంట పుట్టించడం విశేషం.ఒకపక్క అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాల రూపంలో భారతీయ రైతును బలిపీఠమెక్కించే సూచనలు పొడసూపుతున్నాయి. వాణిజ్య ఒప్పందం కోసం అమెరికా విధించిన మూడు మాసాల గడువు ఈ నెల తొమ్మిదో తేదీతో ముగిసిపోనున్నది. ఈలోగా భారత్‌తో కనీసం మినీ ఒప్పందమైనా జరగాలని ట్రంప్‌ పట్టుపడుతున్నారు. రెండు దేశాల ప్రతినిధుల మధ్య గత వారం రోజులుగా చర్చోపచర్చలు జరుగున్నాయి. జన్యుమార్పిడి సోయాచిక్కుడు, మొక్కజొన్నలను, యాపిల్స్‌ను, డెయిరీ ఉత్పత్తులను తక్కువ సుంకాలతో భారత మార్కెట్‌లోకి అనుమతించాలని అమెరికా డిమాండ్‌ చేస్తున్నది. వందల ఎకరాల భారీ కమతాల్లో పూర్తిగా యంత్రాల సాయంతో, దాదాపు యాభై శాతం సబ్సిడీ ఇస్తున్న ప్రభుత్వం దన్నుతో చౌకగా వచ్చే అమెరికా వ్యవసాయ ఉత్పత్తులు తక్కువ సుంకాలతోనే మళ్లీ మార్కెట్‌లోకి ప్రవేశిస్తే భారతీయ రైతు తట్టుకోగలడా? పైగా భారతీయ వ్యవసాయ రంగంలోకి, ఫుడ్‌ చెయిన్‌లోకి జన్యుమార్పిడి ఉత్పత్తులను అనుమతించకపోవడం భారత్‌ విధానంగా ఉంటూ వస్తున్నది. ఫుడ్‌ చెయిన్‌ పరిధిలోకి రాదనే కారణంతో పత్తిలోకి ఇప్పటికే జన్యుమార్పిడి విత్తనాలు ప్రవేశించాయి. రేపోమాపో కుదరనున్న మినీ వాణిజ్యం ఒప్పందంతో ఏం జరగనున్నదని దేశం ఆసక్తిగా ఎదురుచూస్తున్నది. అమెరికా విధించే గడువుకంటే తమకు దేశ ప్రయోజనాలే ముఖ్యమని ‘టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా’ ఇంటర్వ్యూలో వాణిజ్య–పరిశ్రమల మంత్రి పీయూష్‌ గోయల్‌ ఘంటాపథంగా చెప్పారు. శనివారం నాటి పత్రికలో వచ్చిన ఈ ఇంటర్వ్యూలో ‘మన వ్యవసాయ రంగానికి నష్టం కలిగించే ఎటువంటి ఒప్పందాన్ని చేసుకోబోమ’ని ఆయన చెప్పారు. మొక్కజొన్న ఉత్పత్తిలో టాప్‌ ఫైవ్‌లో ఉన్న బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల ముంగిట్లో ట్రంప్‌ ప్రతిపాదనలు అంగీకరించడం బీజేపీకి కూడా ఆత్మహత్యా సదృశమే.వాణిజ్య చర్చల్లో పాల్గొంటున్న అధికారుల భోగట్టాగా పేర్కొంటూ బ్లూమ్‌బర్గ్‌ లాంటి వార్తా సంస్థలు మరో కథనాన్ని చెబుతున్నాయి. కేవలం పశువుల దాణా కోసం, పౌల్ట్రీ దాణా కోసం ఉపయోగపడే విధంగా మొక్కజొన్న, సోయా చిక్కుళ్ల ఉప ఉత్పత్తులను అనుమతించే మినీ ఒప్పందం కుదిరే అవకాశముందని ఈ కథనాల సారాంశం. మినీ రవ్వ రూపంలో వచ్చినంత మాత్రాన అది జన్యుమార్పిడి పంట కాకుండా పోతుందా? పశువుల దాణా, కోళ్ల దాణాలోకి ప్రవేశిస్తే అది ఫుడ్‌ చెయిన్‌లో భాగం కాకుండా పోతుందా అనేవి చర్చనీయాంశాలు. రెండుమూడు రోజుల్లో జరిగే మినీ ఒప్పందం అనంతరం, మూడు నాలుగు నెలల్లో జరిగే పూర్తి స్థాయి ఒప్పందం అనంతరం మాత్రమే ఈ అంశంపై ఒక స్పష్టత వస్తుంది. ప్రస్తుతానికి దాణా రూపంలో ప్రవేశించినా, ఒంటె గుడారంలోకి కాళ్లు జాపితే ఏం జరుగుతుందో భవిష్యత్తులో అదే జరుగుతుంది. చంద్రబాబు వంటి వ్యవసాయ వ్యతిరేక విధానాలు అనుసరించే పాలకుల కారణంగా పాతికేళ్ల కిందటే మన రైతులు ఉరితాళ్లు పేనుకున్నారు. ఇప్పుడు కొడవళ్లు మెడపైకి చేర్చుకుంటున్నారు. భవిష్యత్తులో అమెరికా జన్యుమార్పిడి పంట ఉత్పత్తులు భారత మార్కెట్‌లోకి ప్రవేశిస్తే వ్యవసాయం దండగన్న బాబు జోస్యం నిజమవుతుంది. ఈ విషయంలో నిజంగానే ఆయన విజనరీగా నిలబడిపోతారు.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com

Meenakshi Dinesh Request Movie Chance With Surya8
సూర్యతో ఒక్క ఛాన్స్‌ అంటున్న ట్రెండింగ్‌ బ్యూటీ

ఏ రంగంలోనైనా కలలు కనడంతో పాటూ వాటిని సాకారం చేసుకోవడానికి నిరంతరం శ్రమించాల్సి ఉంటుంది. అప్పుడే లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు. అలా తన కల ఎప్పటికైనా నెరవేరుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు నటి మీనాక్షీ దినేష్‌. మలయాళంలో 18 ప్లస్, రెట్టా వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించిన తన కంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాందించుకున్న ఈ కేరళా బ్యూటీ లవ్‌ మ్యారేజ్‌ చిత్రం ద్వారా కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చారు. అంతే కాదు తొలి చిత్రంతోనే మంచి విజయాన్ని అందుకున్నారు. నటుడు విక్రమ్‌ ప్రభు కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం ఇటీవలే తెరపైకి వచ్చి సక్సెస్‌పుల్‌గా ప్రదర్శింపబడుతోంది. ఈ చిత్రంలో మీనాక్షీ ధినేష్‌ నటన పలువురిని ఆకట్టుకుంది. సినీ విమర్శకుల ప్రశంసలను అందుకుంటున్నారు. ఈ సందర్భంగా మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో నటి మీనాక్షీ దినేష్‌ తన భావాలను పంచుకున్నారు. తెలుగులో కూడా శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై గోపీచంద్‌ చేస్తున్న సినిమాలో హీరోయిన్‌గా ఆమె ఛాన్స్‌ దక్కించుకుంది.లవ్‌ మ్యారేజ్‌ చిత్రంతో తమిళ ప్రేక్షకుల నుంచి తనకు లభిస్తున్న అభినందనలు, ఆదరాభిమానాలు చాలా సంతోషాన్నిస్తున్నాయని మీనాక్షీ అన్నారు. ఈ చిత్రంలో నటించడం ఒక కొత్త పరిణాన్ని ఆవిష్కరించుకోవడానికి తనకు లభించిన అవకాశంగా భావిస్తున్నానన్నారు. ఈ చిత్రంలో తనను హీరోయిన్‌గా ఎంపిక చేసిన యూనిట్‌ సభ్యులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానన్నారు. పలు ఛాలెంజ్‌తో కూడిన కథాపాత్రల్లో నటించి తనకుంటై ఒక ప్రత్యేక స్థానాన్ని పొందాలని కోరుకుంటున్నాననీ, స్టీరియో భాణిని బద్దలు కొట్టి నటనకు అవకాశం ఉన్న బలమైన పాత్రల్లో నటించాలన్నది తన ఆశ అన్నారు. కాగా తనకు తమిళంలో సూర్య నటనకు తాను వీరాభిమానినని చెప్పారు. ఆయన నటనను తాను చాలా కాలంగా పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ఒక్కో చిత్రంలోనూ తనను తాను కొత్తగా ఆవిష్కరించుకుంటున్న ఆయన నుంచి నేర్చుకోవలసింది చాలా ఉందన్నారు. సూర్యకు జంటగా నటించాలన్నది తన కల అన్నారు. దాన్ని ఒక రోజు కచ్చితంగా నెరవేరుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. కాగా ప్రతిభావంతమయిన నటన, మంచి కథా చిత్రాల్లో నటించాలన్న ఆసక్తి మీనాక్షీ దినేష్‌ త్వరలోనే దక్షిణాది సినిమాలో తనకుంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకంటారని భావించవచ్చు.

Green signal for land consolidation of another 20494 acres in Amaravati9
అమరావతిలో మరో 20,494 ఎకరాల భూసమీకరణకు గ్రీన్‌ సిగ్నల్‌

సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి పరిధిలో మరో 20,494 ఎకరాల భూసమీకరణకు సీఆర్‌డీఏ అథారిటీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. పల్నాడు జిల్లా అమరావతి మండలం వైకుంఠపురం, పెదమ­ద్దూరు, యండ్రాయి, కార్లపూడి, గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలోని వడ్డమాను, హరిశ్చంద్రపురం, పెదపరిమి గ్రామాల్లో భూసమీకరణకు ఆమోదం తెలిపింది. శనివారం ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్‌డీఏ 50వ సమావేశం జరిగింది. ఏడు అంశాలను సీఆర్‌డీఏ అథారిటీ ఆమోదించింది. మందడం, రాయపూడి, పిచుకలపాలెంలలో ఫైనాన్స్, స్పోర్ట్స్‌ సిటీల్లోని దాదాపు 58 ఎకరాల్లో హైడెన్సిటీ రెసిడెన్షియల్‌ జోన్, మిశ్రమ అభివృద్ధి ప్రాజెక్టుల నిర్మాణానికి ఆర్‌ఎఫ్‌పీ(ఆసక్తి వ్యక్తీకరణ ప్రతిపాదన)ను ఆహ్వానించేందుకు అనుమతి ఇచ్చింది. రాజధానిలో నిర్మించే ఫైవ్‌ స్టార్‌ హోటళ్లకు సమీపంలో అంతర్జాతీయ ప్రమాణాలతో కన్వెన్షన్‌ సెంటర్లు నిర్మించే ప్రతిపాదనలను అథారిటీ ఆమోదించింది. మందడంలో వివాంతా, హిల్టన్‌ హోటల్స్, తుళ్లూరులో హయత్‌ రీజెన్సీ, లింగాయపాలెం నోవోటెల్‌ సమీపంలో ఈ కన్వెన్షన్‌ సెంటర్ల నిర్మాణానికి 2.5 ఎకరాల చొప్పున కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. రాజధాని నిర్మాణ పనులకు కృష్ణా నది నుంచే ఇసుకను డ్రెడ్జింగ్‌ ద్వారా తీసుకునేందుకు సీఆర్డీఏకి అనుమతి ఇచ్చింది. ప్రస్తు­తం రాజధానిలో రూ.49,040 కోట్ల విలువైన పనులు జరుగుతున్న నేపథ్యంలో.. అవసరమైన ఇసుకను ప్రకాశం బ్యారే జీ ఎగువన డిసిల్టింగ్‌ ద్వారా సమకూర్చుకోవడానికి అను­మతి ఇవ్వాలని జలవనరుల శాఖను సీఆర్డీఏ కోరింది. ఇసుక డిసిల్టేషన్‌ ప్రక్రియకు రూ.286 కోట్లు అవుతుందని అధికారులు తెలిపారు. వివిధ సంస్థలకు భూ కేటాయింపులపై మంత్రుల సబ్‌ కమిటీ తీసుకున్న నిర్ణయాలకూ సీఆర్‌డీఏ ఆమోదం తెలిపింది.సీబీఐ(సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌)కి 2 ఎకరాలు, జీఎస్‌ఐ(జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా)కి 2 ఎకరాలు, స్టేట్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌కు 5 ఎకరాలు, ఆంధ్రప్రదేశ్‌ కో–ఆపరేటివ్‌ బ్యాంక్‌కు 0.495 ఎకరాలు, పుల్లెల గోపీచంద్‌ బ్యాడ్మింటన్‌ అకాడమీకి 12 ఎకరాలు, ఎంఎస్‌కే ప్రసాద్‌ ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ అకాడమీకి 12 ఎకరాలు కేటాయించింది. ఆదాయ పన్ను శాఖకు 2 ఎకరాలు, ఏపీ గ్రామీణ బ్యాంక్‌కు 2 ఎకరాలు, సెంట్రల్‌ బ్యాంక్‌కు 0.40 ఎకరాలు, ఎస్‌ఐబీకి 0.50 ఎకరాలు, బ్యూరో ఆఫ్‌ ఇమ్మిగ్రేషన్‌కు 0.50 ఎకరాలు, కిమ్స్‌ ఆస్పత్రి, మెడికల్‌ కళాశాలకు 25 ఎకరాలు, బీజేపీకి 2 ఎకరాలు, బాసిల్‌ వుడ్స్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌కు 4 ఎకరాలు కేటాయించింది. గెయిల్, అంబికా గ్రూప్‌కు గతంలో కేటాయించిన 1.40 ఎకరాలను రద్దు చేసింది. మంగళగిరి సమీ పంలో ఈ–15 రహదారిపై నాలుగులేన్ల ఆర్వోబీ నిర్మాణానికి ఆమోదం తెలిపింది. అల్లూరి సీతారామ రాజు, పొట్టి శ్రీరాములు స్మారక చిహ్నాల ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు.

NITI Aayog Report on Chemical Industry10
కెమికల్స్‌ దిగ్గజంగా భారత్‌!! 

న్యూఢిల్లీ: దేశీయంగా ప్రపంచ స్థాయి కెమికల్‌ హబ్స్‌ను నెలకొల్పడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని నీతి ఆయోగ్‌ ఒక నివేదికలో సూచించింది. అలాగే అత్యధిక సామర్థ్యాలుండే ఎనిమిది పోర్ట్‌–ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ క్లస్టర్లను ఏర్పాటు చేయాలని పేర్కొంది. అప్పుడే గ్లోబల్‌ కెమికల్‌ తయారీ దిగ్గజంగా భారత్‌ ఎదగగలదని పేర్కొంది. ‘‘రసాయనాల పరిశ్రమ: అంతర్జాతీయ వేల్యూ చెయిన్‌లో (జీవీసీ) భారత భాగస్వామ్యానికి దన్ను’’ పేరిట రూపొందించిన నివేదికలో ఈ విషయాలు వివరించింది. 2040 నాటికి భారత్‌ 1 లక్ష కోట్ల డాలర్ల రసాయనాల ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకున్నట్లు నీతి ఆయోగ్‌ తెలిపింది. నివేదిక ప్రకారం.. 2023లో జీవీసీలో 3.5 శాతంగా ఉన్న భారత్‌ వాటా 2040 నాటికి 5–6 శాతానికి పెరగనుందని, 2030 నాటికి అదనంగా 7 లక్షల ఉద్యోగాల కల్పన జరుగుతుందని వివరించింది. గ్లోబల్‌ కెమికల్‌ వేల్యూ చెయిన్‌లో భారత్‌ వాటా 3.5 శాతమే ఉండటం, 2023లో రసాయనాల వాణిజ్య లోటు 31 బిలియన్‌ డాలర్ల స్థాయిలో ఉండటమనేది ముడి సరుకు, ఇతరత్రా స్పెషాలిటీ రసాయనాల కోసం ఎక్కువగా దిగుమతులపైనే ఆధారపడాల్సి వస్తున్న విషయాన్ని తెలియజేస్తోందని రిపోర్ట్‌ పేర్కొంది. నివేదికలోని మరిన్ని విశేషాలు.. → సమగ్ర ఆర్థిక, ఆర్థికేతర సంస్కరణలు అమలు చేస్తే భారత రసాయనాల పరిశ్రమ 2040 నాటికి 1 లక్ష కోట్ల డాలర్ల స్థాయికి చేరేందుకు, జీవీసీలో వాటాను 12 శాతానికి పెంచుకునేందుకు దోహదపడుతుంది. తద్వారా శక్తివంతమైన గ్లోబల్‌ కెమికల్‌ కేంద్రంగా భారత్‌ ఎదగవచ్చు. → కేంద్ర స్థాయిలో ఒక సాధికారిక కమిటీని వేయాలి. ఉమ్మడిగా మౌలిక సదుపాయాల అభివృద్ధి, వీజీఎఫ్‌ మొదలైన వాటి కోసం బడ్జెట్‌ కేటాయింపులతో సాధికారిక కమిటీ కింద కెమికల్‌ ఫండ్‌ ఏర్పాటు చేయాలి. హబ్‌ స్థాయిలోని అడ్మినిస్ట్రేటివ్‌ యంత్రాంగం, మొత్తం హబ్‌ నిర్వహణను పర్యవేక్షించాలి. → పోర్టుల్లో రసాయనాల ట్రేడింగ్‌కు సవాలుగా ఉంటున్న మౌలిక సదుపాయాల అంతరాలను పరిష్కరించడంలో పోర్టులకు తగు సూచనలివ్వగలిగేలా కెమికల్‌ కమిటీ కూర్పు ఉండాలి. అత్యధిక సామర్థ్యాలున్న 8 పోర్ట్‌ క్లస్టర్స్‌ను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. → దిగుమతులు, ఎగుమతి సామర్థ్యాలు, సోర్సింగ్‌ కోసం ఒకే దేశంపై ఆధారపడటం, మార్కెట్‌ ప్రాధాన్యత తదితర అంశాల ఆధారంగా అదనంగా రసాయనాలను ఉత్పత్తి చేసేందుకు ప్రభుత్వం ప్రోత్సాహకాలివ్వాలి. → పారదర్శకంగా, జవాబుదారీతనంతో ఉండేలా పర్యావరణ అనుమతుల (ఈసీ) ప్రక్రియను వేగవంతం చేయాలి. కాల పరిమితులు, నిబంధనల అమలును పర్యవేక్షించేలా పరిశ్రమలు, అంతర్గత వాణిజ్యం ప్రోత్సాహక విభాగం డీపీఐఐటీ కింద ఆడిట్‌ కమిటీని ఏర్పాటు చేయడం ద్వారా ఈసీ క్లియరెన్స్‌ ప్రక్రియలను సరళతరం, వేగవంతం చేయాలి. తరచుగా నివేదికలను ప్రచురించాలి. ఈఏసీకి మరింత స్వయం ప్రతిపత్తినివ్వాలి. → స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల్లో (ఎఫ్‌టీఏ) రసాయనాల పరిశ్రమ కోసం నిర్దిష్ట నిబంధనలను చేర్చేలా భారత్‌ చర్చలు జరపవచ్చు. పరిశ్రమ ప్రయోజనాలను పరిరక్షించేలా టారిఫ్‌ కోటాలు లేదా కీలకమైన ముడిసరుకు, పెట్రోకెమికల్‌ ఫీడ్‌స్టాక్‌లపై సుంకాలపరంగా మినహాయింపులులాంటివి చేర్చే అవకాశాలను పరిశీలించవచ్చు. → అంతర్జాతీయంగా పోటీపడటంలో భారత రసాయన రంగం పలు సవాళ్లను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా ఫీడ్‌స్టాక్‌ కోసం ఎక్కువగా దిగుమతులపై ఆధారపడటం పెద్ద సవాలుగా ఉంటోంది. ఫలితంగా 2023లో 31 బిలియన్‌ డాలర్ల మేర వాణిజ్య లోటు నమోదైంది. → అంతర్జాతీయంగా పోటీ సంస్థలతో పోల్చి చూసినప్పుడు మౌలిక సదుపాయాల్లో అంతరాలు, కాలం చెల్లిన పారిశ్రామిక క్లస్టర్లు, భారీ స్థాయి లాజిస్టిక్స్‌ వ్యయాలు మొదలైనవి దేశీ సంస్థలకు ప్రతికూలంగా ఉంటున్నాయి. → దీనికి తోడు పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలపై భారత్‌ పెట్టే పెట్టుబడులు కూడా చాలా తక్కువగా ఉంటున్నాయి. అంతర్జాతీయంగా ఇది సగటున 2.3 శాతంగా ఉండగా, భారత్‌లో 0.7 శాతంగానే ఉంది. అత్యంత విలువైన రసాయనాలను దేశీయంగా ఆవిష్కరించడానికి ఇది ఆటంకంగా ఉంటోంది. → నియంత్రణ సంస్థలపరమైన జాప్యాలు, ముఖ్యంగా పర్యావరణ అనుమతులపరంగా నెలకొన్న సవాళ్లు, పరిస్థితులకు తగ్గట్లు పరిశ్రమ ఎదగడంలో అవరోధాలుగా ఉంటున్నాయి. → పరిశ్రమలో నైపుణ్యాలున్న ప్రొఫెషనల్స్‌ కొరత 30 శాతం మేర ఉంది. ముఖ్యంగా గ్రీన్‌ కెమిస్ట్రీ, నానోటెక్నాలజీ, ప్రాసెస్‌ సేఫ్టీ లాంటి కొత్త విభాగాల్లో ఇది మరింత తీవ్రంగా ఉంది. → ప్రస్తుత సవాళ్లను పరిష్కరించి, ప్రతిపాదిత సంస్కరణలను అమలు చేస్తే, భారత్‌ అంతర్జాతీయంగా పోటీ పడే సామర్థ్యాలను పెంచుకోవచ్చు. పెట్టుబడులను ఆకర్షించవచ్చు. గ్లోబల్‌ వేల్యూ చెయిన్‌కి సారథ్యం వహించేలా రసాయనాల రంగాన్ని పటిష్టంగా తీర్చిదిద్దుకోవచ్చు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement