భావ్‌నగర్/న్యూఢిల్లీ: గుజరాత్‌లో ఆమ్ ఆద్మీ పార్టీకి నానాటికీ పెరిగిపోతున్న ఆదరణను చూసి బీజేపీ విపరీతంగా భయపడుతోందని ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. అందుకే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సీఆర్ పాటిల్‌ను త్వరలో తొలగించబోతోందంటూ ట్వీట్ చేశారు. ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న గుజరాత్‌లో మంగళవారం ఆయన పలు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. విద్య, ఉపాధి తదితరాలపై భావ్‌నగర్‌లో విద్యార్థులు, యువతతో ముచ్చటించారు. మధ్యప్రదేశ్ వ్యాపం స్కాంను తలదన్నే రీతిలో గుజరాత్‌లో భారీ స్థాయి లీకేజీ కుంభకోణం జరుగుతోందని ఆరోపించారు.
రాష్ట్ర స్థాయి నియామక పరీక్షల్లో ఏళ్ల తరబడి ప్రశ్నపత్రాలు లీకవుతున్నాయన్నారు. 2015 నుంచి రాష్ట్రంలో నమోదైన ప్రశ్నపత్రాల లీకేజీ కేసులను ప్రస్తావించారు. బీజేపీ ప్రభుత్వానికి సిగ్గుగా అన్పించడం లేదా అని ప్రశ్నించారు. పరీక్షలే సరిగా నిర్వహించడం చేతగానివారు రాష్ట్రంలో, కేంద్రంలో ప్రభుత్వాలను నడుపుతున్నారంటూ ఎద్దేవా చేశారు. తాము అధికారంలోకి వస్తే లీకేజీతో సంబంధమున్న వారందరినీ ఊచలు లెక్కబెట్టిస్తామని ప్రకటించారు. పేపర్ల లీకేజీకి పాల్పడేవారికి పదేళ్ల జైలుశిక్షపడేలా చట్టం తెస్తామన్నారు. లీకేజీ కేసులన్నింటినీ తిరగదోడతామని చెప్పారు.
ప్రభుత్వ రంగంలో 15 లక్షల ఉద్యోగాలివ్వడంతో పాటు ప్రైవేటు రంగంలో స్థానికులకు 80 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రకటించారు. ఇందుకోసం నియామక క్యాలెండర్ రూపొందించామని చెప్పారు. నెలకు రూ.3,000 నిరుద్యోగ భృతి ఇస్తామని పునరుద్ఘాటించారు. ‘‘ఢిల్లీలో 12 లక్షల మంది యువతకు ఉద్యోగాలిచ్చాం. ఉపాధి కల్పనకు ఏం చేయాలో మాకు బాగా తెలుసు’’ అన్నారు. ‘‘తప్పుడు కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం, ఎక్సైజ్ మంత్రి మనీశ్ సిసోడియాపై సీబీఐ దాడులు చేయించారు. కానీ ఇక్కడ లీకేజీ సూత్రధారులు, పాత్రధారులంతా బీజేపీ వాళ్లే.
అందుకే వారిపై సీబీఐ దర్యాప్తు లేదు’ అంటూ దుయ్యబట్టారు. ‘అధికార పార్టీ వాళ్లకే ప్రభుత్వోద్యోగాల్లో ప్రాధాన్యమిస్తామని గుజరాత్ మంత్రి ఒకరన్నారు. ఉద్యోగాలేమన్నా మీ అబ్బ సొత్తా? అవి గుజరాత్ యువతకే సొంతం తప్ప ఏ పార్టీకో కాదు’ అని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికలను బీజేపీ, ఆప్ మధ్య ధర్మ యుద్ధంగా కేజ్రీవాల్ అభివర్ణించారు. సోషల్ మీడియాలో యువత ఆప్‌కు మద్దతివ్వాలని కోరారు. భావ్‌నగర్ సంస్థాన చివరి పాలకుడు మహరాజా కృష్ణకుమార్ సింగ్‌కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిసోడియా కూడా పాల్గొన్నారు.
న్యూయార్క్ టైమ్స్‌కు లంచం ఎర
‘‘ఇటీవల ఓ పార్టీ నాయకుడు న్యూయార్క్ టైమ్స్‌లో తనపొటో వేయించుకోవాలనుకున్నాడు. అందుకు లంచం కూడా ఆఫర్ చేశాడు. తాము అమ్ముడు పోయేవాళ్లం కాదంటూ ఆ పత్రిక తిరస్కరించింది’’ అని కేజ్రీవాల్ ఆరోపించారు. ప్రపంచంలో దేన్నైనా కొనేయొచ్చన్నది ఇలాంటి వాళ్ల నమ్మకమంటూ దుయ్యబట్టారు. మరోవైపు తాము భయపడుతున్నామన్న వ్యాఖ్యలను గుజరాత్ బీజేపీ తిప్పికొట్టింది. ‘‘కేజ్రీవాల్ పగటి కలలు మానాలి. తన గురించి, తన లిక్కర్ మంత్రి గురించి ఆలోచించుకోవాలి’’ అని సూచించింది.
ఎక్సైజ్ పాలసీ ఉల్లంఘనలమయం: బీజేపీ
వివాదాస్పద ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ విషయమై ఆప్‌పై విమర్శల దాడిని బీజేపీ మరింత తీవ్రతరం చేసింది. అందులో చోటుచేసుకున్న పలు ఉల్లంఘనలను, నిపుణుల కమిటీ సిఫార్సులను ఆప్ సర్కారు పట్టించుకోలేదని పార్టీ ఎంపీలు పర్వేశ్ వర్మ, సుధాన్షు త్రివేదీ ఆరోపించారు. దాంతో ఖజానాకు ఏకంగా రూ.6,500 కోట్ల మేరకు నష్టం వాటిల్లిందన్నారు. ‘‘అవకతవకలు కొట్టొచ్చినట్టు కన్పిస్తున్నాయి కాబట్టే మా ప్రశ్నలకు ఆప్ బదులివ్వకుండా తప్పించుకుంటోంది. మేం కెమిస్ట్రీ ప్రశ్నలడుగుతుంటే సిసోడియా హిస్టరీ సమాధానాలిస్తున్నారు’’ అంటూ ఎద్దేవా చేశారు.
సిసోడియాపై ఈడీ కేసు
మనీ లాండరింగ్ అభియోగాలు
త్వరలో అరెస్టు చేస్తారేమో: కేజ్రీవాల్
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ అవతకవతలకు సంబంధించి రాష్ట్ర ఎక్సైజ్ మంత్రి మనీశ్ సిసోడియా తదితరులపై ఈడీ మంగళవారం మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. సిసోడియా, 14 మందిపై సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈ చర్యలు తీసుకుంది. ఈ కేసులో ఇటీవలే సిసోడియాతో పాటు దేశవ్యాప్తంగా 32 చోట్ల పలువురి నివాసాలు, కార్యాలయాలపై సీబీఐ దాడులు చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో సిసోడియాను రెండు మూడు రోజుల్లో అరెస్టు చేస్తారని కేజ్రీవాల్ అన్నారు. కాగా, ఆప్‌ను అబద్ధలకోరు పార్టీగా కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ దుయ్యబట్టారు.
Comments
Please login to add a commentAdd a comment