జగన్‌కు మా మద్దతు.. రాజకీయ ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటాం: అఖిలేష్‌ యాదవ్‌ | akhilesh yadav speech at ys jagan darna delhi | Sakshi
Sakshi News home page

జగన్‌కు మా మద్దతు.. రాజకీయ ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటాం: అఖిలేష్‌ యాదవ్‌

Published Wed, Jul 24 2024 12:18 PM | Last Updated on Wed, Jul 24 2024 1:36 PM

akhilesh yadav speech at ys jagan darna delhi

న్యూఢిల్లీ, సాక్షి: ఏపీ కూటమి అరాచకపాలనకు నిరసనగా వైఎస్సార్‌సీపీ చేపట్టిన ధర్నాకు సమాజ్‌వాదీ పార్టీ సంఘీభావం తెలిపింది. బుధవారం మధ్యాహ్నాం వైఎస్‌ జగన్‌ను కలిసిన ఆ పార్టీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌.. తన పార్టీ మద్దతు ప్రకటించారు. ఆ సమయంలో ఏపీలోని పరిస్థితులను వీడియోల ద్వారా అఖిలేష్‌కు జగన్‌ వివరించారు. అనంతరం  అఖిలేష్‌ యాదవ్‌  మీడియాతో మాట్లాడారు.

 ‘‘ నేను ఇక్కడికి రాకుండా ఉండి ఉంటే.. నాకు ఇన్ని వాస్తవాలు తెలిసి ఉండేది కాదు. రాజకీయాల్లో గెలుపు, ఓటములు సహజం. ఇవన్నీ చూసిన తర్వాత నేను ఒక విషయం స్పష్టం చేయదల్చాను. అధికారంలో ఉన్నవారు సంయమనం పాటించాలి. ప్రజల సమస్యలు పట్టించుకోవాలి. ఎదుటివారు చెప్పేది వినాలి. అంతేకానీ, వారి ప్రాణాలు తీయకూడదు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన పార్టీ, ఆ వెంటనే ప్రతిపక్ష పార్టీపై దాడులు మొదలుపెట్టినట్లు.. ఈ ఫోటోలు, వీడియోలు చూసిన తరవాత అర్ధమైంది. పట్టపగలే దాడులు చేయడం, హత్య చేయడం, వారి ఆస్తులు ధ్వంసం చేయడం, ప్రతిపక్ష పార్టీకి అనుకూలంగా ఉన్న వారిపై అక్రమంగా కేసులు నమోదు చేయడం, వేధించడం.. అలాగే ఎన్నికైన ప్రజాప్రతినిధులపై ఏకంగా హత్యాయత్నం చేయడం.. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదు.

ఇది నిజం.. నిన్నటి వరకు  వైఎస్‌ జగన్‌ సీఎంగా ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబుగారు సీఎంగా ఉన్నారు. రేపు మళ్లీ జగన్‌గారు ముఖ్యమంత్రి కావొచ్చు. ప్రజాస్వామ్య వ్యవస్థలో బుల్డోజర్‌ సంస్కృతిని మా సమాజ్‌వాదీ పార్టీ ఏనాడూ సమర్థించలేదు. దాన్ని తప్పు పడుతున్నాం. చివరకు ప్రభుత్వ పెద్దలు.. అలా బుల్డోజర్‌ సంస్కృతిని పెంచి, పోషిస్తూ.. సమాజానికి ఏం సందేశం ఇవ్వదల్చారు?. అలా చేసి ప్రజలను భయపెట్టాలనుకుంటున్నారా? అది సరికాదు. ప్రజలు సంతోషంగా జీవించాలి. ఎవరైతే ప్రజలను భయపెడుతుంటారో.. వారు మంచి ముఖ్యమంత్రి కారు. అలాగే అది సుపరిపాలన కాదు. మంచి ప్రభుత్వం కాదు. ఒక్క విషయం గుర్తు పెట్టుకొండి. ఆ పని చేసే వాళ్లు ఎక్కువ కాలం అధికారంలో ఉండబోరు.

.. వైఎస్‌ జగన్‌ రాష్ట్రంలో కొనసాగుతున్న అరాచక పాలనను ధైర్యంగా ఎదుర్కొంటున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో పార్టీ కార్యకర్తలంతా ఆయన వెంట నడుస్తున్నారు. ఇది గొప్ప విషయం. జగన్‌ కూడా ఎప్పుడూ కార్యకర్తలతో మమేకం అవుతారు. అలాంటి నాయకుడు ఈరోజు, తమ కార్యకర్తలో కోసం పోరాడుతున్నారు. రేపు వారే పోరాడి, మిమ్మల్ని తిరిగి అధికారంలోకి తీసుకొస్తారు. ఆంధ్రప్రదేశ్‌లో సాగుతున్న విధ్వంసాన్ని మీరు అందరికీ చూపాలి. బుల్డోజర్‌ సంస్కృతి అనేది ఎప్పుడూ, ఎక్కడా మంచిది కాదు. మేం యూపీలో దాన్ని చూశాం. వ్యక్తుల ఆస్తులు ధ్వంసం చేయడాన్ని మా యూపీలో చూశాం. అంత కంటే మరో దారుణం కూడా చూశాం. ఫేక్‌ ఎన్‌కౌంటర్‌. ఏకంగా పోలీస్‌ కస్టడీలోనే ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఎవరైనా పోలీస్‌ కస్టడీ సురక్షితం అనుకుంటారు. కానీ, మా దగ్గర ఏకంగా పోలీస్‌ కస్టడీలోనే ఎన్‌కౌంటర్‌ చేశారు.

.. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు అన్యాయం జరుగుతోంది. అదే పరిస్థితి మా యూపీలో కూడా చూశాం. మాకు కేవలం ముగ్గురు ఎంపీలు మాత్రమే ఉన్నా కూడా.. ప్రభుత్వంతో పోరాడాము. అంతేకానీ, ప్రభుత్వం ముందు తల వంచలేదు. ఆ తర్వాత మా పార్టీ నుంచి 37 మంది ఎంపీలు గెల్చారు. కాంగ్రెస్‌ నుంచి కూడా ఆరుగురిని గెలిపించాం. ప్రజల వెంట ఉన్నవారిని, వారు ఎప్పుడైనా ఆదరిస్తారు. కాబట్టి, రేపు వైఎస్‌ జగన్‌ను ప్రజలే గెలిపించుకుంటారు.

బీజేపీ ఒక విషయం గుర్తుంచుకోవాలి. నేరమయ రాజకీయాలు చేయకూడదు. ఇలాంటి ఘటనలను సమర్థించొద్దు. వైఎస్సార్‌కాంగ్రెస్‌ పార్టీకి, వైఎస్‌ జగన్‌కు మా మద్దతు ఉంటుంది. ఇలాంటి పరిస్థితి రేపు మరెవరికైనా జరగొచ్చు. అన్యాయానికి వ్యతిరేకంగా మేమెప్పుడూ పోరాడతాం. అలాంటి వారికి అండగా నిలబడతాం’’ అని అఖిలేష్‌ ప్రసంగించారు.

రాజకీయ టెర్రరిజంపై పోరాడతాం
వైఎస్సార్‌సీపీ చేపట్టిన ధర్నాకు ఇండియన్‌ యూనియన్‌ ముస్లిం లీగ్‌ మద్దతు తెలిపింది. అనంతరం ఆ పార్టీ ఎంపీ వహాబ్‌ మీడియాతో మాట్లాడారు. ‘ప్రభుత్వ టెర్రరిజాన్ని సహించం. వైఎస్సార్‌సీపీ ఎంపీలతో కలిసి రాజకీయ టెర్రరిజంపై పోరాడతాం. రాజకీయ టెర్రరిజాన్ని ఎదుర్కొవడంలో వైఎస్‌ జగన్‌కు మా సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం’ అని అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement