శరద్ పవార్ వంటి రాజకీయ దిగ్గజానికి ఏకైక సంతానం. గారాలపట్టి. అలా తండ్రి నీడలోనే రాజకీయాల్లో ప్రవేశించినా తొందర్లోనే బలమైన నాయకురాలిగా ఎదిగి తనదైన ముద్ర వేశారు సుప్రియా సులే. బారామతి ఎంపీ, ఎన్సీపీ (ఎస్పీ) వర్కింగ్ ప్రెసిడెంట్. కానీ తాను సాధారణ పార్టీ కార్యకర్తనే అని గర్వంగా చెప్పుకుంటారు. అంతకుముందు జర్నలిస్టుగా సామాజిక సమస్యలపై లోతైన అవగాహన పెంచుకున్నారు. ఊపిరి సలపని రాజకీయాల నడుమ కూడా కుటుంబానికి చాలా ప్రాధాన్యమిస్తారు. ఆల్‌రౌండర్ గా అన్ని పాత్రలకూ సమ న్యాయం చేస్తుంటారు.
ఉత్తమ పార్లమెంటేరియన్
పుట్టిందే రాజకీయ కుటుంబం. దాంతో చిన్నప్పట్నుంచే రాజకీయ వ్యవహారాలపై సుప్రియకు లోతైన అవగాహన ఉంది. అయినా తొలుత రాజకీయాలను కెరీర్‌గా ఎంచుకోలేదు. కొంతకాలం జర్నలిస్టుగా చేశారు. పెళ్లి తర్వాత పదేళ్లు విదేశాల్లోనే ఉన్నారు. తండ్రి, మామ అనారోగ్యం బారిన పడటంతో తిరిగొచ్చారు. 2006లో రాజకీయ రంగప్రవేశం చేసి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బారామతి లోక్‌సభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న తండ్రి రాజ్యసభకు వెళ్లడంతో 2009 ఎన్నికల్లో అక్కడ బరిలో దిగారు 3 లక్షల పై చిలుకు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2014, 2019 ఎన్నికల్లోనూ నెగ్గి బారామతిని బలమైన కోటగా మార్చుకున్నారు. ఎన్సీపీలో చీలిక నేపథ్యంలో ఈసారి మాత్రం వదిన సునేత్ర నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు.
ఉమన్ ఆఫ్ ద డెకేడ్...
ఇన్‌స్టా, ఎక్స్, ఫేస్‌బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే కొద్దిమంది నేతల్లో సుప్రియ ఒకరు. స్వయం సహాయక సంఘాలతో కలిసి పని చేశారు. గిరిజనులు, ఆదివాసీల కోసం పాఠశాలల నిర్మాణానికి, వికలాంగుల హక్కుల సాధనకు కృషి చేశారు. మహిళల సమస్యలపై నిత్యం గొంతెత్తుతుంటారు. భ్రూణహత్యలు, వరకట్న వ్యవస్థపై పలు ఉద్యమాలు జరిపారు. మహిళా సాధికారతకు పోరాటం, సామాజిక సేవకు ప్రతిష్టాత్మక ‘ముంబై ఉమన్ ఆఫ్ ద డెకేడ్’ అవార్డు అందుకున్నారు. పలుమార్లు ఉత్తమ పార్లమెంటేరియన్‌గా నిలిచారు.
నేల విడిచి సాము చేయొద్దని...
రాజకీయాలు, కుటుంబం మధ్య సుప్రియ చాలా బ్యాలెన్స్‌డ్‌గా ఉంటారు. బంధుత్వానికి చాలా విలువిస్తారు. “్ఙమా అమ్మ బలమైన వ్యక్తి. నాన్న కంటే గట్టిది. నాన్న పబ్లిక్ లైఫ్‌ను ఎక్కువగా ఇష్టపడతారు. అమ్మ అజ్ఞాతాన్ని ప్రేమిస్తుంది. జీవన పోరాటంలో మాకెప్పుడూ అండగా నిలుస్తూ వచి్చంది. రాజకీయాలు, సామాజిక సవాళ్లను అధిగమించడమెలాగో నాన్న చూపితే, ఎప్పుడూ నేలవిడిచి సాము చేయొద్దని అమ్మ నేరి్పంది. అందుకే కుటుంబం పట్ల నేను బాధ్యతగా ఉంటా. ఎంపీగా ప్రజల సమస్యలను చర్చిస్తున్నప్పుడు కూడా.. కొడుకు చదువు, కూతురు పుట్టినరోజు కేక్ ఎలా ఉండాలి వంటిని నా మనసులో మెదులుతూ ఉంటాయి’’ అంటారామె. సుప్రియకు నచ్చే నేత సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి. పార్టీ, సిద్ధాంతాల పట్ల ఆయన నిబద్ధత తనకు ప్రేరణనిస్తాయంటారు. పార్లమెంటేరియన్లుగా దివంగత అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్‌లనూ బాగా ఇష్టపడతారు.
ప్రేమ వివాహం
చిరునవ్వుతో వెలిగే బక్కపలుచని ముఖం. మాటల్లో మృదుత్వంతో ఇట్టే ఆకట్టుకునే సుప్రియ 1969 జూన్ 30న జన్మించారు. బర్కిలీలో యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో నీటి కాలుష్యంపై అధ్యయనం చేశారు. ఓ దినపత్రికలో జర్నలిస్టుగా చేస్తుండగా ఫ్యామిలీ ఫ్రెండ్ ఇంట్లో సదానంద్ బాలచంద్ర సులేతో జరిగిన పరిచయం ప్రేమగా మారి పెళ్లికి దారి తీసింది. వారికిద్దరు పిల్లలు.
Comments
Please login to add a commentAdd a comment