
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం అధికారం చేపట్టి ఈనెలాఖరుకు ఏడాదిన్నర పూర్తవుతుందని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు చెప్పారు. చంద్రబాబు, ఆయన అనుకూల వర్గాలు, అనుకూల మీడియా వైఎస్ జగన్ ప్రభుత్వంపై ఎన్ని విమర్శలైనా చేయవచ్చన్నారు. అయితే ఈ తక్కువ కాలంలోనే పేదల కోసం లెక్క లేనన్ని సంక్షేమ కార్యక్రమాలను అందించి ప్రజల హృదయాల్లో గుడి కట్టుకున్న నేతగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిలిచారని చెప్పారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రాంతీయ అసమానతలతో ఉన్న రాష్ట్రాన్ని సమన్వయం చేస్తూ, మూడు ప్రాంతాల సమగ్రాభివృద్ధి కోసం వైఎస్ జగన్ కృషి చేస్తున్నారని చెప్పారు.
తమ ప్రభుత్వం బడుగు, బలహీనవర్గాల జీవితాల్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకు రావాలని సంకల్పించిందన్నారు. తీర ప్రాంతంలోని మత్స్యకారుల దుర్భర పరిస్థితిని తొలగించడానికి ప్రత్యేక దృష్టిని సారించి ఫిషింగ్ హార్బర్లు, ఆక్వా హబ్‌లు ఏర్పాటు చేస్తున్నారని అన్నారు. తన పాలనతో ప్రజల మనసు గెలుస్తున్న వైఎస్ జగన్‌ను అడ్డుకునేందుకు చంద్రబాబు ఓ మాయల ఫకీర్‌లా వ్యవస్థల్లో జొరబడి కుట్రలు, కుతంత్రాలు పన్నుతున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు హయాంతో ప్రభుత్వ ఆసుపత్రులను, స్కూళ్లను, 108, 104 సర్వీసులను నాశనం చేస్తే.. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక వీటన్నింటకీ కొత్త శోభ తెచ్చారని చెప్పారు. పేదవాడికి ఇళ్ల పట్టాలు ఇస్తుంటే విపక్ష నేతలు రాక్షసుల్లా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment