సాక్షి, విశాఖపట్నం: రాబోయే ఎన్నికలకు రాష్ట్రంలో రాజకీయ వేట మొదలైందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తూ బీజేపీ వైఖరిని స్పష్టం చేస్తున్నారని చెప్పారు. మంగళవారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోదీ పాలనపై పలు పార్టీలు దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. అందుకే ‘పార్టీల అసత్య ప్రచారం.. కేంద్ర సహకారం’ పేరుతో తమ పార్టీ ఇటీవల పుస్తకాన్ని ముద్రించిందని.. దీనిని అప్‌డేట్ చేసి త్వరలో విడుదల చేస్తామని చెప్పారు.
ఈ పుస్తకంతో ఇంటింటికీ వెళ్లి వాస్తవాలను వివరిస్తామన్నారు. ఏపీకి కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నిస్తున్న వైఎస్సార్‌సీపీ నాయకులకు కూడా ఈ పుస్తకంలో సమాధానం దొరుకుతుందన్నారు. విశాఖలో భూ కుంభకోణాలపై గత టీడీపీ, ప్రస్తుత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాలు వేసిన సిట్ నివేదికలను బహిర్గతం చేయాలన్నారు. వైఎస్సార్‌సీపీతో సహా ఏ పార్టీకి కూడా బీజేపీ అండగా లేదని చెప్పారు.
రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిపై సీబీఐ లేదా సిటింగ్ జడ్జితో విచారణ జరిపించాలి్సన అవసరముందన్నారు. దీనిపై ఎవరైనా కోర్టుకెళ్లి విచారణకు అభ్యర్థించవచ్చని.. ఇందులో కేంద్రం గానీ, బీజేపీ గానీ జోక్యం చేసుకోబోదన్నారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్‌రాజు మాట్లాడుతూ.. మార్గదర్శిపై రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. సమావేశంలో బీజేపీ నాయకుడు మేడపాటి రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment