న్యూఢిల్లీ: చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన మహిళా రిజర్వేషన్ బిల్లుపై లోక్‌సభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా కీలక వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్లు వర్తించవని అన్నారు. ఎన్నికలు జరిగిన వెంటనే జనాభా లెక్కలు, డీలిమిటేషన్ చేపడతామని చెప్పారు. కావాలంటే చట్టంలో కొన్ని మార్పులు చేస్తామని తెలిపారు.
పారదర్శకత కోసమే డీలిమిటేషన్ చేయనున్నట్లు అమిత్ షా పేర్కొన్నారు. ఏయే స్థానాలు మహిళలకు రిజర్వ్ చేయాలనే దానిపై డిలిమిటేషన్ కమిషన్ మాత్రమే నిర్ణయిస్తుందని, అలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి జనాభా లెక్కల సమాచారం మూలాధారమని అన్నారు. అందుకే 2029 ఎన్నికల్లోనే మహిళా రిజర్వేషన్లు అమలవుతాయని పేర్కొన్నారు. బీజేపీకి మహిళా బిల్లు రాజకీయ అంశం కాదని, మహిళల సాధికారత కోసం చేసే ప్రయత్నమని అని స్పష్టం చేశారు. కొందరు ఓబీసీ రిజర్వేషన్ల గురించి మాట్లాడుతున్నారన్న అమిత్ షా... బీజేపీ దేశానికి ఏకంగా ఓబీసీ ప్రధానినే ఇచ్చిందనతి తెలిపారు.
చదవండి: మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించింది వీళ్లే!
కాగా నారీ శక్తి వందన్ అధినియం పేరుతో మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్రం లోక్‌సభలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. బిల్లుపై 80 మంది ఎంపీలు మాట్లాడారు. దాదాపు 8 గంటల వరకు సుధీర్ఘ చర్చ సాగింది. ఈ సందర్భంగా అధికార, ప్రతిపక్ష ఎంపీల మధ్య వాడివేడి చర్చ జరిగింది. మాజీ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, డీఎంకే ఎంపీ కనిమొళి, ఎన్‌సీపీ ఎంపీ సుప్రియా సూలే.. ప్రభుత్వంపై విరుచుకుపడ్డాయి. బిల్లు అసంపూర్తిగా ఉందని విపక్షాలు విమర్శించాయి. మహిళా రిజర్వేషన్ బిల్లు కింద ఓబీసీ, ఎస్సీ కోటా పెట్టాలని, త్వరగా ఈ బిల్లును అమల్లోకి తీసుకు రావాలని డిమాండ్ చేశాయి
విపక్షాలకు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కౌంటర్ ఇచ్చారు. సోనియా పేరు ఎత్తకుండానే విమర్శల వర్షం కురిపించారు. 2010లో బిల్లు తీసుకొచ్చిన వాళ్లు దాన్ని ఎందుకు పాస్ చేయలేకపోయారని ప్రశ్నించారు. ఇప్పుడు మాత్రం “ఇది మా బిల్లు” అని చెప్పుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మతపరమైన కోటాలు అడుగుతూ కాంగ్రెస్ దేశాన్నితప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తోందని మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment