సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో పొత్తులపై మరికొన్ని రోజుల్లో స్పష్టత వస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. పొత్తులపై కొద్ది రోజులు వేచి చూడాలని అన్నారు. ఎకనామిక్స్ టైమ్స్ ఆధ్వర్యంలో శనివారం ఇక్కడ నిర్వహించిన గ్లోబల్ బిజినెస్ సమ్మిట్‌లో పాల్గొన్న ఆయన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ‘దక్షిణాదిలో టీడీపీ అధినేత చంద్రబాబు, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రధాని మోదీ సహా మీతో చర్చలు జరిపారు. ఏపీలో ఎన్డీఏ విస్తరణ జరుగుతోందా’అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘కూటమిలు, ప్రభుత్వాల ఏర్పాటు వేదికలపై జరగవు.
సరైన సమయం రావాలి. కొద్ది రోజుల్లోనే దీనిపై స్పష్టత వస్తుంది’అని చెప్పారు. అకాలీదళ్‌ని కలుపుకొనే విషయంపై చర్చలు సాగుతున్నాయని, ఇంకా నిర్ణయం జరుగలేదని తెలిపారు. బీజేపీ సిద్ధాంతాలు, ఎజెండాలపై ఓ స్థిరాభిప్రాయంతో నిలకడగా ఉందని, దీనికి అనుగుణమైన కొందరు మిత్రులు వస్తారు, మరికొందరు బయటకు వెళతారని అన్నారు. కొన్ని సంఘటనల కారణంగానో లేక రాష్ట్రాల్లోని ప్రత్యేక రాజకీయ పరిస్థితుల దృష్ట్యానో మిత్రపక్ష పార్టీలు బయటకు వెళ్తాయన్నారు. ఇంతవరకు ఏ పార్టీనీ బీజేపీ ఎన్డీఏలోంచి బయటకు గెంటెయ్యలేదని స్పష్టం చేశారు.
ప్రతి సందర్భంలోనూ బీజేపీ కూటమి ధర్మాన్ని పాటించిందని అన్నారు. చాలా చోట్ల మహా కూటమిలు కట్టి విజయం సాధించాక కూడా చిన్న కూటమిల నుంచి ముఖ్యమంత్రులను చేశామని చెప్పారు. కొన్ని చోట్ల పార్టీ పూర్తి సంఖ్యలో సీట్లు గెలిచినా, మిత్రపక్షాలకు సముచితమైన స్థానం కల్పించామన్నారు. ప్రతి ఒక్కరినీ కలుపుకొని పోయేందుకే ప్రయత్నిచామని తెలిపారు.
కుటుంబ పరంగా ఫ్యామిలీ ప్లానింగ్ బావుంటుంది కానీ, రాజకీయంగా ఎంత పెద్ద కుటుంబం ఉంటే అంత మంచిదని తాము నమ్ముతున్నామని, పెద్ద కుటుంబం ఉండేందుకు ప్రయత్నం చేస్తామని, అందులోకి అందరినీ స్వాగతిస్తామని అమిత్ షా వివరించారు. పొత్తులపై పార్టీ రాజనీతి ఎలా ఉంటుందన్న ప్రశ్నకు స్పందిస్తూ.. ‘జన్‌సంఘ్ స్థాపించినప్పటి నుంచి ఇప్పటివరకు మా మౌలిక సిద్ధాంతం ఒక్కటే. ఇందులో ఎలాంటి మార్పు లేదు. ఒకవేళ భవిష్యత్తులో మా సిద్ధాంతంలో మార్పులు వస్తే దానికి సరిపోయే వాళ్లు మాత్రమే మాతో వస్తారు, వారందరినీ స్వాగతిస్తాం’అని అమిత్ షా స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment