సాక్షి, విజయవాడ: ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిలకు బిగ్ షాక్ తగిలింది. షర్మిల నాయకత్వంపై ఏపీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్స్ సుంకర పద్మశ్రీ, రాకేష్ రెడ్డిలు ఏఐసీసీకి ఫిర్యాదు చేశారు. దీంతో, ఏపీ కాంగ్రెస్‌లో ముసలం చోటుచేసుకుంది.
కాగా, ఫిర్యాదులో భాగంగా కాంగ్రెస్ నేతలు..‘ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో అసెంబ్లీ, లోక్‌సభ అభ్యర్థుల ఎన్నిక పారదర్శకంగా జరగలేదు. ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల, అనుచరగణం అభ్యర్థుల ఎంపికలో క్విడ్ ప్రోకో మాదిరిగా వ్యవహరించారు. వీరి పోకడల కారణంగా కాంగ్రెస్ పార్టీపై ఎన్నికల్లో తీవ్ర ప్రభావం పడింది. అభ్యర్థులకు కాంగ్రెస్ అధిష్టానం అందించిన నిధులు సైతం గోల్ మాల్ అయ్యాయి. అధిష్టానం షర్మిలని ఏపీ కాంగ్రెస్ చీఫ్‌గా నియమించినపుడు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తారని చాలా నమ్మకం పెట్టుకున్నాం.
కానీ, ఆమె సొంత నిర్ణయాలు తీసుకుంటూ ఒంటెద్దు పోకడలకు పోయి పార్టీకి నష్టం చేకూర్చారు. సమర్థులైన వారికి అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో అవకాశం ఇవ్వలేదు. షర్మిల అవగాహన రాహిత్యం కాంగ్రెస్ పార్టీ కేడర్, నాయకులను నిరాశ, నిస్పృహలకు గురిచేసింది. తెలంగాణకు చెందిన షర్మిలకి చెందిన కొందరు అనుయాయులు ఏపీ కాంగ్రెస్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల అభ్యర్థుల టికెట్ అంశాల్లో జోక్యం చేసుకున్నారు. డబ్బులు ఇచ్చిన వారికి బీ ఫామ్స్ కేటాయించారు. సీడబ్ల్యూసీ మెంబర్స్, సీనియర్ నాయకులు, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్స్, డీసీసీ ప్రెసిడెంట్స్ సూచనలను షర్మిల పరిగణనలోకి తీసుకోలేదు’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
మరోవైపు.. తాజాగా షర్మిల మరో కీలక నిర్ణయం ప్రకటించారు. పార్టీలో కొనసాగుతున్న అన్ని కమిటీలను రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. త్వరలోనే పార్టీ కమిటీలను తిరిగి ఏర్పాటు చేస్తామని షర్మిల స్పష్టం చేశారు. షర్మిల నిర్ణయం ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment