
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ బీజేపీ అసమ్మతి నేతలపై పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మురళీధరన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ అంతర్గత విషయాలపై రచ్చకెక్కొద్దని వార్నింగ్ ఇచ్చారు. పార్టీ వ్యవహారాలపై చర్చించాలనుకుంటే ఇద్దరు ముగ్గురు రావాలిగానీ.. ఇంతమంది ఢిల్లీకి ఎందుకొచ్చారని ప్రశ్నించారు. గురువారం ఢిల్లీకి వచ్చిన ఏపీ బీజేపీ ద్వితీయ శ్రేణి నాయకులతో 20 నిమిషాల పాటు మురళీధరన్ మాట్లాడి పంపించారు.
తాను రాష్ట్రానికి వచ్చినప్పుడు కలవాలని, పార్టీ వ్యవహారాలపై సమీక్ష అప్పుడే చేద్దామని వారికి సూచించారు. పార్టీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు జిల్లా అధ్యక్షులను మార్చే సందర్భంలో, ఆయా జిల్లాల్లోని సీనియర్ నాయకులను ఏమాత్రం సంప్రదించడం లేదని, రాత్రికి రాత్రే మార్చారని నాయకులు ఈ సందర్భంగా ఫిర్యాదు చేశారు.
మురళీధరన్‌తో భేటీ అనంతరం ఏపీ బీజేపీ నేతలు తుమ్మల అంజిబాబు, బాలకోటేశ్వరరావులు మీడియాతో మాట్లాడుతూ సోము వీర్రాజు సీనియర్లను సంప్రదించకుండా మనస్తాపం చెందేలా కొన్ని నిర్ణయాలు తీసుకున్న కారణంగానే ఢిల్లీకి వచ్చినట్టు తెలిపారు. నాయకత్వ మార్పు విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని మురళీధరన్ చెప్పినట్టు తెలిపారు.
చదవండి: నా వాంగ్మూలాన్ని సీబీఐ వక్రీకరించింది: పులివెందుల మాజీ ఎంపీటీసీ శశికళ
Comments
Please login to add a commentAdd a comment