ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది.
చీకూ చింతా లేకుండా జీవిస్తున్నా..
గోడలకు రంగులు వేయడం నా వృత్తి. నాకు ఇద్దరు అమ్మాయిలు. వారిద్దరికీ పెళ్లిళ్లు అయిపోయాయి. శ్రీకాకుళం సమీపంలోని కాజీపేటకు చెందిన నాది దినసరి కూలీ బతుకు. రెక్కాడితేగానీ డొక్కాడదు. ఉన్నదాంట్లో ఎలాగోలా నెట్టుకొస్తున్న తరుణంలో నా భార్యకు ఊపిరితిత్తుల వ్యాధి సోకింది. ఆమెకు చికిత్స చేయించేందుకు శ్రీకాకుళం రిమ్స్‌లో చేర్చాను. ఆమెకు సహాయంగా నేనూ ఆస్పత్రిలోనే ఉండేవాడ్ని. ఇంతలో డిసెంబర్ 28వ తేదీన ఒక్కసారిగా గుండె నొప్పి వచ్చింది. వెంటనే ఆస్పత్రిలో వైద్యులు నన్ను పరీక్షించి స్ట్రోక్ వచ్చిందని చెప్పారు. ఆరోగ్యశ్రీ కార్డు ఉండడంతో సమీపంలోని కిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆపరేషన్ చేస్తుండగానే మరోసారి స్ట్రోక్ వచ్చింది. అయినా ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేశారు. సుమారు రూ.3 లక్షల వరకు ఖర్చయింది. ఆ మొత్తాన్ని ప్రభుత్వమే భరించింది. విశ్రాంతి సమయంలో ఆసరాగా రూ.10 వేల వరకు డబ్బులు జమ చేశారు. నా భార్య కన్ను మూసింది. ఒంటరిగానే ఉంటున్న నాకు వృద్ధాప్య పింఛన్ వస్తోంది. రేషన్‌కార్డు ఉండటంతో బియ్యం, పప్పు ఉచితంగా వస్తున్నాయి. ఇంకా నెలనెలా అవసరమైన మందులు మా ఊరికే తెచ్చి ఇస్తున్నారు. ఇప్పుడు నాకు ఏ చింతా లేదు.
– సాధు మల్లేసు, కాజీపేట (బలివాడ శివప్రసాద్, విలేకరి, అరసవల్లి)
అద్దె భారం తప్పింది
మా ఆయన వెంకట నూక శివ అప్పారావు పెయింటింగ్ పని చేస్తుంటాడు. ఆయన సంపాదనతోనే కుటుంబం మొత్తం గడవాలి. పనులు ఉంటేనే ఆదాయం. లేదంటే అప్పులతోనే జీవనం. అనకాపల్లి జిల్లా మునగపాక మండలం వాడ్రాపల్లిలో ఎన్నో ఏళ్లుగా అద్దె ఇంట్లోనే కాపురం చేస్తున్నాం. ఒక్కో నెల ఆదాయం ఉండేది కాదు. అలాంటి సమయంలో అప్పు చేసి అద్డె చెల్లించాల్సి వచ్చేది. గత ప్రభుత్వ హయాంలో పలు మార్లు ఇంటి స్థలం కోసం దరఖాస్తు చేసినా ఫలితం లేక పోయింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇంటి పట్టా మంజూరు చేయాలని సచివాలయం ద్వారా దరఖాస్తు చేసుకున్నాం. వెంటనే స్థలంతోపాటు ఇల్లు నిర్మించుకునేందుకు రూ.లక్షా 80 వేలు సాయం అందించారు. దీంతో సొంతిల్లు నిర్మించుకొని గృహ ప్రవేశం చేశాం. అద్దె బాధ తప్పడంతో సంతోషంగా కుటుంబ పోషణ సాగుతోంది. మాకు ఇద్దరు సంతానం. మా బాబుకు అమ్మఒడి పథకం ద్వారా మూడు సంవత్సరాలుగా రూ.45 వేలు అందింది. మా మామ మల్లేశ్వరరావుకు వృద్ధాప్య పింఛన్ ప్రతి నెలా ఒకటో తేదీనే అందుతోంది. ఇచ్చిన హామీలన్నీ అమలు చేసిన ఏకైక సీఎం జగన్‌మోహన్‌రెడ్డి. మళ్లీ ఆయనే సీఎం కావాలని కోరుకుంటున్నాం.
– కొయిలాడ ఇందు, వాడ్రాపల్లి (వెలగా జగదీష్ కుమార్, విలేకరి, మునగపాక)
ఉన్న ఊళ్లోనే ఉపాధి దొరికింది
మాది పేద కుటుంబం. నేను బీఎస్సీ, నా భర్త శ్రీనివాసరావు ఎమ్మెస్సీ బీఈడీ పూర్తి చేశాం. ఇద్దరం నిరుద్యోగులం. నా ఇద్దరు కుమారులు ప్రభుత్వ బడిలో చదువుతున్నారు. విజయనగరం జిల్లా వంగర మండలం కొప్పర గ్రామానికి చెందిన మాకు ఇక్కడ బతుకు తెరువు లేకపోవడంతో వలస వెళ్లిపోవాలని అనుకున్నాం. ఇంతలో ముఖ్యమంత్రిగా వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు తీసుకున్నారు. ఆ తర్వాత మా కుటుంబ జీవన స్థితిగతుల్లో మార్పు వచ్చింది. వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా ఇప్పటి వరకు రూ.30 వేలు వచ్చింది. వెలుగు శాఖ ద్వారా స్త్రీనిధి రుణం రూ.2 లక్షలు, సీఐఎఫ్ రుణం రూ.1.50 లక్షలు, పీఎంఎఫ్‌ఎంఈ కింద రూ.6.90 లక్షలు తీసుకుని దాంతో మాప్‌స్టిక్స్(తుడుపు కర్రలు) యూనిట్ నెలకొల్పాం. అనంతరం మినపగుళ్లు తయారీ యంత్ర పరికర యూనిట్‌ను ఏర్పాటు చేసుకున్నాం. నా భర్త శ్రీనివాసరావు సహాయంతో రెండు రకాల యూనిట్ల ద్వారా వ్యాపారం సాగిస్తున్నాం. నెలకు రూ.30 వేల వరకు సంపాదించుకొని నిరుద్యోగాన్ని పారదోలాం. అమ్మ ఒడి పథకం కింద ఏటా రూ.15 వేలు వస్తోంది. మా అమ్మమ్మ వరహాలమ్మకు వైఎస్సార్ పింఛన్ కానుక వర్తిస్తోంది. ఇప్పుడు మేము ఆర్థిక ఇబ్బందులు లేకుండా హాయిగా ఉన్న ఊళ్లోనే జీవిస్తున్నాం. ఈ ప్రభుత్వం చేసిన సాయం మరచిపోలేం.
– లగ్గు మౌనిక, కొప్పర(తూముల మహేశ్వరరావు, విలేకరి, వంగర)
Comments
Please login to add a commentAdd a comment