ఆంధ్ర ప్రదేశ్‌లో రాజకీయాలు రోజురోజుకు దిగజారుతున్నాయి. పదిమందికి చట్టం గురించి, ప్రభుత్వ నిబంధనల గురించి, వాటిని పాటించవలసిన అవసరం గురించి చెప్పవలసిన మాజీ ముఖ్యమంత్రే ఉల్లంఘిస్తున్నారు. గతంలో పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసి, ప్రస్తుతం ప్రతిపక్ష నేతగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అనపర్తిలో చేసిన షో చూస్తే, పబ్లిసిటీ కోసం ఆయన ఏమైనా చేస్తారన్న సంగతి ఇట్టే బోధపడుతుంది. రోడ్లపై బహిరంగ సభలు వద్దని ప్రభుత్వం జీవో ఇచ్చింది. దానిపై టీడీపీ ఇప్పటికే హైకోర్టుకు వెళ్లింది. మొదట ఒక జడ్జిగారు పదిరోజుల పాటు ఆ జీవోని సస్పెండ్ చేశారు. దాన్ని ఆహో, ఓహో అని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ,ఇతర కొన్ని పార్టీల వారు మెచ్చుకున్నారు. ప్రభుత్వం ఆ జీవో ఇవ్వడం పెద్ద తప్పు అన్నట్లు ప్రచారం చేశారు.
చంద్రబాబుకు అవేవీ పట్టవు
అంతే తప్ప ఇరుకు సందులలో సభలు పెట్టుకుని ప్రజలను ఇబ్బంది పెట్టబోమని అనలేదు. తదుపరి హైకోర్టు డివిజన్ బెంచ్ ఆ జీవో సస్పెన్షన్ ను కొనసాగించడానికి నిరాకరించింది. అప్పుడు చంద్రబాబు కానీ, ఇతర నేతలు కాని షాక్‌కు గురయ్యారు. ప్లాన్ ప్రకారం ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి జరిగిన ప్రయత్నం ఈ రకంగా బెడిసికొట్టింది. అయినా చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ లు మొండికేస్తున్నారు. తాము అడ్డంగా రోడ్లపై సభలు పెట్టాల్సిందే అంటున్నారు. దానిని పోలీసులు వ్యతిరేకిస్తే రచ్చ,రచ్చ చేస్తున్నారు. అనపర్తిలో జరిగిన గలభాను చూడండి. అనపర్తి సెంటర్ లో మీటింగ్ పెట్టాల్సిందే అని చంద్రబాబు పట్టుబట్టిన తీరు చూస్తే, ఏదో విదంగా పోలీసులను రెచ్చగొట్టి, శాంతి భద్రతల సమస్యను సృష్టించాలన్న తాపత్రయమే కనిపిస్తుంది. ప్రభుత్వం ఇచ్చిన జీవోని ప్రతిపక్షంగా వ్యతిరేకించదలిస్తే తప్పు కాదు. దానికి నిరసన చెప్పవచ్చు. అందుకు ఒక పద్దతి ఉంటుంది. కాని చంద్రబాబు అవేవి తనకు పట్టవు అంటున్నారు.
కందుకూరు,గుంటూరు సభలలో పదకుండు మంది మరణించిన ఘట్టాలను ఆయన మర్చిపోవడం దురదృష్టకరం.ఈ అనుభవాల రీత్యా అయినా రోడ్లపై అందులోను ఇరుకు రోడ్లపై సభలు పెట్టి జనాన్ని మభ్య పెట్టే యత్నాలు చేయకుండా ఉంటే బాగుండేది. కానీ అది ఆయన బ్లడ్ లోనే లేదు. ఎంతసేపు క్షుద్ర రాజకీయం చేయడమే ఆయన పనిగా పెట్టుకుంటారు. అధికారం లేకపోతే ఇలాంటి అల్లర్లు, అదికారం ఉంటే, ఎవరూ ఎక్కడా నిరసనలు చెప్పడానికి వీలు లేదని తీవ్రమైన నిర్భంధాలు, ఆంక్షలు పెట్టడం ఆయనకు అలవాటే. ఉదాహరణకు విజయవాడలో ఎవరికి కనబడని చోట మాత్రమే ఆయన టైమ్‌లో ధర్నాలకు అవకాశం ఇచ్చారు.
ఆనాడు శాసించింది ఎవరు బాబు?
అమరావతి రాజధాని పల్లెల్లో ఎక్కడా ఎవరూ నిరసన తెలపడానికి వీలు లేదని ఆయన శాసించారు. ఉండవల్లి తదితర కొన్ని గ్రామాల ప్రజలు ఎన్ని రకాలుగా నిరసనలు తెలిపినా వారిపై కేసులు పెట్టారు తప్ప వారి గోడు మాత్రం వినలేదు. చివరికి ప్రభుత్వమే పంటలు తగులపెట్టే దశకు ఆ రోజుల్లో వెళ్లింది. అవే కాదు. విశాఖలో కాండిల్ ర్యాలీకి వెళ్లిన ఆనాటి ప్రతిపక్ష నేత జగన్‌ను విమానాశ్రయం రన్ వే పైనే నిలువరించి వెనక్కి పంపించిన చరిత్ర చంద్రబాబుదే. దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా, ఆయన ఇప్పుడు ప్రజాస్వామ్యం అంటూ ఊదరగొడుతున్నారు. ఆయనకు పవన్ కళ్యాణ్, రామోజీరావు వంటి వారు చిటెకలు వేస్తున్నారు.
అనపర్తి విషయానికి వస్తే చంద్రబాబు నడిరోడ్డుపై సభ పెట్టుకోవడానికి పోలీసులు అనుమతించి, ఆ తర్వాత విత్ డ్రా చేస్తే వారిదే తప్పు అవుతుంది. కాని పోలీస్ ఉన్నతాధికారి చెప్పినదాని ప్రకారం అనపర్తిలో రోడ్ పై సభ పెట్టుకోవడానికి చంద్రబాబుకు అనుమతి ఇవ్వలేదు. ప్రత్యామ్నాయంగా రెండు స్థలాలను పోలీసులు సూచించినా టీడీపీ అంగీకరించలేదు. పైగా జీవో ని ఉల్లంఘించి రోడ్డుమీదే సభ పెడతామంటూ హై డ్రామా సృష్టించారు. చంద్రబాబును పోలీసులు అడ్డగిస్తే ఆయన నడుచుకుంటూ వెళ్లారని బిల్డప్ ఇవ్వడానికి ఈనాడు చాలా తంటాలు పడింది. ఎప్పుడైనా రామోజీ ఫిలిం సిటీ వద్ద ఉద్యోగులు ఎవరైనా నిరసన తెలిపితే వారిని అణచివేసే చర్యలు చేపట్టే ఈనాడు రామోజీరావు , ఇప్పుడు ఎపిలో మాత్రం రోడ్లపై సభలు పెట్టుకోనివ్వాలని ఊదరగొడుతున్నారు.
ఎలా రెచ్చగొట్టాలా అనేది యెల్లో మీడియా ఎజెండానా?
తన సంస్థలలో సమ్మెలకు దిగితే వారిని ఉద్యోగాలనుంచి తీసివేసే రామోజీరావు ప్రభుత్వ ఉద్యోగులతో ఎలా ఆందోళనలు, సమ్మెలు చేయించాలా అని రెచ్చగొట్టే పనిలో ఉన్నారు.ఎక్కడ వీలైతే అక్కడ శాంతిభద్రతల సమస్య సృష్టించడమే తెలుగుదేశం పార్టీ, ఈనాడు, జ్యోతి ,టివి 5 మీడియా సంస్థల ఎజెండాగా ఉన్నట్లు అనిపిస్తుంది. దీనిని గమనంలోకి తీసుకునే పోలీసులు అనపర్తిలో అయినా, ఇతర చోట్ల అయినా చాలా సంయమనంగా ఉంటున్నారు. చివరికి టీడీపీ వారు చంద్రబాబు సమక్షంలోనే బస్ లపై రాళ్లు వేసే స్థితికి వెళ్లారంటే ఆ పార్టీలో క్రమశిక్షణ ఎలా ఉందో, అరాచక శక్తులు ఎలా పెరిగాయో అర్దం చేసుకోవచ్చు. గతంలో పరిటాల రవి హత్య తర్వాత జిల్లాలకు పోన్ లు చేయించి పార్టీవారితో ఆర్టిసి బస్ లను తగులబెట్టించిన చరిత్ర కూడా టీడీపీకి ఉందని చెబుతారు. అందువల్ల ఈ ఏడాది అంతా ప్రభుత్వం చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది.
అసలు ఎందుకు చంద్రబాబు నడిరోడ్లపైనే ,అది కూడా సన్నగా ఉండే రోడ్లపైనే సభలు పెట్టాలని అనుకుంటున్నారు? ఇదేమి బ్రహ్మ రహస్యం కాదు. రోడ్లమీద అయితే రెడిమేడ్ గా జనం అందుబాటులో ఉంటారు. వారంతా తన సభకే వచ్చినట్లు చెప్పుకోవచ్చు. అదే ఓపెన్ మైదానంలో అయితే జనాన్ని తరలించవలసి ఉంటుంది. దానికి బోలెడు ఖర్చు పెట్టాలి. అందుకు టీడీపీ స్థానిక నేతలు ఇష్టపడకపోవచ్చు. దీనికి బదులు ప్రజలను ఇబ్బంది పెట్టి అయినా రోడ్లపైన సభలు పెట్టుకోవాలని చంద్రబాబు,లోకేష్ లు యత్నిస్తున్నట్లుగా ఉంది.
అధికారంలో లేకపోతే ఎవరూ రూల్స్ పాటించకూడదా చంద్రబాబు?
ఇక్కడ ఇంకో సంగతి చెప్పాలి. అనపర్తిలో ఉద్రిక్తత ఏర్పడినట్లు టీడీపీ మీడియా సంస్థలు ఒక ప్రచారం చేశాయి. చంద్రబాబును పోలీసులు అడ్డుకున్నారని, వేలాది మంది టీడీపీ కార్యకర్తలు, ప్రజలు ఆయన వెంట నడుస్తున్నారని స్క్రోలింగ్ లు ,వార్త కదనాలు ప్రసారం చేసి హడావుడి చేశారు. అప్పుడు సహజంగానే ఒక సందేహం వస్తుంది. నిజంగానే వేలాది మంది చంద్రబాబు వెంట ఉండి ఉంటే, ఓపెన్ మైదానంలో సభ పెట్టుకోవడానికి ఇబ్బంది ఏముంటుందన్న డౌటు వస్తుంది! అయినా ఎదో రకంగా చంద్రబాబుకు మైలేజీ వచ్చేలా చేయాలన్న యావలో టీడీపీ మీడియా ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తోందన్న విషయం అర్ధం అవుతుంది.
నడి రోడ్డు మీద సభ పెట్టకపోతే జనం రాని పరిస్థితి తెలుగుదేశంకు ఏర్పడిందన్న సంగతిని చంద్రబాబే ఒకటికి ,రెండుసార్లు చెబుతున్నట్లుగా ఉంది. చంద్రబాబు అధికారంలో ఉంటే అందరూ రూల్స్ పాటించాలి. ఆయన అధికారంలో లేకుంటే తన మద్దతుదారులు ఎవరూ రూల్స్ పాటించగూడదు. ప్రభుత్వంపై జనం అంతా తిరుగుబాటు చేయాలి. ఇలాంటి డబుల్ గేమ్ వల్లే తెలుగుదేశం పార్టీ అప్రతిష్టపాలైంది. అయినా ఇప్పటికీ అదే రీతిలో ఆయన వ్యవహరిస్తున్నారు. ఇక్కడ ఒక సామెతను చెప్పుకోవాలి. నల్ల తోలును ఏడాది ఉతికినా రంగు మారదన్నట్లుగా, పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా, పదిహేనేళ్లుగా ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు దుష్ట బుద్ది ఎప్పటికీ మారదని అనుకోవాలి.
-హితైషి, పొలిటికల్ డెస్క్, సాక్షి డిజిటల్.
Comments
Please login to add a commentAdd a comment