ఏపీ మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు బాగా ఫ్రస్టేషన్ లో కనిపిస్తున్నారు. ఆయన తాను ఏమి మాట్లాడుతున్నారో తనకే అర్ధం అవడంలేదనిపిస్తుంది. ఆయన కొన్ని డైలాగుల వీడియోలు వింటే ఆశ్చర్యం కలుగుతుంది. అమెరికాలో ఆ దేశ పౌరులకన్నా తెలుగువారికే ఎక్కువ ఆదాయం వస్తోందట. అందుకు ఆయన చూపిన చొరవే కారణమట. సెల్ ఫోన్ రావడానికి ఆయన దోహదపడ్డారట. కాని ప్రజలు ఆ సంగతి మర్చిపోయారట. ఇలాంటి అర్దం పర్దం లేని మాటలే కాదు. పోలవరం ప్రాజెక్టును ముంచేశారని ఆయన ఆరోపించారు. విశేషం ఏమిటంటే అదే రోజు పోలవరం ప్రాజెక్టులో కీలక ఘట్టం దిగువ కాఫర్ డామ్ నిర్మాణం పూర్తి అయిందని మీడియాలో కథనం. అఫ్ కోర్స్.. తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చే ఈనాడు తదితర మీడియా సంస్థలు ఈ వార్తను కప్పిపుచ్చడానికి తంటాలు పడ్డాయి. అది వేరే విషయం.
అసత్యాలు చెబుతూ ప్రసంగించడం బాబుకే సొంతం
ఇవే కాదు. అవినీతిపై ఎన్టీఆర్‌తో పాటు చంద్రబాబు కూడా పోరాడారట. ఈ విషయం కూడా ఆయన ఏమాత్రం భేషజం లేకుండా చెబుతున్నారు. ఇలాంటి వింతలు, విడ్డూరాలు ఎన్నో చంద్రబాబు ప్రసంగాలలో కనిపిస్తాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఆయన పర్యటిస్తూ ప్రసంగాలు చేస్తున్నారు. ఆయన పర్యటన చేయడం తప్పుకాదు. సభలు పెట్టుకోవడం ఆక్షేపణీయం కాదు. కాని అసత్యాలు, అర్దసత్యాలు చెబుతూ ప్రజలను మభ్య పెట్టాలన్న ఆయన ఆలోచనే దారుణంగా ఉంటుంది.
ఇంకో సంగతి చెప్పాలి. ఆయనకాని, ఆయన కుమారుడు లోకేష్ కాని మరో ప్రచారం చేస్తున్నారు. పరిశ్రమలను రాష్ట్రం నుంచి తరిమేస్తున్నారన్నది వారి ఆరోపణ.అదే టైమ్‌లో వైఎస్సార్‌జిల్లా జమ్మలమడుగులో 8800 కోట్ల రూపాయల వ్యయంతో జిందాల్ ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ ను ఏర్పాటు చేయడానికి శంకుస్థాపన జరిగింది. ఆ సందర్భంగా జిందాల్ ముఖ్యమంత్రి జగన్ ఎంత బాగా మెచ్చుకుంది అంతా విన్నాం.
అదే చంద్రబాబును ఎవరైనా పొగిడితే బానర్‌లు కట్టే ఈనాడు తదితర మీడియాలకు ఆ మాటలు వినడం ఇబ్బందిగానే ఉండవచ్చు. అలాగే ముఖ్యమంత్రి జగన్ తన బాబాయిని బాత్ రూమ్ లో చంపించారన్నంత నీచమైన ఆరోపణ చేయడానికి కూడా ఆయన వెనుకాడలేదు. అందులో లేశమంత వాస్తవం లేదు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జరిగిన ఈ హత్య కేసులో జగన్ పై ఎలాంటి సందేహం వ్యక్తం చేయని సంగతి తెలియనిదా! జగన్పై ఆరోపణ చేస్తూ ఇటీవల ముద్రించిన పిచ్చి పుస్తకంపై అది తెలుగుదేశం ముద్రణ అని, చంద్రబాబే వేయించారని ధైర్యంగా ఎందుకు ప్రచురించలేకపోయారు.
దీనిని బట్టి ఏమి అర్ధం అవుతుంది. చంద్రబాబు ఎలాంటి నీచ స్థాయికి దిగజారడానికి వెనుకాడరని తెలియడం లేదా! తనపై కేసులు వస్తే అవన్ని అక్రమం అని ప్రచారం చేస్తారు. అదే ఎదుటివారిపై ఆయనే ఆరోపణ చేసి, కేసులు పెట్టిస్తుంటారు. ప్రత్యర్ధుల వ్యక్తిత్వాన్ని కించపరచడం ద్వారా తాను ఎదగాలని చంద్రబాబు యత్నిస్తారు. ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖరరెడ్డి, జగన్ లపై అదే ప్రయోగం చేశారు. అప్పట్లో రాజశేఖరరెడ్డి ఒక మాట చెప్పేవారు. తనపై చంద్రబాబు టైమ్ లో పనికిమాలిన కేసులు పెట్టారని, పార్టీ బానర్ కట్టారని, ఏదో రూలు ఉల్లంఘన చేశానని..ఇలా 29 కేసులు పెట్టి, తనను నేరాలు చేసే వ్యక్తిగా చంద్రబాబు ప్రొజెక్టు చేశారని ఆయన అనేవారు. ఆ 29 కేసులను కోర్టులు కొట్టివేశాయి. అన్ని కేసులు పోయాక ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఆ క్లిప్పింగ్ తనది కాదని చంద్రబాబు చెప్పగలరా!
చంద్రబాబు అవినీతిపై పోరాటంలో ఎన్టీఆర్ తనను తాను కలుపుకోవడం మరో వింత. పాపం.. ఎన్టీఆర్.చనిపోయి ఎక్కడ ఉన్నారో కాని, ఈ మాట విని ఉంటే, ఇప్పుడు ఆత్మహత్య చేసుకునేవారేమో! స్వయంగా ఎన్టీఆర్.తన అల్లుడు చంద్రబాబు నాయుడు ఎంత దారుణమైన వ్యక్తో వీడియోలోనే చెప్పారు కదా! ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి తన ప్రభుత్వాన్ని కూల్చారని ఎన్టీఆరే ఆరోపించారు. అప్పుడేమి ఖర్మ.. 2014 లో మరోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత వైసీపీ ఎమ్మెల్యేలు 23 మందిని కొనుగోలు చేసి, ఇప్పుడు తాను కూడా స్వచ్చమైన వ్యక్తిని అన్నట్లు పిక్చర్ ఇచ్చుకునే ప్రయత్నం చేయడానికి ఎంత ధైర్యం ఉండాలి.
ఆయన ఏమైనా చేయగలరు. ఇవన్నికాదు. ఓటుకు నోటు కేసులో ఏభై లక్షలు ఇస్తూ అప్పట్లో టిడిపిలో ఉన్న రేవంత్ రెడ్డి పట్టుబడ్డ తర్వాత మనవాళ్లు బ్రీఫ్ డ్ మి అన్న ఆడియో క్లిప్పింగ్ తనది కాదని చెప్పగలరా! చంద్రబాబు ఆస్తులపై సిబిఐ విచారణ చేయడానికి హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలపై స్టే తెచ్చుకోవడానికి, ఆ తర్వాత దానిని కొట్టివేయించుకోవడానికి తాపత్రయపడ్డారే కానీ, ధైర్యంగా తాను విచారణ ఎదుర్కుంటానని ఎందుకు చెప్పలేకపోయారు.
అ కేసులను ముందుకెళ్లకుండా చేసిన చరిత్ర ఎవరిది?
తన పీఏ ఇంటిలో సోదాలు జరిపిన ఆదాయపన్ను శాఖ రెండువేల కోట్ల రూపాయల మేర అక్రమ లావాదేవీలు జరిగాయని సీబీటీడీ ప్రకటన చేసింది అసత్యమా! స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లో 221కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ప్రభుత్వం వెల్లడించింది. అమరావతి రాజధానిలో ఎంత అవినీతి జరిగిందో ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా ఒక్కదానిని కూడా ముందుకు వెళ్లకుండా చేసిన చరిత్ర ఎవరిది? అస్సైన్డ్ భూముల స్కామ్ కు సంబంధించి ఆయనపై కేసు నమోదు అయింది కదా! అయినా తాను సత్యవంతుడనని చెప్పుకోగలగడం ఆయనకే చెల్లింది. ముఖ్యమంత్రిని ఉద్దేశించి దరిద్రం వంటి పదాలు వాడడం ఆయన సీనియారిటీకి తగునా! ఆ వెంటనే మాజీ మంత్రి కన్నబాబు ఏమన్నారు.. రాష్ట్రానికి పట్టిన దరిద్రం చంద్రబాబే అని విమర్శించారు కదా? అనడం ఎందుకు అనిపించుకోవడం ఎందుకు? ఆయన కుమారుడు లోకేష్ మరీ ఘోరంగా మాట్లాడుతున్నారు. తన తల్లిని అవమానించారంటూ లేని విషయాన్ని ప్రొజెక్టు చేసుకునే యత్నం చేసిన ఆయన వేరే పార్టీ మహిళలను ఉద్దేశించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడి ,ఎదురు తిట్టించుకున్నారు.
ఆ సంగతి మరిస్తే ఎలా లోకేష్?
వైసీపీ మహిళలు ఆయన బొమ్మ ఉన్న ప్లెక్సీని చీపుళ్లతో కొట్టారు. ఇదంతా అవసరమా! మంత్రి రోజాను ఉద్దేశించి డైమండ్ పాప, జబర్దస్త్ ఆంటీ అనడంలో ఆంతర్యం ఏమిటి? దానితో మండిన రోజా ఏమన్నారు. లోకేష్ భార్య బ్రాహ్మణిని హెరిటేజ్ పాప అని, తల్లి భువనేశ్వరిని హెరిటేజ్ ఆంటీ అని అంటామని ధ్వజమెత్తారు. తన ఇంటిలోను మహిళలు ఉన్న విషయాన్ని విస్మరిస్తే ఇలాగే ఉంటుంది. లేకుంటే తన ఇంటిలోని వారిని అంటే అన్నారులే అని సరిపెట్టుకుంటే మనం ఏమి చేయలేం.
ఇక్కడ ఇంకో సంగతి చెప్పాలి. గతంలో లోకేష్ మరీ కుర్రాడుగా ఉన్నప్పుడు కొందరు యువతులతో ఆయన విలాసవంతంగా గడిపిన సన్నివేశాలను జనం మర్చిపోయారని ఎలా అనుకుంటారు. తనవైపు లోపాలు ఉన్నప్పుడు ఎదుటివారిపై రాళ్లు వేయవచ్చా!. అద్దాలమేడలో ఉండి రాళ్లు వేస్తే ఏమవుతుందో, ఇప్పుడు లోకేష్‌కు అదే అనుభవం ఎదురైంది కదా! విధానాలపైన, తాము అధికారంలోకి వస్తే చేయదలచిన కార్యక్రమాల గురించి చెప్పుకుంటే ఎవరైనా గౌరవిస్తారు కాని.. నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఏమి విలువ ఉంటుంది. చంద్రబాబు, లోకేష్‌లు ఇద్దరికి ఈ మాట వర్తిస్తుంది. ఈ ఏడాది అంతా చంద్రబాబు, లోకేష్‌లు ఇలాగే మాట్లాడాలని నిర్ణయించుకుంటే చేయగలిగింది ఏమీ లేదు. తలుపుచెక్కతో ఎదుటివారిని ఏమైనా చేయదలిస్తే వారు తమల పాకుతో బదులు ఇవ్వరు కదా! వారు తలుపు చెక్కే వాడతారు అన్న సంగతి గుర్తుంచుకోవాలి.
-హితైషి, పొలిటికల్ డెస్క్, సాక్షి డిజిటల్.
Comments
Please login to add a commentAdd a comment