తెలుగు రాష్ట్రాలలో జరుగుతున్న పాదయాత్రలు ఎంతవరకు ఫలితాలు ఇస్తాయన్నది చర్చనీయాంశంగా ఉంది. పాదయాత్రలను సఫలం చేయడం కోసం, ప్రజలను , కనీసం తమ పార్టీ కార్యకర్తలను ఉత్సాహపరచడం కోసం వారు చేస్తున్న తీవ్ర వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయి. తెలంగాణలో ఈ పాదయాత్రలు పోటాపోటీగా సాగుతుంటే, ఆంద్రప్రదేశ్‌లో ఒక పాదయాత్ర జరుగుతోంది. తెలంగాణ కాంగ్రెస్ అద్యక్షుడు రేవంత్ రెడ్డి కాని, ఏపీలో టీడీపీ నేత మాజీ మంత్రి లోకేష్ కానీ పదజాలం వాడడంలో బ్యాలెన్స్ కోల్పోతున్నారు.
రేవంత్ పార్లమెంటరీ నియోజకవర్గాల వారిగా పాదయాత్ర చేస్తున్నారు. మహబూబాబాద్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో యాత్ర సాగిస్తున్న సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్య పూర్తిగా ఆక్షేపణీయం. ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారిక నివాసం ప్రగతి భవన్‌ను పేల్చేయాలని ఆయన మావోయిస్టు భాష మాట్లాడడంపై అధికార బీఆర్‌ఎస్ మండి పడింది.
ఆయనపై పిడి చట్టం పెట్టి అరెస్టు చేయాలని కూడా డిమాండ్ చేసింది. రేవంత్ పొరపాటున ఈ మాట అని ఉంటే వెంటనే సరిచేసుకునేవారు. కాని ఆయన కావాలనే ప్రగతి భవన్‌ను పేల్చివేయాలని అన్నారని అర్ధం అవుతుంది. ఎందుకంటే దానిని సమర్ధించుకుంటూ తన ఉద్దేశాన్ని వివరిస్తున్నారు. ప్రగతి భవన్ లోకి ప్రజలను రానివ్వడం లేదని, ఎంపీలు ఎమ్మెల్యేలను అనుమతించడం లేదని అలాంటి ప్రగతి భవన్ ఉంటే ఏమిటి?లేకుంటే ఏమిటి అని ప్రశ్నించారు. రైతుల రుణమాఫీ చేయలేదని, నిరుధ్యోగ బృతి హామీని నెరవేర్చలేదని ఇలా పలు కారణాలు ఆయన చెబుతున్నారు. రాజకీయంగా ఎలాంటి విమర్శలు చేసినా తప్పులేదు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల మానిఫెస్టోలో చేసిన వాగ్దానాలను అమలు చేయకపోతే ప్రశ్నించవచ్చు.అలాకాకుండా ఏకంగా ప్రభుత్వ భవనాన్ని పేల్చి వేస్తామని అనడం రేవంత్ రెడ్డి నోటి దురుసుతనానికి నిదర్శనం అవుతుంది. గతంలో కూడా ఆయన ఇలాగే ముఖ్యమంత్రిపై నోరు పారేసుకున్నారు. ఆయన మరో మాట కూడా అన్నారు. 2000 సంవత్సరం నాటికి కేసీఆర్ కుటుంబం రబ్బరు చెప్పులతో ఉందని , ఇప్పుడు కోట్లకు పడగలెత్తిందని ఆయన ఆరోపించారు. అది వాస్తవం కాదు. 1985 నుంచే కేసీఆర్ సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నారు. వరసగా ఓటమి లేకుండా గెలుస్తూ వస్తున్నారు. మంత్రి పదవి నిర్వహించారు.
2000 తర్వాత సొంతంగా పార్టీ పెట్టుకున్నారు. కాంగ్రెస్ తో సహా అనేక పార్టీలను తనదారిలోకి తెచ్చుకున్నారు. తెలంగాణ సాధనలో ఆయన అత్యంత ప్రముఖ పాత్ర పోషించి రాష్ట్రాన్ని సాదించిన నేతగా గుర్తింపు పొందారు. తొమ్మిదేళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్న నేతపై రాజకీయ విమర్శలు చేయవచ్చుకాని, వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం సరికాదు. ఒకవేళ ఏవైనా ఆరోపణలు చేయదలిస్తే నిర్దిష్ట ఆధారాలతో చేయాలి. రేవంత్ రెడ్డి ఒక రకంగా ప్రస్టేషన్ లో ఉన్నారని చెప్పాలి. ఆయన పిసిసి అధ్యక్షుడు అయ్యాక జరిగిన ఉప ఎన్నికలలో సైతం కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ కోల్పోయింది.బిజెపి రెండో స్థానంలో ఉంటోంది.
ఒకప్పుడు కాంగ్రెస్‌కు గట్టి బేస్ ఉన్న తెలంగాణలో ఈ పరిస్థితి ఊహించనిదే. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ ఉనికిని నిలబెట్టుకోవడానికి, అలాగే ప్రజలలో మళ్లీ ఆదరణ పొందడానికి రేవంత్ నానా పాట్లు పడుతున్నారు. ఒకపక్క కాంగ్రెస్ లో వర్గ కలహాలు, మరోవైపు కాంగ్రెస్ నానాటికి దెబ్బతింటున్నదేమోనన్న ప్రచారం నేపద్యంలో ఆయన తొందరపాటుగా మాట్లాడుతున్నారు. రేవంత్ మాటలకు వ్యతిరేకంగా బీఆర్‌ఎస్ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు ఏమి చేస్తారన్నది పక్కనబెడితే మంత్రి కెటిఆర్ అడిగినట్లు ప్రగతి భవన్ ను పేల్చడం కాంగ్రెస్ విధానమా అంటే దానికి పార్టీ నేతలు జవాబు ఇవ్వలేకపోయారు. జానారెడ్డి, మల్లు భట్టి వంటివారు దీనిని ఆమోదిస్తారా అని కెటిఆర్ ,హరీష్ రావు ఇతర నేతలు ప్రశ్నిస్తున్నారు. మాటల దాడి చేయడం అన్నిసార్లు కలిసిరాకపోవచ్చు. అది అర్ధవంతమైనది అయితే ఫర్వాలేదు కాని, హింసను ప్రేరేపించేదిలా ఉంటే అది పార్టీకి నష్టం జరుగుతుంది. జాతీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్ కు ఒక పెద్ద సమస్య అవుతుంది. దానిని రేవంత్ గుర్తుంచుకుని డైలాగులు వదలితే మంచిదని చెప్పాలి.
ఇక ఆంధ్ర ప్రదేశ్ లో లోకేష్ చేస్తున్న పాదయాత్ర నిత్యం వివాదాస్పదం అవుతోంది. నిబంధనలకు విరుద్దంగా రోడ్లపై సభలు నిర్వహించడమే కాకుండా, వద్దని వారించినపోలీసులపై అనుచితంగా లోకేష్ మాట్లాడుతున్నారు.ఒక సభలో లోకేష్ పోలీసులను ఉద్దేశించి వేలు చూపుతూ ,వారిని జైలుకు పంపుతానని హెచ్చరించారు. ఇది ఏ పాటి విజ్ఞతో ఆయనే తెలుసుకోవాలి. అంతేకాదు .. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను ఎంత మాట పడితే అంత మాట మాట్లాడడం సరైన విధానం కాదు. అందులోను ఒరేయ్ అంటూ సంభోధించడం దారుణంగా ఉంది. అందువల్లే వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ సమాధానం ఇస్తూ చంద్రబాబును తాము ఒరేయ్ అంటే ఒప్పుకుంటారా అని ప్రశ్నించారు.
ఇరువైపులా ఇలాంటి విషయాలలో సంయమనంగా ఉండాల్సిన అవసరం ఉంది. లోకేష్ కు ఉనికి సమస్య ఎదురుఅవుతోంది. ఆయన పాదయాత్రకు జనం పెద్దగా రావడం లేదన్న బాధ ఉండవచ్చు. దానికి తోడు పార్టీ ఏపీ అద్యక్షుడు అచ్చెన్నాయుడు గంగాధర నెల్లూరు నియోజకవర్గ టీడీపీ నేత ఒకరితో మాట్లాడిన ఆడియో లీక్ అయింది. అందులో కొన్ని చోట్ల లోకేష్ పాదయాత్రకు జనం లేకపోవడాన్ని ఆయన ప్రస్తావించి చంద్రబాబు బాదపడ్డారని చెప్పారు.
అందుకు ప్రత్యామ్నాయంగా ఎలా జనాన్ని పోగు చేయాలో, వాహనాలలో ఎలా చేరవేయాలో వారు చర్చించుకున్నారు. లోకేష్ ముందుగా తన తెలుగు పరిజ్ఞానాన్ని పెంచుకుని, ఆ తర్వాత మంచి భాషతో ప్రసంగాలు చేయడం నేర్చుకుంటే ఆయనకు ఉపయోగం ఉంటే ఉండవచ్చేమో కాని, ఇప్పుడు మాదిరి ఏది పడితే అది మాట్లాడితే ఆయనకే నష్టం.
తెలంగాణలో వైఎస్ ఆర్ టిపి నేత షర్మిల, బిజెపి అద్యక్షుడు బండి సంజయ్ లు కూడా పాదయాత్రలు సాగిస్తూ ఘాటైన ప్రసంగాలు చేస్తున్నారు. ఎవరికి వారు ప్రజలను ఆకట్టుకోవడానికి ఒక్కోసారి పరిధులు దాటుతున్నారన్న భావన కూడా లేకపోలేదు. ఏది ఏమైనా నేతలు మరీ రెచ్చిపోకుండా మాట్లాడితే మంచిదని చెప్పాలి. కాని ఇది అత్యాశే అవుతుందా!
కొసమెరుపు ఏమిటంటే టీడీపీ నేత జెసి దివాకరరెడ్డి తెలంగాణలో కాంగ్రెస్ శాసనసభ పక్ష కార్యాలయానికి వెళ్లి పాదయాత్రల వల్ల ప్రయోజనం లేదని, ఆ రోజులు పోయాయని వ్యాఖ్యానించారు. అటు రేవంత్‌కు ఇటు లోకేష్‌కు దివాకరరెడ్డి ఈ సందేశం ఇస్తున్నారా!
-హితైషి, పొలిటికల్ డెస్క్, సాక్షి డిజిటల్.
Comments
Please login to add a commentAdd a comment