ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం మీడియా అకృత్య ఆగడాలకు అంతులేకుండా పోతోంది. టీడీపీ కన్నా వీరికి ఎక్కువ ప్రస్టేషన్ వస్తోంది. ముఖ్యమంత్రి జగన్‌కు వ్యతిరేకంగా ఏదో ఒక కథనం రాయాలా అన్న ఆతృతలో ఉచ్చనీచాలు మర్చిపోతున్నారు. టీడీపీ మీడియాలుగా ఉన్న ఈనాడు, ఆంద్రజ్యోతి ఈ విషయంలో పోటీ పడుతున్నాయి. ఒకరోజు ఒక మీడియా బట్టలూడదీసుకుని నిస్సిగ్గుగా తిరుగుతుంటే మరో రోజు ఇంకో మీడియా అదే పనిలో ఉంటోంది. కొద్ది రోజుల క్రితం ఆంద్రజ్యోతిలో వచ్చిన రెండు కథనాలు చూస్తే మతిపోతుంది. వీళ్ల కల్పితాలకు ఆకాశమే హద్దుగా కనిపిస్తుంది. అదేదో దేశం సియార్రా లియోన్ ఉందట. అక్కడ అరాచకం తాండవిస్తోందట.
ప్రజలను ఏదో రకంగా తప్పుదోవ పట్టించే యత్నం
ఆ దేశానికి ఏపీని పోలిక పెట్టి ఒక చెత్త కథనం రాశారు. ఏదైనా రాష్ట్రంలో నిజంగానే అరాచకం ఏర్పడితే కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటుందా!గతంలో బాబ్రి మసీదును కూల్చిన తర్వాత తీవ్రమైన అశాంతి ఏర్పడితే ఆనాటి పీవీ నరసింహారావు ప్రభుత్వం నాలుగు బీజేపీ పాలిత రాష్ట్రాలలోని ప్రభుత్వాలను రద్దు చేసి రాష్ట్రపతి పాలనను పెట్టింది. ఏపీలో గతంలో జై ఆంద్ర ఉద్యమం వచ్చినప్పుడు తీవ్రమైన హింస ప్రజ్వరిల్లగా, అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న పీవీ నరసింహారావు ప్రభుత్వాన్ని తప్పించి, శాసనసభను తాత్కాలికంగా సస్పెండ్ చేసి రాష్ట్రపతి పాలన పెట్టారు. ఆ మాత్రం తెలియకుండా పనికిమాలిన రాతలు రాసి ఆ పత్రిక ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూస్తోంది.
తెలంగాణలో ఒకలా.. ఏపీలో మరొకలా!
నిజానికి ఏపీలో ప్రశాంత వాతావరణం ఉంది. ఎక్కడైనా ఒకటి, అర ఘటనలు జరగవచ్చు. తెలంగాణలో ఈ మధ్యకాలంలో జరిగిన విద్యార్దినుల ఆత్మహత్యలు కాని, కుక్కల బెడద వంటివి కానీ ఏపీలో జరిగి ఉంటే ఈపాటికి ఈ మీడియాతో పాటు, టీడీపీ, జనసేన తదితర పక్షాలు ఎంతో అలజడి చేసేవి. తెలంగాణలో కుక్కల కాట్లకు పలు చోట్ల అనేక మంది గాయపడితే ఈనాడు తన వార్తలలో కానీ, సంపాదకీయంలో కాని ప్రభుత్వాన్ని తప్పు పట్టలేదు. అధికారులు సరిగా చేయడం లేదని రాసింది. అదే ఏపీలో జరిగి ఉంటే వాటన్నిటికి ముఖ్యమంత్రి జగనే కారణమని విరుచుకుపడేవి. జనసేన అదినేత పవన్ కళ్యాణ్ ఏపీలో గతంలో జరిగిన ఒక విద్యార్ది ఆత్మహత్య ఘటనకు ప్రభుత్వానికి బాధత అంటగట్టి స్టేట్ మెంట్ ఇచ్చారు. అదే తెలంగాణలో జరిగితే ప్రభుత్వం జోలికి పోకుండా సాదాసీదాగా హితబోధతో కూడిన ప్రకటన ఇచ్చారు.
అంధ జ్యోతిగా ఆంధ్రజ్యోతి
కేసీఆర్ ప్రభుత్వం అంటే ఈనాడు ఎంతగా భయపడుతోందో, సీఎంను ఏ రకంగా కాకా పడుతోందో తెలుసుకోవడానికి అనేక ఉదాహరణలు కనిపిస్తాయి. కేసీఆర్ ప్రభుత్వంపై అడ్డగోలుగా రాయాలని అనడం లేదు. ఏపీలో అవాంఛనీయ ఘటనలు జరిగితే వెంటనే పోలీసు యంత్రాంగం స్పందించి కేసులు పెట్టడం, అరెస్టులు చేయడం వంటివి చేస్తోంది. ఏ ప్రభుత్వం ఉన్నా ఆ మేరకు జాగ్రత్తలు తీసుకుంటారు. ఆంధ్రజ్యోతి అంధజ్యోతిగా మారి ఒక దేశంతో ఏపీని పోల్చి వార్తలు రాయగలిగిందంటే ఎంత స్వేచ్చ ఉందీ అర్దం కావడం లేదా! ముందు రోజు ఈనాడు రాసిన తరహాలో మరింత అతిగా ఆలోచించి ఏదో దేశంలో జరిగే గొడవలను ఏపీకి పోల్చి ఆత్మవంచన చేసుకుంది.
సహజ వనరుల దోపిడీ, ప్రైవేటు సైన్యం, నిత్యం దాడులు ఆ దేశంలో జరుగుతుంటాయని, ఎపిలో కూడా అటు,ఇటూగా అదే పరిస్థితి అని చండాలంగా కధనాన్ని వండి వార్చారు. మరో వార్త కూడా ఇచ్చారు. అదేమంటే ఎపికి కేంద్రం ఉదారంగా అప్పులు మంజూరు చేస్తోందట. ఒక పక్క ప్రదానమంత్రి శ్రీలంక, పాకిస్తాన్ ల గురించి హెచ్చరిస్తూ ఎపికి ఎలా అప్పులు ఇస్తారని ఈ పత్రిక ప్రశ్నిస్తోంది. ఎపి పై ఎంత ఏడుపో చూడండి. విద్యుత్ సంస్కరణలు అమలు చేస్తే కేంద్రం ఏ రాష్ట్రానికి అయినా ప్రత్యేక రుణపరిమితి ఇస్తోంది. దానిని ఏపీ వాడుకుంటోంది.
అసలు సంస్కరణలు అమలుకాకుండా, మోటార్లకు మీటర్లు పెట్టవద్దంటూ పనికిమాలిన వాదనను తెలుగుదేశం, అనుబంధ మీడియా ప్రచారం చేశాయి. మీటర్లు పెడితే ఉరితాడే అంటూ దారుణమైన అసత్యాన్ని చెప్పి ప్రజలను భయపెట్టాలని చూశాయి. దానికి కారణం ఆ సంస్కరణలు అమలు అయితే ఎపికి కేంద్రం ఆర్దికంగా సాయపడుతుందనే బాధతోనే అన్న సంగతి ఇప్పుడు ఇచ్చిన ఏడుపుగొట్టువార్తతో తేలిపోయింది. గతంలో ఇదే చంద్రబాబు నాయుడు విద్యుత్ సంస్కరణలు తెచ్చినప్పుడు ఆయనకాబట్టి సంస్కరణలు తెచ్చి రాష్ట్రాన్ని బాగు చేస్తున్నారని ఈ మీడియా డబ్బా కొట్టింది.
చంద్రబాబుకు చిడతలు వాయించడమే పని
చంద్రబాబు అయితే తానే విద్యుత్ సంస్కరణలు తెచ్చానని,తద్వారా వచ్చిన ఆదాతో పేదలను ఆదుకుంటానని అనేవారు. ఇప్పుడు అదే చంద్రబాబు మీటర్లను వ్యతిరేకించడం ద్వారా తన డొల్లతనాన్ని బయటపెట్టుకుంటే, ఈనాడు, ఆంద్రజ్యోతి వంటి మీడియాలు ఆయన పాడిన పాటకల్లా చిడతలు వాయించి అప్రతిష్టపాలయ్యాయి. జగన్ ప్రభుత్వం వీరిని పట్టించుకోలేదు కాబట్టి సరిపోయింది కాని, వీరు చేసే ప్రతి దారుణమైన ప్రచారానికి భయపడితే అడుగు ముందుకు పడేది కాదు. పిల్లలకు ప్రభుత్వ స్కూళ్లలో ఆంగ్ల మీడియం ప్రవేశపెట్టిన కార్యక్రమం నుంచి ,రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకువచ్చే కార్యక్రమం వరకు వీరు అడ్డుపుల్ల వేయడమే పనిగా పెట్టుకున్నారు.
దీనివల్ల ఏపీకి జరిగే నష్టం ఇంతా అంతా కాదు.. ప్రతి దానిపై హైకోర్టుకు వెళ్లడం, ప్రభుత్వాన్ని వేరే పనిచేసుకోనివ్వకుండా ఈ వ్యాజ్యాలకు సమాధానం ఇచ్చేలా చేయడం, హైకోర్టులో కొందరు గౌరవ న్యాయమూర్తులు చేసే వ్యతిరేక వ్యాఖ్యలను మొదటి పేజీలో ప్రముఖంగా ఇచ్చి ఏదో జరిగిపోతోందన్న భ్రమ కల్పించడం చేస్తున్నారు. తాజాగా వలంటీర్ల వ్యవస్థపై పడినట్లుగా ఉన్నారు. ప్రజలకు అత్యధికంగా ఉపయోగపడుతున్న ఈ వలంటీర్ల వ్యవస్థను అడ్డుకోకపోతే తెలుగుదేశం గెలవదని భయపడుతున్నారేమో తెలియదు కాని, ఆ వ్యవస్థ వచ్చిన మూడు సంవత్సరాల తర్వాత పలు సందేహాలు రేకిత్తిస్తూ హైకోర్టులో పిటిషన్‌లు వేశారు.
గౌరవ న్యాయమూర్తిగారు అసలు ఈ వలంటీర్లు ఎవరు? లబ్దిదారుల ఎంపికను వారు ఎలా చేస్తారు ? ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు కదా?ఇలా కొన్ని ప్రశ్నలను తన సందేహ నివృత్తి కోసం అడిగి ఉండవచ్చు. కాని దానిని భూతద్దంలో చూపుతూ టిడిపి మీడియా మొదటి పేజీలో కదనాలు ఇచ్చింది . ఇప్పటికే కోర్టుల ద్వారా ప్రజలకు అందవలసిన మేళ్లను అందనీయకుండా చేస్తున్నారన్న అభిప్రాయం ఉన్న నేపద్యంలో టిడిపి వారు కాని, ఆ పార్టీకి మద్దతు ఇచ్చే మీడియా వారు కాని ఆ పద్దతిని మానుకోకపోతే, వారికే నష్టం అని వేరే చెప్పనవసరం లేదు. పలుమార్లు అది అనుభవం అవుతున్నా వీరు మానుకోవడం లేదు. ఏదో రకంగా ప్రజల మనసులలో విషం నింపాలన్నదే వీరి లక్ష్యం .కాని సోషల్ మీడియా, డిజిటల్ మీడియా విస్తారంగా పెరగడం తో వీరి ఆటలు అంతగా సాగడం లేదు.అయినా వీరి జిత్తుల మారి ఎత్తుగడలను ఎదుర్కోవడానికి ప్రభుత్వం సదా అప్రమత్తంగా ఉండాల్సిందే.
-హితైషి, పొలిటికల్ డెస్క్, సాక్షి డిజిటల్
Comments
Please login to add a commentAdd a comment