సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎమ్మెల్యేల ఫిరాయింపులకు సంబంధించి కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇక, కోర్టు వ్యాఖ్యలపై తాజాగా అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ స్పందించారు. ఈ క్రమంలో నిబంధనల ప్రకారం నడుచుకుంటామని కామెంట్స్ చేశారు.
కాగా, స్పీకర్ గడ్డం ప్రసాద్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యే ఫిరాయింపులకు సంబంధించి కోర్టు నాలుగు వారాల గడువు ఇచ్చింది. నిబంధనల ప్రకారం మేము నడుచుకుంటాం. పార్టీ ఫిరాయింపుల వ్యవహారం కోర్టు పరిధిలో ఉంది. నేను తీసుకునే నిర్ణయం రాబయే కాలంలో తెలుస్తుంది అంటూ కామెంట్స్ చేశారు.
మూడు పిటిషన్లపై విచారణ..
2023 నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో బీఆర్‌ఎస్ తరఫున విజయం సాధించి, తర్వాత కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావును అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇదే విధంగా ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి బీఆర్‌ఎస్ తరఫున విజయం సాధించిన దానం నాగేందర్ ఎమ్మెల్యేగా రాజీనామా చేయకుండా కాంగ్రెస్‌లో చేరారని, ఆయనను అనర్హుడిగా ప్రకటించాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి మరో పిటిషన్ వేశారు. అలాగే నాగేందర్‌ను అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించినా స్పీకర్ సమయం ఇవ్వడం లేదంటూ బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి ఇంకో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి సుదీర్ఘ విచారణ చేపట్టిన విషయం తెలిసిందే.
ఇదీ తీర్పు..
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఏప్రిల్‌లో ఒక పిటిషన్, జూలైలో ఇంకో పిటిషన్ దాఖలు చేశారు. సుదీర్ఘ విచారణ అనంతరం ఆగస్టు 10 తీర్పు రిజర్వు చేశాం. ఇప్పటివరకు అనర్హత పిటిషన్లపై ఏం నిర్ణయం తీసుకున్నారో తెలియదు. ఈ నేపథ్యంలో రిట్ పిటిషన్లలో ఉపశమనం పొందేందుకు పిటిషనర్లు అర్హులని ఈ కోర్టు అభిప్రాయపడుతోంది. స్పీకర్ కార్యాలయానికి రాజ్యాంగ హోదా, గౌరవం ఉంది. అనర్హత పిటిషన్లను వెంటనే రాష్ట్ర శాసనసభ స్పీకర్ ముందు ఉంచాలని స్పీకర్ కార్యదర్శిని ఆదేశిస్తున్నాం. ఇరుపక్షాల వాదనలు, డాక్యుమెంట్లు, వ్యక్తిగత వాదనలకు సంబంధించి నేటి నుంచి నాలుగు వారాల్లోగా షెడ్యూల్ నిర్ణయించాలి. నాలుగు వారాల్లో ఏం తేల్చకపోతే సుమోటోగా విచారణ చేపడతాం. తగిన ఆదేశాలను మేమే ఇస్తాం అని న్యాయమూర్తి జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి తీర్పు ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment