
నెల్లూరు (సెంట్రల్)/ఒంగోలు సబర్బన్: తెలుగుదేశం పార్టీలోకి వెళ్లేందుకు ముందుగానే చంద్రబాబుతో మాట్లాడుకుని వైఎస్సార్‌సీపీపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి నిందలు వేయడం సరికాదని మాజీమంత్రి, వైఎస్సార్‌సీపీ రీజినల్ కోఆర్డినేటర్ బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పారు. టీడీపీ వాళ్లతో మాట్లాడకుండా ఉంటే.. 2024లో రూరల్ నుంచి టీడీపీ తరఫున పోటీచేస్తామని ఏ విధంగా చెప్పగలవని ప్రశ్నించారు. పార్టీ మారాలనుకుంటే వెళ్లవచ్చని, కానీ సొంత పార్టీపై నిందలు వేసి వెళ్లడం సరికాదని చెప్పారు.
ఆయన మంగళవారం నెల్లూరులోను, ఒంగోలులో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి మూడురోజులుగా ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని, ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటున్నారని చెప్పారు. కానీ రుజువులు చూపడం లేదన్నారు. ఏ ఆధారం లేకుండా నిందలు వేయడం మంచి పద్ధతి కాదని పేర్కొన్నారు. మరో పార్టీ నాయకుడితో ఫోన్‌లో మాట్లాడుకుని, అది బయటకు రాగానే ఫోన్ ట్యాపింగ్ అంటారా? అని ప్రశ్నించారు.
ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఆరోపిస్తూ, మీడియాకు లీకులిస్తున్న కోటంరెడ్డి.. ట్యాపింగ్ జరుగుతోందని ఎప్పుడైనా సీఎం వైఎస్ జగన్‌కు చెప్పారా అని అడిగారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దయవల్ల రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారని గుర్తుచేశారు. ఎవరు ఉన్నా లేకున్నా పార్టీ స్ట్రాంగ్‌గా ఉందని పేర్కొన్నారు. వైఎస్సార్‌సీపీలో పార్టీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment