లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. పార్టీలు మారిన నేతలతో పలు నియోజకవర్గాల్లో మరింత హోరాహోరీగా పోటీ జరగనుంది. సీఎం యోగి ఆదిత్యనాథ్ తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగుతున్న విషయం తెలిసిందే. గోరఖ్‌పూర్ పార్లమెంట్ స్థానం నుంచి ఐదుసార్లు ఎంపీగా గెలిచిన.. ఆయన ఎమ్మెల్యేగా తన అదృష్టాన్ని తొలిసారి ఇక్కడే నుంచే పరీక్షించుకోనున్నారు.
తాజాగా అదే నియోజకవర్గం నుంచి యోగిపై పోటీకి బరిలోకి దిగుతున్నట్లు భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ గురువారం ప్రకటించారు. చంద్రశేఖర్ ఆజాద్ గతంలో సీఎం యోగిపై పోటీ చేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయన నేతృత్వంలోని ఆజాద్ సమాజ్ పార్టీ తరపున గోరఖ్‌పూర్ సదర్ స్థానంలో పోటీచేస్తున్నట్లు పేర్కొన్నారు. ‘నేను గడిచిన ఐదేళ్లలో ప్రభుత్వం వల్ల జైల్లో ఉన్న ఏకైక రాజకీయ నేతను. ప్రస్తుత ప్రభుత్వంలోని ముఖ్యమంత్రిని అసెంబ్లీలో అడుగుపెట్టనివ్వను. ఎందుకంటే ఆయనపై నేను పోటీ చేస్తున్నాను. యోగిపై వ్యతిరేకంగా గోరఖ్‌పూర్‌లో పోటీకి దిగుతున్నా’ అని చంద్రశేఖర్ ఆజాద్ తెలిపారు.
1989 నుంచి గోరఖ్‌పూర్ అసెంబ్లీ స్థానంలో బీజేపీ(అలియన్స్‌లో ఒక్కసారి) గెలుస్తూ వస్తోంది. అయితే సీట్ల కేటాయింపు సర్దుబాటు కాకపోవడంతో తమ పార్టీ సమాజ్‌వాదీ పార్టీతో జట్టుకట్టడంలేదని ఇటీవల చంద్రశేఖర్ ఆజాద్ ప్రకటించారు. ఎస్పీ తమకు 25 సీట్లు కేటాయిస్తామని చెప్పి మోసం చేసిందని ఆరోపణలు కూడా చేశారు ఆజాద్. 2017లో దళితులకు, అగ్రకులాల మధ్య చోటుచేసుకున్న అల్లర్ల ఘటనతో భీమ్ ఆర్మీ వెలుగులోకి వచ్చింది. అల్లర్ల కారణంగా చంద్రశేఖర్ ఆజాద్ జైలుకు వెళ్లి.. 2018లో బెయిల్‌పై బయటకు వచ్చారు. 2019లో భీమ్ ఆర్మీ తరపున చంద్రశేఖర్ ఆజాద్ వారణాసి పార్లమెంట్ స్థానంలో నరేంద్ర మోదీపై పోటీ చేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment