లోక్‌సభ ఎన్నికల్లో 400కు పైగా స్థానాల్లో విజయం సాధిండం ఖాయమని బీజేపీ చెప్పుకుంటున్న ప్రచారాన్ని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కొట్టిపారేశారు. కొన్ని రాష్ట్రాల్లో అసలు ఉనికిలోనే లేని బీజేపీకి 400 సీట్లు రావడం బక్వాస్(అబద్ధమని) అని అన్నారు. 400 కాదు కదా కనీసం 200 సీట్లు కూడా దాటవని అన్నారు.
అమృత్‌సర్‌లో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి బీజేపీకి సీట్లు తగ్గుతాయని అన్నారు. అదే విధంగా, కాంగ్రెస్, ఇండియా కూటమి పుంజుకుంటుందని పేర్కొన్నారు.
కాగా లోక్‌సభ ఎన్నికల్లో తమకు 400 సీట్లు వస్తాయని బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ చెబుతూ వస్తోంది. దీనిపై ఖర్గే స్పందిస్తూ... బీజేపీ చేస్తున్న వ్యాఖ్యలను ఆధారమేమిటని ప్రశ్నించారు. మీ(బీజేపీ) సీట్లు తగ్గుతున్నప్పుడు మావి(కూటమి) పెరుగుతున్నప్పుడు. 400 సీట్లు ఎలా వస్తాయి. అది పూర్తిగా అబద్దమని అన్నారు. అసలు బీజేపీ కేంద్రంలో ప్రభుత్వమే ఏర్పాటు చేయదని, ఎన్డీయే కూటమికి 200 సీట్లకు మించి రావని అన్నారు.
తమిళనాడు, కేరళ, తెలంగాణలో బీజేపీ ఉనికిలో లేదని, కర్ణాటకలో అంత బలంగా లేదని మండిపడ్డారు. మహారాష్ట్రలోనూ కాషాయం బలహీనంగా ఉందన్నారు. ఇక పశ్చిమ బెంగాల్ ఒడిశాలో గట్టి పోటీ ఉందన్న ఖర్గే.. ఆ పార్టీకి 400 సీట్లు ఎలా వస్తాయని ప్రశ్నించారు.
కేంద్ర ప్రభుత్వంలో 30 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, భారత కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత వాటన్నింటినీ భర్తీ చేస్తామని చెప్పారు. యువత డ్రగ్స్‌కు బానిసవ్వడంపై స్పందిస్తూ..దీనిని అరికట్టడానికి అనేక చర్యలు తీసుకుంటామని చెప్పారు.
కాంగ్రెస్ మేనిఫెస్టోలో ముస్లిం లీగ్ ముద్ర ఉందన్న బీజేపీ ఆరోపణలను ఖర్గే ఖండించారు. 'మోదీ కాంగ్రెస్ మేనిఫెస్టో చూడడు, చదవడు.. మందు చెప్పినం.. ఇందులో ముస్లిం లీగ్ ముద్ర కనిపిస్తే కాంగ్రెస్ కార్యాలయం నుండి ఒక వ్యక్తిని పంపింస్తాం.. ఆయనకు అది వివరించడానికి సహాయం చేస్తాడు. పార్టీ మేనిఫెస్టో యువత, రైతులు, కూలీలు, బడుగు బలహీన వర్గాల కోసమే’నని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment