ముంబై: మహారాష్ట్రలో కొద్ది నెలలుగా రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీల మహా వికాస్ అఘాడీ కూటమి ప్రభుత్వం కూలిపోయింది. శివసేన నేత ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని రెబల్ ఎమ్మెల్యేలు.. బీజేపీతో చేతులు కలపటంతో ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం పడిపోయింది. ఆ తర్వాత షిండే సీఎం పీఠం అధిరోహించారు. 2024 ఎన్నికలపై దృష్టి సారించి రాష్ట్రంలో బీజేపీ పావులు కదుపుతున్నట్లు స్పష్టమవుతోంది. ప్రస్తుతం ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కంచుకోటపై కన్నేసింది బీజేపీ. శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే ప్రాతినిధ్యం వహిస్తున్న ‘బారామతి’ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ విషయాన్ని స్వయానా.. మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రకటించారు.
‘గత ఆరు నెలలుగా 16 పార్లమెంటరీ సీట్లపై బీజేపీ దృష్టి పెట్టింది. అందులో శ్రీకాంత్ షిండే సీటు సైతం ఉంది. ప్రస్తుతం వారు మాతో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ-శివసేనలు కలిసి కూటమిగా పోటీ చేస్తాయి. మాతో ఉన్నవారు గెలిచేందుకు కృషి చేస్తాం. ఈ 16 నియోజకవర్గాల్లో బారామతి సైతం ఉంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో అక్కడ మాకు మంచి మద్దతు లభించింది. మేము గెలుపే లక్ష‍్యంగా పని చేస్తాం. ఈ 16 స్థానాల బాధ్యతలను కేంద్ర నాయకులకు అప్పగించారు. బారామతికి కేంద్ర మంత్రి నిర్మలా సీతారమన్‌ను ఇంఛార్జ్‌గా నియమించారు. సెప్టెంబర్‌లో నియోజకవర్గంలో పర్యటిస్తారు. ’ అని తెలిపారు దేవేంద్ర ఫడ్నవీస్.
ఇదీ చదవండి: సంజయ్ రౌత్‌కు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ.. ఆ వినతికి కోర్టు నో!
Comments
Please login to add a commentAdd a comment