సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పొత్తు అంశాలను పూర్తిగా పక్కనపెట్టి.. మన పార్టీని సొంతంగా ఎలా బలోపేతం చేసుకోవాలన్న అంశంపైనే దృష్టిపెట్టి నేతలందరూ పనిచేయాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పార్టీ రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం చేశారు. పొత్తుల గురించి ఇప్పుడు ఏ మాత్రం పట్టించుకోవద్దని సూచించారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా సోమవారం విజయవాడకు వచ్చిన నడ్డా రాత్రి నగరంలో రాష్ట్ర పార్టీ కోర్ కమిటీ నేతలతో భేటీ అయ్యారు.
రాష్ట్రంలో ఉన్న సహచర పార్టీలు పొత్తులపై ఎలాంటి అంశాలను చర్చకు తీసుకొచ్చినప్పటికీ మన ప్రతి ఆలోచన, కార్యక్రమం మాత్రం స్వయంకృషితో నిర్ణయాత్మక శక్తిగా ఎదిగేలా ఉండాలని నడ్డా సూచించారు. బీజేపీ మాతో కలిసి పోటీచేస్తుందని కొన్ని ప్రత్యర్థి పార్టీల మైండ్ గేమ్ గురించి ఆలోచించవద్దన్నారు.
తెలంగాణలో అక్కడి నేతలు పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టడంతో ఇప్పుడు అక్కడ మన పార్టీ ప్రత్యామ్నాయ స్థాయికి ఎదిగిందని చెప్పారు. రాబోయే రోజుల్లో కేంద్ర మంత్రులు ఎక్కువగా రాష్ట్ర పర్యటనలకు వస్తారని చెప్పారు. అలాగే, జూలైలో మోదీ రాష్ట్ర పర్యటన సమయంలో ర్యాలీ నిర్వహించే అంశం గురించి చర్చించారు.
సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుతోపాటు ఇతర నేతలు జాతీయ సహ సంఘటనా కార్యదర్శి శివప్రకాష్, పురంధరేశ్వరి, సునీల్ దియోధర్, సత్యకుమార్, కన్నా లక్ష్మీనారాయణ, సీఎం రమేష్, జీవీఎల్ నరసింహారావు, టీజీ వెంకటేష్, పీవీఎన్ మాధవ్, విష్ణువర్థన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం సోము వీర్రాజు మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేకతను, మోదీ సంక్షేమం–అభివృద్ధిని పొలింగ్ బూత్ స్థాయికి తీసుకెళ్లెలా కోర్ కమిటీ సమావేశంలో రోడ్ మ్యాప్‌ను సిద్ధంచేసినట్లు చెప్పారు.
నేతల చేతుల్లోనే బీజేపీ పురోగతి
అంతకుముందు.. నడ్డా బీజేపీ శక్తి కేంద్ర ఇన్‌చార్జిల రాష్ట్రస్థాయి సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో పార్టీ పురోగతి నాయకులు, కార్యకర్తలు చేతుల్లోనే ఉందని.. పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఎనిమిదేళ్లలో మోదీ ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధికి అందించిన తోడ్పాటుపై రాష్ట్ర బీజేపీ రూపొందించిన పుస్తకాన్ని నడ్డా ఆవిష్కరించారు. అనంతరం నాలుగైదు పోలింగ్ బూత్‌లను కలిపి ఒకటిగా పేర్కొనే శక్తి కేంద్రాల ఇన్‌చార్జిలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే..
‘మిగతా పార్టీలకు భిన్నంగా మన పార్టీకి విలువలతో కూడిన సిద్ధాంతం, మోదీ లాంటి బలమైన నాయకత్వం ఉండటం మనందరి అదృష్టం. పార్టీ మీకు ఒక దారి చూపుతుంది. ఆ మార్గంలో మీరు నడిస్తే చాలు. మీరే కార్యక్షేత్ర యోధులు. శక్తి కేంద్రాల ఇన్‌చార్జిలు తమ పరిధిలోని బూత్‌ల వారీగా సమావేశాలు నిర్వహించి, కొత్త కార్యకర్తలను చేర్చుకుంటూ కమిటీలు వేయాలి. వీటిల్లో మహిళలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, మైనార్టీ ఇలా అన్నివర్గాల వారికి స్థానం కల్పించాలి. వీరు ప్రతిరోజూ ఐదుగుర్ని కలిసి పార్టీ సిద్ధాంతాలను వివరించాలి. వీలైతే ఆ ఐదుగురిని పార్టీలో చేర్పించాలి.
బీజేపీకి పోటీవచ్చే పార్టీల్లేవు
ప్రస్తుతం జాతీయ స్థాయిలో బీజేపీకి పోటీవచ్చే పార్టీల్లేవు. బీజేపీ రాజకీయంగా కుటుంబ పార్టీలతోనే పోరాడుతోంది. ఏపీలోని వైఎస్సార్‌సీపీ, టీడీపీ కూడా కుటుంబ పార్టీలే. పేదల కోసం కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలుచేస్తోంది. కేంద్రం అమలుచేసే ఆయుష్మాన్ భారత్ పథకాన్నే ఏపీ ప్రభుత్వం ఆరోగ్యశ్రీగా పేరుమార్చి అమలుచేస్తోంది’.
ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ : సోము
ఆ తర్వాత సోము వీర్రాజు మాట్లాడుతూ.. ఇటీవల కాలంలో వివిధ ప్రజా సమస్యలపై పోరాటం చేయడం ద్వారా రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ ఎదుగుతోందన్నారు. సాయంత్రం విజయవాడ నగర ప్రముఖులతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలోనూ నడ్డా మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment