
ఏ1 కేసీఆర్, ఏ2 హరీశ్‌రావు, ఏ3 వెంకట్రాంరెడ్డి,ఏ4గా కేటీఆర్ పేరు చేర్చాలి
2015లో రేవంత్‌రెడ్డి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పక్కన పెట్టి... ఆ తర్వాత ఫోన్‌ట్యాపింగ్‌లపై విచారణ ఎందుకు?
మీ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో స్టీఫెన్ రవీంద్ర చెప్పిన 30 కోట్లు ఎక్కడికి పోయాయి: రఘునందన్‌రావు
సాక్షి, హైదరాబాద్: కేసీఆర్ సీఎం అయిన 2014 జూన్ 2 నుంచి జరిగిన ఫోన్ ట్యాపింగ్‌లపై విచారణ జరిపించి.. తప్పు చేసిన వారిని శిక్షించాలని బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్‌రావు డిమాండ్ చేశారు. తాను ఫోన్‌ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి సమాజం ఎదుట ఇన్ని ఆధారాలు పెట్టినా కూడా సీఎం రేవంత్ ఎందుకు స్పందించడం లేదో చెప్పాలని, అన్ని తెలిసి కూడా సీఎం సగం మాత్రం బయటపెట్టడం కూడా సరికాదన్నారు. మంగళవారం బీజేపీ కార్యాలయంలో రఘునందన్‌రావు మీడియాతో మాట్లాడారు.
2015లో జరిగిన ఓటుకు కోట్లు కేసులో జరిగిన రేవంత్‌రెడ్డి ఫోన్‌ట్యాపింగ్ వ్యవహారాన్ని పక్కన పెట్టి 2016 నుంచి జరిగిన ఫోన్ ట్యాపింగ్‌లపై విచారణ అని ఎందుకు చెబుతున్నారని ప్రశ్నించారు. మునుగోడు, దుబ్బాక ఎన్నికల్లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని రేవంత్‌రెడ్డి ఎందుకు ప్రస్తావిస్తున్నారని నిలదీశారు. రేవంత్‌రెడ్డి ఓటుకు కోట్ల కేసుపై కూడా విచారణ జరిపితేనే ప్రజలు నమ్ముతారని చెప్పారు. 2015లో జరిగిన తన టెలిఫోన్ ట్యాపింగ్ ఎందుకు పక్కకు పెడుతున్నారో సీఎం సమాధానం చెప్పాలన్నారు. ‘రేవంత్‌రెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు అప్పటి డీజీపీ అనురాగ్‌శర్మ, సిటీ పోలీస్ కమిషనర్ ప్రస్తుత టీఎస్‌పీఎస్సీ చైర్మన్ మహేందర్‌రెడ్డి.
ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్‌రెడ్డి, ఎస్‌ఐబీలో ఉన్నది ప్రస్తుత ఆర్టీసీ చైర్మన్ సజ్జనార్... రేవంత్‌రెడ్డి ఇవ్వన్ని ఎందుకు దాచిపెడుతున్నారో సమాధానం చెప్పాలి’అని డిమాండ్ చేశారు. ప్రస్తుతం బయటపడిన ఫోన్‌ట్యాపింగ్ కేసులో అప్పటి సీఎం, అప్పటి డీజీపీలను ఎందుకు ముద్దాయిలుగా చేర్చడం లేదని ప్రశ్నించారు. నిజంగానే కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ల మధ్య ఒప్పందం లేకపోతే మాజీ సీఎం కేసీఆర్ పేరును ఎందుకు ఇందులో చేర్చడం లేదని నిలదీశారు. ఫోన్ ట్యాపింగ్‌లో మొదటి ముద్దాయిగా కేసీఆర్, ఆ తర్వాత హరీశ్‌రావు, వెంకట్రాంరెడ్డి, కేటీఆర్, నవీన్‌రావు, సందీప్‌రావుల పేర్లు వరుసగా చేర్చాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ల అవగాహనతోనే విచారణ
ప్రస్తుతం ఈ కేసు విచారణ కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ల మధ్య కుదిరిన అవగాహనతోనే జరుగుతోందని రఘునందన్‌రావు ఆరోపించారు. మునుగోడు ఉపఎన్నికలో రూ.3.5 కోట్లు పట్టుకున్నా, ఇప్పటి కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి ఎందుకు ఫిర్యాదు చేయడం లేదు? ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కూడా ఫోన్ ట్యాపింగ్ బాధితుడే అయినా ఎందుకు ఫిర్యాదు చేయడం లేదు అని ప్రశ్నించారు. మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఐపీఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్ర చెప్పిన రూ.30 కోట్లు ఎక్కడకు పోయాయని నిలదీశారు.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై తాను ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసు ఉన్నతాధికారులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నీ పరిశీలిస్తే ఫోన్‌ట్యాపింగ్ వ్యవహారంలో సెలెక్టివ్ విచారణ జరుగుతున్నదనే అనుమానం కలుగుతోందన్నారు. ‘దుబ్బాక ఉపఎన్నిక సమయంలో నా ఫోన్ ట్యాప్ జరిగిందని డీజీపీకి చెప్పాను. అప్పటి జిల్లా కలెక్టర్, ప్రస్తుత మెదక్ బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రాంరెడ్డి, మాజీ మంత్రి హరీశ్‌రావును ముద్దాయిగా చేయాలని చెప్పిన. ఎందుకు చేర్చుతలేరో రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పాలి’అని డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బంగారు దుకాణాల ఓనర్లను బెదిరించి వాళ్ల దగ్గర తెచ్చిన బంగారంతో యాదగిరి టెంపుల్ కట్టారా అని ప్రశ్నించారు.
రఘునందన్‌రావుపై కేసు నమోదు
సంగారెడ్డి: మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీశ్‌రావు, మెదక్ బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రాంరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్‌రావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘన, అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ రెండు రోజుల క్రితం సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment