సాక్షి, న్యూఢిల్లీ: తెలుగుదేశం పార్టీ ఒక కుటుంబ పార్టీ, అవినీతి పార్టీ అని బీజేపీ ఏపీ సహ ఇన్‌చార్జి సునీల్ దేవ్‌ధర్ చెప్పారు. ఆ పార్టీకి ఒక దశ, దిశ ఏదీ లేదని ఎద్దేవా చేశారు. తెలంగాణలో టీడీపీకి తాళం వేశారని, ఆంధ్రాలోనూ త్వరలోనే తాళం పడుతుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడే కెమెరా ముందు వ్యాఖ్యానించడం చూస్తే పరిస్థితి అర్థమవుతుందని అన్నారు. దేవ్‌ధర్ బుధవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడికే సొంత పార్టీపై విశ్వాసం లేదని, అలాంటి పార్టీతో బీజేపీకి పొత్తు ప్రశ్నే ఉత్పన్నం కాదని స్పష్టం చేశారు.
ఎన్నికల్లో గెలిచేందుకు సీట్ల కోసం, సీఎం పదవి కోసం పొత్తు గురించి మాట్లాడే ఆలోచన చేయబోమన్నారు. బీజేపీలో రాష్ట్ర ఇన్‌చార్జి, సహ ఇన్‌చార్జిలే పార్టీ అభిప్రాయాన్ని వెల్లడిస్తారని చెప్పారు. తమ పార్టీ జాతీయ నాయకత్వానికి తామే కళ్లు, చెవులు అని తెలిపారు. పార్టీలో హైకమాండ్ వేరు, ఇన్‌చార్జిలు వేరు కాదని వ్యాఖ్యానించారు. తాము ఏ విషయంపై మాట్లాడినా పార్టీ అధిష్టానం ప్రతినిధులుగానే చెబుతామన్నారు. 2019 సాధారణ ఎన్నికల నాటి నుంచి కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు సన్నిహితంగా ఉన్నారని, టీడీపీ సహకరించడం వల్లే బద్వేలు ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఓటు బ్యాంకులో పెరుగుదల కనిపించిందని వ్యాఖ్యానించారు.
బద్వేలులో బీజేపీకి ఓటమి ఎదురైనా, ఫలితాలు సంతోషాన్ని ఇచ్చాయని పేర్కొన్నారు. గతంలో 700 ఓట్లు వచ్చిన నియోజకవర్గంలో ఇప్పుడు 21 వేల ఓట్లు వచ్చాయన్నారు. 0.7 శాతం నుంచి 15 శాతానికి బీజేపీ ఓట్ల శాతం పెరిగిందని తెలిపారు. భారీగా రిగ్గింగ్ జరిగినప్పటికీ బీజేపీకి ఇన్ని ఓట్లు దక్కాయని, చాలా తక్కువ సమయంలో ఇంత పురోగతి సాధించగలిగామని అన్నారు. ప్రతి ఎన్నికల్లో బీజేపీ–జనసేన కలిసి పోటీ చేస్తాయని ఆయన పేర్కొన్నారు.
టీడీపీ.. ఓ కుటుంబ, అవినీతి పార్టీ
Published Thu, Nov 4 2021 3:29 AM | Last Updated on Thu, Nov 4 2021 3:29 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment