
సాక్షి, హైదరాబాద్/గచ్చిబౌలి: తెలంగాణలోనే కాకుండా దక్షిణ భారత రాజకీయాల్లో కీలకమార్పులకు బీజేపీ జాతీయకార్యవర్గ భేటీ నాంది కానుందని ఆ పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి, రాష్ట్ర ఇన్‌చార్జీ తరుణ్‌ఛుగ్ అన్నారు. 3న పరేడ్‌గ్రౌండ్స్‌లో జరగనున్న ప్రధాని మోదీ బహిరంగసభ రాష్ట్ర చరిత్రలో ఒక కీలకమలుపుగా నిలవబోతుందని, దీని ద్వారా తెలంగాణలో భారీమార్పులు చోటుచేసుకో బోతున్నాయని చెప్పారు.
శనివారం ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, జాతీయ అధికార ప్రతినిధి సంజయ్ మయూక్, జాతీయ సమావేశాల మీడియా సమన్వయకర్త ఎన్.రామచంద్రరావు లతో కలసి తరుణ్‌ఛుగ్ విలేకరులతో మాట్లాడారు. ఈ సభలో మోదీ ప్రసంగంతో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పారు. ఈ ‘మేధోమథన శిబిరం’లో మొత్తం 340 మంది ప్రతినిధులు పాల్గొని భవిష్యత్ రాజకీయ కార్యాచరణను ఖరారు చేస్తారన్నారు.
దేశవర్తమాన రాజకీయాలు, 8 ఏళ్ల మోదీ పాలనా విజయాలు, ప్రతినిధులు నిర్ణయించే అంశాలపై పలు తీర్మానాలు ఉంటాయన్నారు. దేశాన్ని బలోపేతం చేసే కార్యక్రమాలను నిర్ణయిస్తారన్నారు. జూలై 1న పార్టీ ప్రధానకార్యదర్శులు ఎజెండాపై చర్చిస్తారని, 2న ఉదయం 138 మంది పదాధికారుల భేటీ ఉంటుందని, రెండో తేదీ సాయంత్రం నుంచి 3వ తేదీ సాయంత్రం వరకు కార్యవర్గ భేటీ, ఆపై పరేడ్‌గ్రౌండ్స్‌లో సభ ఉంటుందని వివరించారు.
కేసీఆర్‌కు బైబై చెప్పే టైమొచ్చింది..
‘సీఎం కేసీఆర్‌కు ఇక బైబై చెప్పే టైమొచ్చింది. మునిగిపోతున్న తమ పడవను కాపాడుకునేందుకు ఆయన ఏం చేసినా ప్రయోజనం ఉండదు. భారత్‌లోనే నంబర్ వన్ అబద్ధపు హామీల సర్కార్ కేసీఆర్‌దే. అవినీతికి పరాకాష్టగా నిలిచింది’అని తరుణ్‌ఛుగ్ ధ్వజమెత్తారు. ‘ప్రజలకు బంగారు తెలంగాణ స్వప్నం చూపించి కేసీఆర్ పరివారం బంగారు కుటుంబం కలను నెరవేర్చుకుంది.
టీఆర్ ఎస్ 8 ఏళ్ల పాలనలో ప్రజలకు, ఉద్యమకారులకు ఊపిరాడని పరిస్థితులు ఏర్పడ్డాయి. వారంతా తమ కు తీరని ద్రోహం, మోసం జరిగిందని వాపోతున్నా రు’అని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, యువత, నిరుద్యోగులు, మహిళలు, రైతులు... ఇలా అన్ని వర్గాలను కేసీఆర్ విస్మరించారని విమర్శించారు. 8 ఏళ్ల మోదీ పాలనపై సంజయ్‌తో కేసీఆర్ బహిరంగచర్చకు రావాలని సవాల్ విసిరారు.
Comments
Please login to add a commentAdd a comment