
నెల్లూరు(బారకాసు): మాజీ సీఎం చంద్రబాబు ఆడించినట్లు కమ్యూనిస్టు నేతలు ఆడుతున్నారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి విమర్శించారు. తమ పార్టీ ఆస్తులను పెంచుకునేందుకే కమ్యూనిస్టులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు నగరంలో ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి నివాసంలో ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ప్రధాని నరేంద్రమోదీపై సీపీఎం, సీపీఐ నేతలు చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. 303 సీట్లు గెలుపొందిన బీజేపీపై విమర్శలు చేయడం సిగ్గు చేటని తెలిపారు. ఏపీలో బీజేపీని వ్యతిరేకించండని కమ్యూనిస్టులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. గతంలో ఇచ్చిన స్థానిక ఎన్నికల నోటిఫికేషన్‌ను రద్దు చేసి..మళ్లీ కొత్తగా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయాలని తమ పార్టీ ఎన్నికల సంఘానికి లేఖ రాసిందని స్పష్టం చేశారు.