
సాక్షి, అమరావతి: రాష్ట్ర విభజన అనంతరం 2014లో కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు తన చేతగాని పాలనలో రాష్ట్రాన్ని అధోగతి పాల్జేశారని బీజేపీ ఆరోపించింది. పార్లమెంట్ కొత్త భవనాన్ని ప్రధాని మోదీ రూ.వెయ్యి కోట్లతో కొద్దినెలల వ్యవధిలోనే నిర్మాణం పూర్తి చేస్తే.. కేంద్రం నుంచి రూ.2 వేల కోట్లు తీసుకున్న చంద్రబాబు కనీసం శాసనసభకు శాశ్వత నిర్మాణం పూర్తి చేయలేదని విమర్శించింది.
విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ ఈ కారణంగా రాష్ట్రంలో ఇప్పుడు మూడు రాజధానుల అంశం తెరపైకి వచ్చిందన్నారు.
వివిధ సంధర్బాల్లో తెలుగుదేశం పార్టీ రాజకీయ పార్టీ కార్యక్రమాల్లో పదులకొద్దీ ప్రజలు మరణించినా ఆ పార్టీలో ఎటువంటి మార్పు లేకుండా అదే తరహాలో కార్యక్రమాలు కొనసాగించడం వల్లే ప్రభుత్వం అప్రజాస్వామిక జీవో నంబరు 1 తీసుకొచ్చిందని విమర్శించారు. మూడు దశాబ్దాలు రాష్ట్రంలో వివిధ కారణాల వల్ల పొత్తులు పెట్టుకుని బీజేపీ నష్టపోయిందని వ్యాఖ్యానించారు.