
సాక్షి, న్యూఢిల్లీ: అధికార పక్షం తరపున రాష్ట్రపతి అభ్యర్థిగా ఎవరిని నిలబెడతారనే చర్చ జోరందుకుంది. ఈ తరుణంలో.. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో జేపీ నడ్డా, అమిత్ షా భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
మంగళవారం వెంకయ్యనాయుడుని కలిసి.. హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చర్చించారు. ఈ తరుణంలో.. రాష్ట్రపతి రేసులో వెంకయ్యనాయుడును నిలబెడతారా? అనే చర్చ మొదలైంది. గతంలో ఉపరాష్ట్రపతి పదవి చేపట్టిన వాళ్లు.. రాష్ట్రపతిగానూ పదోన్నతి పొందిన దాఖలాలు ఉన్నాయి. ఉపరాష్ట్రపతులుగా చేసిన సర్వేపల్లి రాధాకృష్ణన్, జాకీర్ హుస్సేన్, వి.వి. గిరి, ఆర్. వెంకట్రామన్, డాక్టర్ శంకర్ దయాళ్ శర్మ, కె.ఆర్ నారాయణన్‌లు రాష్ట్రపతులయ్యారు.
ఇదిలా ఉండగా.. రాష్ట్రపతి అభ్యర్థి నామినేషన్ల పర్వం మొదలై.. వారం గడుస్తున్నా ఇటు ఎన్డీయే, అటు విపక్షాల కూటమి అభ్యర్థిని అధికారికంగా ప్రకటించలేదు. విపక్షాలు మరోసారి భేటీ కానున్న తరుణంలో.. బీజేపీ కమిటీ మాత్రం అభ్యర్థి ఎవరనేది కనీసం హింట్ కూడా ఇవ్వలేదు.
మంగళవారం రాత్రి 7 గంటలకు బీజేపీ పార్లమెంటరీ బోర్డ్ సమావేశం జరగనుంది. ఈ భేటీలో.. రాష్ట్రపతి అభ్యర్థిని ఖరారు చేయొచ్చని భావిస్తున్నారు. ఇక విపక్షాల తరపున యశ్వంత్ సిన్హా పేరు తెర మీదకు వచ్చింది. అయితే అందరి ఆమోదయోగ్యమైన పేరును ప్రకటిస్తామని సీపీఐ నేత డి రాజా చెప్తున్నారు. జులై 18వ తేదీన రాష్ట్రపతి ఎన్నిక జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment