సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బీజేపీ అసమ్మతి నేతలు అల్టిమేటం వరకు వెళ్లారు. ప్రాంతీయ పార్టీని సమర్థంగా ఎదుర్కొనే దిశలో రాష్ట్రంలో పార్టీ కార్యక్రమాలు జరగడం లేదని ఎన్నిసార్లు అధిష్టానం పెద్దలకు చెప్పినప్పటికీ పట్టించుకోవడం లేదని, నెలాఖరు వరకు వేచి ఉండాలని, అప్పటికి కూడా పార్టీ వైఖరిలో మార్పు రాకపోతే తాడోపేడో తేల్చుకోవాలని వారు నిర్ణయించినట్టు సమాచారం. మాజీ ఎమ్మెల్యే గుజ్జల రామకృష్ణారెడ్డి నేతృత్వంలో పార్టీ నేతలు చింతా సాంబమూర్తి, సుగుణాకర్‌రావు, వెంకటరమణి, డా. మల్లారెడ్డి, పాపారావు తదితరులు ఆదివారం సాయంత్రం ఎమ్మెల్యే క్వార్టర్లలో భేటీ అయినట్టు తెలిసింది.
పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వైఖరి, రాష్ట్ర ఇంచార్జుల వ్యవహారశైలిపైనే ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించారని చెబుతున్నారు. సంజయ్ ఏకపక్ష ధోరణితో వెళ్తున్న ఒంటెత్తు పోకడల కారణంగా పార్టీ నష్టపోతోందని, ఈ విషయాన్ని ఎన్నిసార్లు పార్టీ ఇన్‌చార్జుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని, బయటి నుంచి వచ్చిన ఇన్‌చార్జులు పార్టీలో సమన్వయంతో పాటు పాత, కొత్త నేతల మధ్య సర్దుబాటుకు ప్రయత్నించకపోగా, పెత్తనం చేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమైందని తెలుస్తోంది.
తన సొంత ప్రచారం, ఆధిపత్యం కోసమే బండి సంజయ్ పాకులాడుతున్నారు తప్ప పార్టీలోని సీనియర్లకు గౌరవం, కార్యక్రమాల నిర్వహణలో ప్రాధాన్యం ఇవ్వడం లేదని, జిల్లాలకు వచ్చినప్పుడు కూడా తగిన విధంగా వ్యవహరించడం లేదని ఇప్పటికే ఢిల్లీ పెద్దల దృష్టికి పలుమార్లు తీసుకువెళ్లినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నెలాఖరు వరకు పార్టీలో మార్పు వస్తుందనే ఆశతో ఎదురుచూడాలని నిర్ణయించినట్టు చెబుతున్నారు.
చదవండి: Rahul Gandhi: రాహుల్ ‘తుడిచివేత’ వ్యాఖ్యల వెనుక మర్మమేంటో..?
ఢిల్లీకి సంజయ్
కాగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆదివారం ఢిల్లీ వెళ్లారు. పార్టీ అధిష్టానం కబురు వచ్చినందునే ఆయన ఢిల్లీ వెళ్లారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర బీజేపీలో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో ఏం జరుగుతుందనే ఉత్కంఠ కూడా బీజేపీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment