
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల లోక్‌సభ అభ్యర్ధలను ప్రకటించేందుకు బీజేపీ అగ్రనాయకత్వం సిద్ధమైంది. ఈ తరుణంలో కర్ణాటక లోక్‌సభ స్థానాల్లో భారీ మార్పులు చేయడంతో పాటు పలువురు సిట్టింగ్ ఎంపీలకు మరోసారి అవకాశం ఇచ్చేందుకు బీజేపీ సుముఖంగా లేదని తెలుస్తోంది.
ఇటీవల, కర్ణాటకకు చెందిన బీజేపీ ఎంపీ అనంత్ కుమార్ హెగ్డే రాజ్యాంగ సవరణకు సంబంధించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత రాజ్యాంగాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉందని, అది బీజేపీ మాత్రమే చేయగలుగుతుందన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో 400 సీట్లు సాధించుకుంటే అది సాధ్యమవుతుందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఆ వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహంతో ఉంది. ఫలితంగా హెగ్డే కర్ణాటక ఉత్తర కన్నడ లోక్‌సభ స్థానాన్ని మరో అభ్యర్ధికి కేటాయించాలని భావిస్తోంది. పలు మీడియా సంస్థల కథనాల ప్రకారం.. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై హవేరీ-గడగ్ స్థానం నుంచి బరిలోకి దిగే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.హెడ్గేతో పాటు మరికొంత మంది నేతలను కర్ణాటక నుంచి తప్పించే అవకాశం ఉంది.
మైసూరు నుంచి ప్రతాప్ సింహా, దావణగెరె నుంచి కేంద్ర మాజీ మంత్రి జీఎం సిద్దేశ్వర, బళ్లారి నుంచి యరబాసి దేవేంద్రప్ప, కొప్పల్ నుంచి కారడి సంగన్న అమరప్ప, బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, మంగళూరు ఎంపీ నళిన్ కుమార్ కటీల్‌కు సీట్లు ఇవ్వకపోవచ్చని ఊహాగానాలు వెలుగులోకి వచ్చాయి.
ప్రస్తుతం ఉడిపి చిక్‌మంగళూరు ఎంపీగా ఉన్న కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే బెంగళూరు నార్త్ సీటుకు మారే అవకాశం ఉంది. ఆమెకు టికెట్ ఇవ్వవద్దని కోరుతూ కొందరు పార్టీ నేతలు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు లేఖ రాసినట్లు సమాచారం.
స్పష్టత వచ్చేది అప్పుడే
లోక్‌సభ అభ్యర్థుల రెండో జాబితాపై నిర్ణయం తీసుకునేందుకు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) సోమవారం రెండోసారి సమావేశం నిర్వహించింది. గుజరాత్, మహారాష్ట్ర, బీహార్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, చండీగఢ్ రాష్ట్రాల్లోని 99 సీట్లపై చర్చ జరిగింది. చర్చల అనంతరం లోక్‌సభ అభ్యర్ధుల ఎంపికపై కొలిక్కి రాగా.. తర్వలోనే అభ్యర్ధుల రెండో జాబితా విడుదల చేయనుంది. అభ్యర్ధుల ప్రకటన తర్వాతే.. కర్ణాటక బీజేపీలో మార్పులు, చేర్పులు గురించి స్పష్టత రానుంది.
Comments
Please login to add a commentAdd a comment